Telangana consumer commission: బాకీ ఉందని ఆటో వేలం వేసిన సంస్థకు షాక్- బాధితుడికి రూ.3.8 లక్షలు చెల్లించాలని ఆదేశాలు
Telangana: ఫైనాన్స్ లో ఆటో తీసుకున్న ఓ వ్యక్తి దాన్ని తిరిగి చెల్లించే క్రమంలో ఆలస్యం చేయడంతో సంస్థ ఆటోని లాక్కెళ్లి పోయి అమ్ముకుంది. దీనిపై ఆ వ్యక్తి వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించి పరిహారం పొందాడు.
Telangana consumer commission: తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేని క్రమంలో తమ వినియోగదారుల ఆస్తులు, వాహనాలు తదితరాలను వేలం వేసే ఫైనాన్స్ సంస్థలు సదరు ఆస్తిని ఎవరికి, ఎప్పుడు, ఎంతకు విక్రయించారనే వివరాల సైతం బహిర్గతం చేయాలని తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ సూచించింది. ఓ వాణిజ్య వాహనం విషయంలో చెల్లించాల్సిన బాకీ మొత్తాన్ని మూడు రెట్లు చేసి చూపించి వినియోగదారుణ్ని భయపెట్టిన ఫైనాన్స్ సంస్థ తీరుని తప్పుబట్టింది. బాకీ తిరిగి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా.. ఆ వాహనాన్ని వేలం వేయడం సేవాలోపమేనని వ్యాఖ్యానించింది. ఈఎంఐలపై ఆధారపడి కొనుగోళ్లు చేసే వినియోగదారుల విషయంలో ఫైనాన్స్ సంస్థల వ్యవహార శైలి ఎలా ఉంటుందనే దానికి తార్కాణమీ ఉదంతం.
టాటా మ్యాజిక్ కొనుగోలు
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణానికి చెందిన ఉడుగుల ఆంజనేయులు 2017 జూన్ లో టాటా మ్యాజిక్ వాహనాన్ని కొన్నారు. మొత్తం రూ. 4.47 లక్షలకు గాను రూ. 87వేలు డౌన్ పేమెంట్ కట్టి మిగతా మొత్తం ఫైనాన్స్ సంస్థ దగ్గర అప్పుగా పొందారు. నెలకి రూ. 12,200 చొప్పున 48 నెలల్లో తిరిగి చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. 2021 సెప్టెంబర్ వరకు ఈఎంఐలు కట్టారు. అయితే కొవిడ్ కారణంగా రెండు, మూడు నెలలు ఓవర్ డ్యూ పేరుకుపోవడంతో ఫైనాన్స్ సంస్థ ఆంజనేయులుకు 2020 నవంబరులో ఏకంగా మూడున్నర లక్షలు మూడు రోజుల్లో కట్టాలని నోటీసులు పంపింది. ఈ క్రమంలో 2021 నవంబరులో ఆయన ఆటోని బలవంతంగా తీసుకెళ్లి పోయింది. తీసుకెళ్లాక దాదాపు రూ. 1.15 లక్షల మేరకు బాకీలున్నాయంటూ మరో నోటీసు ఇచ్చింది.
బాకీ కడతానంటే నిరాకరించిన సంస్థ
ఆంజనేయులు సంస్థకు రూ. 95 వేలు కట్టారు. ఇంకా బాకీ ఉందని చెప్పడంతో అదీ కట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సంస్థ ఆ డబ్బును తీసుకునేందుకు నిరాకరించింది. ఆటోని వేలంలో అమ్మేసింది. విషయం తెలుసుకున్న ఆంజనేయులు తనకు న్యాయం చేయాలంటూ మెదక్ జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. ఇరువైపులా వాదనలు విన్న జిల్లా ఫోరం సంస్థ తరఫున సేవాలోపం ఉందని భావించి ఆంజనేయులుకి రూ. 3.8 లక్షలు చెల్లించాలని తీర్పిచ్చింది. దీనిపై సదరు ఫైనాన్స్ సంస్థ రాష్ట్ర కమిషన్ ను ఆశ్రయించగా.. ఇరువైపుల వాదనలు విన్న రాష్ట్ర కమిషన్ ఇన్చార్జి అధ్యక్షురాలు మీనా రామనాధన్, జ్యుడిషియల్ సభ్యులు కె. రంగారావు ఫైనాన్స్ సంస్థ తరఫున సేవా లోపం ఉందని నిర్థరించారు.
‘‘ఫైనాన్స్ సంస్థ 2020లో రూ. మూడున్నర లక్ష్లలు మూడు రోజుల్లో కట్టాలని ఆంజనేయులుని ఒత్తిడి చేసి భయపెట్టడం వెనక ఆంతర్యమేంటో. అంతమొత్తం బాకీ అసలు ఎందుకయిందో అర్థం కాలేదు. 2021 అక్టోబరులో 1.15 లక్షలు మాత్రమే ఉన్న బాకీ అంతకు ఏడాది ముందు మూడున్నర లక్ష్లలు ఉంటుందా? ఆసలు ఆంజనేయులుకు ఆ నోటీసు ఫైనాన్స్ సంస్థ ఎందుకిచ్చింది? 1.15 లక్ష్లల మేర బకాయిలు ఉంటే రూ. 95 వేలు ఆంజనేయులు కట్టేశారు. రెండున్నరేళ్ల పాటు ఈ ఎం ఐలు పూర్తిగా కట్టిన తరువాత కూడా ఆంజనేయులుకు ఎలాంటి నోటీసులు లేకుండా అతని వాహనాన్ని బలవంతంగా తీసుకొచ్చి అమ్మేశారు. ఆయన మిగిలిన మొత్తాన్ని కట్టేందుకు సిద్ధంగా ఉన్నా ఆ మొత్తం తీసుకోకుండా ఆయనకు నష్టం చేకూర్చారు. వాహనాన్ని ఎవరికి, ఎంతకి, ఎప్పుడు అమ్మారో కూడా బహిర్గతం చేయలేదు. ఇది కచ్చితంగా సేవాలోపమే. జిల్లా ఫోరం ఇచ్చిన తీర్పుతో మేం అంగీకరిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.