Hyderabad News: హైదరాబాద్‌లో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు- పెళ్లి చూపులకు వెళ్తూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి
Telangana News: హైదరాబాద్‌లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీరు సహా ముగ్గురు మృతి చెందారు. అతను పెళ్లి చూపులకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
Hyderabad Crime News: వనపర్తి జిల్లా లక్ష్మీపల్లికి చెందిన శివశంకర్ హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. మాధాపూర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి చేయాలని భావించిన తల్లిదండ్రులు అమ్మాయి కోసం వెతుకుతున్నారు. ఈ మధ్య కాలంలోనే ఓ సంబంధం గురించి మాట్లాడుతున్నారు. వాళ్లు ఆదివారం అబ్బాయిని చూసుకోవడానికి ఇంటికి వస్తున్నామని చెప్పారు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులరు శివశంకర్‌కు చెప్పారు.
పెళ్లి చూపుల కోసం శివశంకర్ బైక్‌పై ఊరు బయల్దేరాడు. అయితే అనుకోను ప్రమాదం ఆయన ప్రాణం తీసింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1లో టిప్పర్ అతన్ని బలంగా ఢీ కొట్టింది. అంత ఎత్తు ఎగిరి పడ్డ శివశంకర్ స్పాట్‌లోనే చనిపోయారు. ఈ విషయాన్ని స్థానికులు 108కి ఫోన్ చేసి చెప్పారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, వైద్యులు శివశంకర్‌ను పరీక్షించి చనిపోయినట్టు నిర్దారించారు. వెంటనే పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. వివరాలు తీసుకొని అతను పని చేస్తున్న ఆఫీస్, బంధువులకు తెలియజేశారు.
శివశంకర్ సోదరుడు ఉన్నప్పటికీ అతని మానసిక పరిస్థితి సరిగా లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ వార్త తెలిసిన శివ శంకర్ తల్లిదండ్రులు స్పృహతప్పి పడిపోయారు. కుమారుడి మరణ వార్త వారిని పూర్తిగా కుంగదీసింది.
ఔటర్ రింగ్‌రోడ్‌పై ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నార్సింగీ ఔటర్ రింగు రోడ్డు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తున్న మార్నింగ్ స్టార్ బస్సు ప్రమాదానికి గురైంది. వాళ్లిద్దరు బస్సు చక్రాల కింద నలిగిన చనిపోయారు. బస్‌లో ప్రయాణిస్తున్ వారికి కూడా గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
ఔటర్ రింగ్‌రోడ్డుపై జరిగిన బస్ ప్రమాదం డ్రైవర్ తప్పు కారణంగానే జరిగిందని పోలీసులు తేల్చారు. మద్యం మత్తులో బస్సు మితిమీరిన వేగంతో నడపడం వల్లే బస్ బోల్తాపడిందని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే ఒంగోలుకు చెందిన 33 ఏళ్ల మమత కిందపడి నలిగిపోయారన్నారు.