(Source: Poll of Polls)
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం- సిట్ విచారణకు కేంద్రమంత్రి బండి సంజయ్!
Telangana Phone Tapping Case:ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ నెల 24న సిట్ విచారణకు కేంద్రమంత్రి బండి సంజయ్ రానున్నారు. ఈ మేరకు సిట్ అధికారులకు సమాచారం అందించారు.

Telangana Phone Tapping Case: తెలంగాణలో రాజకీయ సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు తిరిగింది. ఇప్పటికే ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులను, మీడియా ప్రతినిధులను, అధికారులను ప్రశ్నించి సిట్ ఇప్పుడు కేంద్రమంత్రికి నోటీసులు జారీ చేసింది. నాటి ప్రభుత్వ హయాంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ఫోన్‌ను ట్యాప్ చేసినట్టు అధికారులు తేల్చారు. అందుకే ఆయన్ని పిలిచి సాక్షిగా స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు.
టెలీఫోన్ ట్యాపింక్ కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. విచారణకు సమయం ఇవ్వాలని నోటీసులో సిట్ అధికారులు సూచించారు. దీనిపై స్పందించిన బండి సంజయ్ ఈనెల 24న విచారణకు హాజరయ్యేందుకు అంగీకరించారు. ఆ రోజు వచ్చి తన వాంగ్మూలాన్ని ఇస్తానని సిట్ అధికారులకు రిప్లై ఇచ్చారు. హైదరాబాద్‌లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌లో బండి సంజయ్‌ను సిట్ అధికారులు విచారించనున్నారు.





















