TS Inter Students Suicide: ముగ్గురు ఇంటర్ విద్యార్థుల ప్రాణాలు తీసిన ఫలితాలు - తక్కువ మార్కులొచ్చాయని సైతం !
TS Inter Students Suicide: ఇంటర్ ఫలితాలు మంగళవారం విడుదల కాగా, ఫెయిలయ్యామని ఇద్దరు విద్యార్థులు, తక్కువ మార్కులు వచ్చాయని మరో విద్యార్థి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు.
TS Inter Students Suicide: తెలంగాణలో ఇంటర్ ఫలితాలు మంగళవారం విడుదల కాగా, కొన్ని కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. వేర్వేరు చోట్లు ముగ్గురు ఇంటర్ విద్యార్థులు బలవన్మరణం చెందారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకరు ఆత్మహత్య చేసుకోగా, భాగ్యనగరంలో ఒకరు, ఖమ్మం జిల్లాలో మరో విద్యార్థి బలవన్మరణం చెందడం ఆ కుటుంబాలలో విషాదాన్ని నింపింది.
బావిలో దూకి ఆత్మహత్య
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జుజ్జులరావు పేట గ్రామానికి చెందిన సిరికొండ సాయి అనే విద్యార్థి కూసుమంచిలోని ఓ ప్రవేట్ కళాశాలలో ఇంటర్ చదివాడు. ఇటీవల జరిగిన ఫస్టియర్ పరీక్షలకు హాజరుకాగా, తాజాగా విడుదలైన ఫలితాల్లో ఫెయిలయ్యాడు. ప్రైవేట్ కాలేజీలో చదవడం అందులోనూ ఫెయిల్ కావడంతో.. ఇంట్లో వాళ్లు ఏమంటారోనన్న భయంతో మనస్తాపానికి లోనయ్యాడు. గ్రామ సమీపంలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫలితాలు వచ్చిన తరువాత కుమారుడు కనిపించక పోవడంతో సాయి తల్లితో పాటు, స్థానికులు చుట్టు పక్కల వెతకగా.. సమీపంలోని ఓ బావి వద్ద చెప్పులు కనిపించాయి. బావిలో చూడగా సాయి మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని స్థానికుల సాయంతో విద్యార్థి సాయి మృతదేహాన్ని బయటకు తీశారు. సాయి ఆత్మహత్యతో తల్లి కన్నీటి పర్యంతమైంది.
కరీంనగర్ /జగిత్యాల జిల్లాలో ఒకరు..
ఉమ్మడి కరీంనగర్ జగిత్యాల జిల్లాకు చెందిన విద్యార్ధిని ఇంటర్ ఫెయిల్ అవడంతో ఆత్మహత్య చేసుకుంది. వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామానికి చెందిన యాగండ్ల నిరోషా(17) ఇటీవల ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాసింది. తాజాగా విడుదలైన ఇంటర్ సెకండియర్ ఫలితాలలో రెండు సబ్జెక్ట్స్ ఫెయిల్ కావడంతో మనస్థాపం చెంది వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడంతో ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
మార్కులు తక్కువ వచ్చాయని మరో విద్యార్థి..
హైదరాబాద్‌లోనూ ఓ విద్యార్ధి ఇంటర్ ఫలితాలు చూసుకున్నాక బలవన్మరణం చెందాడు. గౌతమ్ కుమార్ (18) అనే విద్యార్థి ఖైరతాబాద్ లోని చింతలబస్తీలో కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. ఎంపీసీ చదువుతున్న గౌతమ్‌కు ఇంటర్ ఫలితాలలో తక్కువ మార్కులొచ్చాయి. తక్కువ మార్కులతో పాస్ కావడాన్ని అవమానంగా భావించిన విద్యార్థి ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన వెంటనే కుటుంబసభ్యులు కంగారు కంగారుగా గౌతమ్‌ను సమీపంలోని మహావీర్ ఆసుపత్రికి తరలించిన.. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయాడని నిర్దారించారు. ఇంటర్ సెకండియర్ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
Also Read: TS Inter Supplementary Exams Date: ఇంటర్‌లో తక్కువ మార్కులు వచ్చాయని టెన్షన్ వద్దు, ఇలా చేస్తే సరి !