YS Sharmila: టీఎస్పీఎస్సీ కార్యాలయం ఎదుట తీవ్ర ఉద్రిక్తత, వైఎస్ షర్మిల అరెస్టు
టీఎస్పీఎస్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సరికాదని వైఎస్ షర్మిల మండిపడ్డారు. సీబీఐకు అప్పగిస్తూ నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
వైఎస్ఆర్ సీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల టీఎస్పీఎస్సీ కార్యాలయ ముట్టడికి పిలుపు ఇవ్వడం ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీని నిరసిస్తూ శుక్రవారం ఉదయం టీఎస్పీఎస్సీ కార్యాలయ ముట్టడికి షర్మిల యత్నించారు. టీఎస్పీఎస్సీ ఆఫీసు ముందు షర్మిల రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని షర్మిలను అరెస్ట్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసును సీబీఐకు అప్పగిస్తూ నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. తాము శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అనుమతి ఇవ్వాలని షర్మిల పోలీసులను కోరగా.. అందుకు పోలీసులు నిరాకరించారు.
టీఎస్పీఎస్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సరికాదని వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని మంత్రి కేటీఆర్ కేవలం ఇద్దరికి మాత్రమే ముడిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పేపర్ లీకైనట్లుగా 2017 నుంచి వార్తలు వస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సరిగ్గా విచారణ చేయడం లేదని షర్మిల అన్నారు. ఈ కేసులో స్పష్టమైన ఆధారాలు సేకరించడంలో విఫలమవుతోందని ఆరోపించారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపైనా కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.