Scene Reconstruction: జూబ్లీహిల్స్ రేప్ కేసు: సీన్ రీకన్‌స్ట్రక్షన్ అంటే ఏంటి? పోలీసులు ఇది ఎందుకు చేస్తారు?
Scene Reconstruction Means: క్రైమ్ సీన్ రీ కన్‌స్ట్రక్షన్ ఎందుకు చేస్తారు? నిందితులు ఫలాన వాళ్లే అని గుర్తించాక, వారిని విచారణ జరిపాక ఈ రీ కన్‌స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఏముంటుంది?
జూబ్లీహిల్స్ లో 17 ఏళ్ల బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. నేరం జరిగాక నిందితులను అరెస్టు చేసిన అనంతరం పోలీసులు క్రైమ్ సీన్ రీ కన్‌స్ట్రక్షన్ ఎందుకు చేస్తారు? నిందితులు ఫలాన వాళ్లే అని గుర్తించాక, వారిని విచారణ జరిపాక ఈ రీ కన్‌స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? అసలు రీ కన్‌స్ట్రక్షన్‌లో పోలీసులు ఏ అంశాలు గుర్తిస్తారు?
ఏదైనా ఒక నేరానికి సంబంధించి అది ప్రారంభం అయిన దగ్గర్నుంచి నేరం పూర్తయ్యే వరకూ జరిగిన పరిణామాలను, ఆ క్రమాన్ని తిరిగి ఘటనా స్థలంలోనే నిందితులతో ప్రత్యక్షంగా ఆవిష్కరిస్తారు. దీన్నే ‘క్రైమ్ సీన్ రీ కన్‌స్ట్రక్షన్’గా పిలుస్తారు. ఈ క్రమంలోనే విచారణలో తాము సేకరించిన వివరాలను సరిపోల్చుకుంటూ, ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తారు. దీనివల్ల వారికి మరిన్ని ఆధారాలు సేకరించడం సులువు అవుతుంది. ఒక్కోసారి విచారణలో తాము కనుగొన్న విషయాలకు తోడు మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది.
ఘటనా స్థలంలో ఇంకా ఏవైనా ఆధారాలు లభించే అవకాశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అంతకుముందు విచారణలో నిందితులను ప్రశ్నించడం, సాక్షులను విచారణ జరపడం, బాధితుల స్థితి, వారి వస్తువులు వంటి అనేక అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని నేరం జరిగిన క్రమం ఎలా జరిగిందో పోలీసులు అంచనా వేస్తారు. ఒక్కోసారి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయడం ద్వారా కొత్త విషయాలు తెలుస్తాయి. పోలీసులు నిందితులను పటిష్ఠ భద్రత నడుమ ఘటనా స్థలానికి తీసుకెళ్లి, సీన్‌ను రీ కన్‌స్ట్రక్ట్ చేస్తారు.
మొత్తం నేరాన్ని నిందితులు ఘటనా స్థలంలో పోలీసులకు వివరిస్తుండగా, వారు తమ అనుమానాలను నివృత్తి చేసుకుంటుంటారు. వాటి ఆధారంగా నిందితులను మరిన్ని ప్రశ్నలు వేసి, వాటిని ధ్రువీకరించుకుంటారు. ఇలా సేకరించిన ఆధారాలతో నేరాన్ని నిరూపించే అవకాశాలు బలపడతాయి.
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ నిందితులను కూడా..
విచారణలో భాగంగా జూబ్లీహిల్స్ పోలీసులు నిందితులను ఘటనా స్థలానికి తీసుకొని వెళ్లి ఆదివారం (జూన్ 12) సీన్ ను రీకన్‌స్ట్రక్షన్ చేశారు. ప్రధాన నిందితుడిగా ఉన్న 18 ఏళ్ల దాటిన వ్యక్తి సాదుద్దీన్ తో పాటు మరో ఐదుగురు నిందితులను పోలీసులు రెండ్రోజుల క్రితం తమ కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వారితో తాజాగా నేరం జరిగిన తీరుకు సంబంధించి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. నేరం జరిగే సమయంలో నిందితులు తిరిగిన జూబ్లీహిల్స్ లోని ఆమ్నేషియా పబ్, బంజారాహిల్స్ లోని కాన్సూ బేకరీ, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36, రోడ్డు నంబర్ 44 ప్రాంతాలకు నిందితులను తీసుకొని వెళ్లారు. అక్కడ సీన్‌ను రీకన్‌స్ట్రక్ట్ చేశారు. అనంతరం వారిని జూబ్లీహిల్స్ పీఎస్ కు తరలించారు.