(Source: Poll of Polls)
Congress Protest: ధర్నాలు.. బహిరంగసభలు - ప్రజల్లోకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ !
Congress Protest: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్రంలో నేడు, రేపు ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు రాజ్ భవన్ ముట్టడికి పెద్ద ఎత్తున నేతలు హాజరయ్యారు.
Congress Protest: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోడ్డెక్కింది. ఓ వైపు నేతల రాకపోకల హడావుడి సాగుతున్నా క్యాడర్ మాత్రం కేంద్ర, రాష్ట్రాలపై తమ పోరాటాన్ని కొనసాగితోంది. తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు ప్రారంభించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిరసనలు ప్రారంభించారు. దేశంలో తీవ్రమైన ఆర్థిక మాంద్యం, అడ్డగోలుగా పెరిగిన నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ , జీఎస్టీల పెంపు, నిరుద్యోగం, అగ్నిపథ్, రాష్ట్రంలో వరదలు తదితర అంశాలపై కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తోంది. జిల్లా, నియోజక వర్గ కేంద్రాలలో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్.. తెలంగాణ ప్రజలకు అండగా, తోడుగా ఉందని, రాబోయే ఎన్నికల్లో హస్తాన్ని గెలిపించుకుందామని కాంగ్రెస్ నేతలు ప్రజలకు పిలుపునిస్తున్నారు.
ఏఐసీసీ, టిపిసిసి ఆదేశాల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలనపై, నిత్యవసర ధరలు పెంచినందుకు, ఇటీవల కురిసిన వర్షాలకు నిరాశ్రయులైన వరద బాధితులకు ఎటువంటి సహాయ సహకారాలు అందించకుండా నిర్లక్ష్యం చేసినందుకు సామాన్య మధ్యతరగతి కుటుంబాల పై భారముతో మునుపెన్నడూ లేని(1/2) pic.twitter.com/ztDE1dkceV
— Venkat Balmoor (@VenkatBalmoor) August 5, 2022
ఇందిరా పార్కు వద్ద ముఖ్య నేతల నిరసన !
ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ ముఖ్య నేతలు నిరసన చేపట్టారు.నిత్యావసర వస్తువుల ధరలు రికార్డు స్థాయికి పెరిగిపోవడం, నిత్యావసర వస్తువుల ధరలపై జీఎస్టీ పెంచడం, అడ్డగోలుగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంపు, విపరీతమైన నిరుద్యోగం, అగ్నిపత్ పేరుతో సైనికులను అవమాన పరచడం, రాష్ట్రంలో వరదలతో తీవ్రంగా నష్టపోయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణం అని కాంగ్రెస్ నేతలు తెలిపారు. సామాన్య మధ్య తరగతి ప్రజలు బతికేందుకే చాలా కష్టపడాల్సి వస్తోందని.. బుక్కెడు బువ్వ తినేందుకు వందసార్లు ఆలోచిస్తున్నారంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజ్ భవన్ ముట్టడి కోసం ధర్నాకు వచ్చిన కాంగ్రెస్ నేతలు..
రాజ్ భవన్ ముట్టడి కోసం ముందుగా ఇందిరా పార్కు వద్దకు చేరుకున్నారు కాంగ్రెస్ నాయకులు. ఈ ధర్నాకు వర్కింగ్ ప్రెసిడెంట్స్ అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎంపీలు మల్లు రవి, వినోద్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, నూతి శ్రీకాంత్, మెట్టు సాయి, కత్తి కార్తీక, బొజ్జ సంధ్యారెడ్డి, కుమార్ రావ్, తదితరులు హాజరయ్యారు. వీరంతా ఇందిరా పార్కు నుంచి రాజ్ భవన్ ముట్టడిస్తారు. ఈ ధర్నాకు ఎమ్మెల్యే సీతక్క, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, నదీమ్, జవీద్, రోహిత్ చౌదరి, మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావ్, మైనారిటీ సెల్ చైర్మన్ సోహైల్, రోహిన్ రెడ్డిలు పాల్గొన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరుగుతున్న ధర్నాకు మొట్ట మొదటి సారిగా ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్ జావిద్, రోహిత్ చౌదరి హాజరయ్యారు.
కేంద్ర, రాష్ట్రాలకు వ్యతిరేకంగా నిరసనలు !
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అంతర్గత సమస్యలు ఎలా ఉన్నా.. ప్రజల కోసం పోరాటంలో వెనక్కి తగ్గబోమని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. చాలా మంది సీనియర్ నేతలు పార్టీ వ్యవహారాలపై అంటీ ముట్టనట్లుగా ఉన్నా.. రేవంత్ నేతృత్వంలో యువ నేతలు మాత్రం పోరాడుతున్నారు.