TSRTC News: టీఎస్ఆర్టీసీ మాస్టర్ ప్లాన్! ఒక ప్రతి ఊరికి ఒక బస్ ఆఫీసర్ - ఎందుకో తెలుసా?
TSRTC Special Offer: టీఎస్ఆర్టీసీ మరో స్పెషల్ ఆఫర్ తో ప్రజల ముందుకు వచ్చింది. ప్రతీ పల్లెలో బస్ ఆఫీసర్లను నియమించాలని నిర్ణయించింది.
TSRTC Special Offer: ప్రజా రవాణా వ్యవస్థను ప్రజల ముంగిటకు తీసుకెళ్లేందుకు తెలంగాణ ఆర్టీసీ సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజలను తమ వైపునకు ఆకర్శించేందుకు తెలంగాణలోని గ్రామాల్లో బస్ ఆఫీసర్లను నియమించాలని నిర్ణయించింది. విలేజ్ బస్ ఆఫీసర్ల నియామకం, వారి విధి విధానాలకు సంబంధించిన మార్గదర్శకాలను టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ఐపీఎస్ గారు జారీ చేశారు. బస్ ఆఫీసర్లను వీలైనంత త్వరగా నియమించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ బస్ ఆఫీసర్ల వ్యవస్థ మే ఒకటో తేది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వస్తుందని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
ప్రజా రవాణా వ్యవస్థను ప్రజల ముంగిటకు తీసుకెళ్లేందుకు #TSRTC వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజలను తమ వైపునకు ఆకర్శించేందుకు తెలంగాణలోని గ్రామాల్లో బస్ ఆఫీసర్లను నియమించాలని నిర్ణయించింది. విలేజ్ బస్ ఆఫీసర్ల నియామకం, వారి విధి విధానాలకు సంబంధించిన మార్గదర్శకాలను…
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) April 22, 2023
విలేజ్ బస్ ఆఫీసర్ల మార్గదర్శకాలివే..!
- గ్రామాల్లో నివసించే సంస్థ కండక్టర్లు, డ్రైవర్లు, ఇతర ఉద్యోగులను విలేజ్ బస్ ఆఫీసర్లగా డిపో మేనేజర్లు నియమిస్తారు. నియామకాల్లో ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలుండి.. స్వచ్ఛందంగా పనిచేసేందుకు ముందుకువచ్చే వారికి ప్రాధాన్యం ఇస్తారు. పెద్ద గ్రామానికి ఒకరు బస్ ఆఫీసర్‌గా ఉంటారు. చిన్నవైతే రెండు, మూడు గ్రామాలకు ఒకరిని నియమిస్తారు. ఈ మార్గదర్శకాల ప్రకారం.. ఒక్కరికి 5 గ్రామాల కంటే ఎక్కువగా కేటాయించేందుకు వీల్లేదు.
- హైదరాబాద్ సహా మిగతా మున్సిపాలిటీల్లోనూ వార్డుకో బస్ ఆఫీసర్‌ను డిపో మేనేజర్లు నియమిస్తారు. వారు ఆయా వార్డుల పరిధిలో విలేజ్ బస్ ఆఫీసర్లలాగే పనిచేస్తారు.
- ఈ విలేజ్ బస్ ఆఫీసర్లు గ్రామస్థులతో నిత్యం టచ్‌లో ఉంటారు. ఈ బస్ అధికారులు 15 రోజులకోసారి గ్రామస్తులతో సమావేశమవుతారు. బస్సుల రాకపోకలు, సమయాలు, కొత్త రూట్‌లు, కొత్త సర్వీస్‌లు, సమస్యలు, తదితర అంశాల గురించి సమాచారాన్ని సేకరిస్తారు. ఆ సమాచారాన్ని పై అధికారులకు చేరవేస్తారు.
- గ్రామాల్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు, జాతరల వివరాలను వారు సేకరిస్తారు. రద్దీ ఎక్కువగా ఉంటే అందుకు తగ్గట్టుగా బస్ ట్రిప్పులను పెంచుతారు. అలాగే పెళ్లిళ్లు, శుభకార్యాలకు తమ అద్దె బస్సులను ఉపయోగించుకోవాలని వివరిస్తారు. ప్రైవేట్ వాహనాల్లో వెళ్తే జరిగే అనర్థాలను ప్రజలకు చెప్తారు.
- గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, సంఘాల నాయకులు, డ్వాక్రా గ్రూప్ సభ్యులతో పాటు పంక్షన్ హాల్స్ నిర్వాహకులను బస్ ఆఫీసర్లు సంప్రదిస్తారు. వారికి తమ సెల్‌ఫోన్ నంబర్లను అందజేస్తారు. ప్రజా రవాణా వ్యవస్థతో పాటు టీఎస్‌ఆర్టీసీ కార్యక్రమాలను వివరిస్తారు.
- ప్రతి గ్రామపంచాయతీ కార్యాలయంలోని నోటీస్ బోర్డులో సంబంధిత విలేజ్ బస్ ఆఫీసర్ వివరాలను స్థానిక డిపో మేనేజర్ పొందుపరుస్తారు. అందులో బస్ ఆఫీసర్ పేరు, ఫోన్ నంబర్ ఉంటుంది. ''మీ గ్రామానికి వచ్చే బస్సులకు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులు, రాయితీ పథకాలతో పాటు పెళ్లిళ్లు, శుభకార్యాలకు బస్సులను అద్దెకు పొందుటకు విలేజ్ బస్ ఆఫీసర్‌ను సంప్రదించండి." అని పేర్కొంటారు.
- అంతేకాదు, ప్రతి గ్రామ సర్పంచ్‌కు తమ విలేజ్ బస్ ఆఫీసర్ వివరాలను లేఖ రూపంలో తెలియజేస్తారు. ఆ ఆఫీసర్ సేవలను వినియోగించుకోవాలని కోరుతారు.
- మంచిగా పనిచేసే విలేజ్ బస్ ఆఫీసర్లను ప్రోత్సహించాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. ప్రతి మూడు నెలలకోసారి పనితీరు మంచిగా ఉన్న వారిని బెస్ట్ విలేజ్ బస్ ఆఫీసర్ అవార్డుతో సత్కరించనుంది. ఈ విధానం వల్ల అందరూ మంచిగా పనిచేసే అవకాశముంది.
- ''గ్రామాల్లో సర్వీస్‌లకు సంబంధించి ఎమైనా సమస్యలుంటే ప్రస్తుతం డిపో మేనేజర్లను సంప్రదించాలి. చాలా గ్రామాలకు డిపో దూరంగా ఉంది. శుభకార్యాలకు అద్దె బస్సులను బుక్ చేసుకోవాలన్నా అక్కడికి వెళ్లాల్సి వచ్చేది. విలేజ్ బస్ ఆఫీసర్ వ్యవస్థతో ఇక ఆ సమస్య ఉండదు. ప్రతి సమస్యను ప్రజలు వారి దృష్టికి తీసుకెళ్లొచ్చు. ప్రజల అవసరాలను చెప్పొచ్చు. ప్రజలు, టీఎస్‌ఆర్టీసీకి అనుసంధానకర్తల్లాగా ఈ ఆఫీసర్లు పనిచేస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 10 వేల గ్రామాలకు టీఎస్‌ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తోంది. ఆయా గ్రామాల్లో 2 వేలకు పైగా విలేజ్ బస్ ఆఫీసర్లను నియమించాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. సంస్థ ఏ కార్యక్రమం తీసుకువచ్చిన ప్రజలు మంచిగా ఆదరిస్తున్నారు. ఈ విలేజ్ బస్ ఆఫీసర్ల వ్యవస్థను వినియోగించుకుని ప్రోత్సహించాలి." అని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ కోరారు.