TSRTC Review 2022: "మేం చేపట్టిన సంస్కరణల వల్ల ఆర్టీసీ నష్టాలు తగ్గించగలిగాం"
TSRTC Review 2022: తాము చేపట్టిన సంస్కరణల వల్ల ఆర్టీసీలో భారీగా నష్టాలను తగ్గించగలిగామని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. మరిన్ని బస్సులను నడుపుతూ ఆర్టీసీని గాడిలో పెడతామని చెప్పుకొచ్చారు.
TSRTC Review 2022: తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీకి రూ.1500 కోట్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీలో తాము చేపట్టిన సంస్కరణలన్నీ సత్ఫలితాలను ఇచ్చాయని చెప్పారు. 2021వ సంవత్సరంలో ట్రాఫిక్ రెవెన్యూ రూ.3197 కోట్లు కాగా.. 2022లో ట్రాఫిక్ రెవెన్యూ రూ. 4641 కోట్లు అని వివరించారు. 2020వ సంవత్సరంలో కరోనా కారణంగా బాగా నష్టాలు వచ్చాయన్నారు. 2020లో ఆర్టీసీకి రూ. 2557 కోట్ల నష్టం రాగా... 2021వ సంత్సరంలో రూ.1980 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. 2022వ సంవత్సరంలో రూ. 650 కోట్ల నష్టం వచ్చిందని వివరించారు. తాము చేపట్టిన చర్యలు, సంస్కరణలతో నష్టాలను బాగా తగ్గించగల్గామని పేర్కొన్నారు. ప్రైవేట్ రవాణా వ్యవస్థకు ధీటుగా ఆర్టీసీని నిలిపామన్నారు. 100 డేస్ ఛాలెంజ్, శ్రావణ మాసం ఛాలెంజ్ పేరుతో అదనపు ఆదాయాన్ని సమకూర్చుకున్నామని వివరించారు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీకి అదనంగా రూ.6.26 కోట్లు సమకూరిందన్నారు. 12 డిపోలు 100% ఆక్యూపెన్సీ నమోదు చేశాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. భక్తులకు తిరుమల దర్శన భాగ్యం కల్పించామని చెప్పుకొచ్చారు. గత 5 నెలల్లో 80 వేలకు పైగా భక్తులు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారని వెల్లడించారు. ఆన్లైన్ లో టికెట్ ల అమ్మకాలు బాగా పెరిగాయని స్పష్టం చేశారు. త్వరలోనే ఆర్టీసీ సంస్థకు అదనపు బస్సులు చేకూరుస్తామన్నారు. ఉన్న వనరులను వినియోగించుకుని, ఆర్టీసీని గాడిలో పెడుతున్నామని ఆయన తెలిపారు.
టీఎస్ఆర్టీసీ సంక్రాంతి ఆఫర్లు - 10 శాతం రాయితీ!
సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రానుపోనూ ఒకేసారి టికెట్లు బుక్ చేస్కుంటే తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ కల్పిస్తున్న తెలిపింది. డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ ప్లస్ బస్సుల్లో అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ కి ఈ రాయితీ వర్తిస్తుందని... వచ్చే జనవరి 31 వరకు ఈ రాయితీ అమల్లో ఉంటుందని వెల్లడించింది. సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గించేందుకు 10 శాతం రాయితీని ప్రకటించాలని నిర్ణయించినట్లు టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ ఎండీ సజ్జనాల్ తెలిపారు. ముందస్తు రిజర్వేషన్ కోసం WWW.TSRTCONLINE.IN అధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చని స్పష్టం చేశారు.
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణంపై 10% రాయితీని టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. జనవరి 31,2023 వరకు ఈ రాయితీ అమల్లో ఉంటుంది. ముందస్తు రిజర్వేషన్ కోసం https://t.co/F0naRXIa8A ని సంప్రదించండి.
— Managing Director - TSRTC (@tsrtcmdoffice) December 26, 2022
సంక్రాంతి పర్వదినం సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం టీఎస్ఆర్టీసీ (TSRTC) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 4,233 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది జనవరి 7 నుంచి 15వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను తెలంగాణ ఆర్టీసీ నడపనుంది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ (TSRTC) ట్వీట్ చేసింది. మొత్తం 4,233 స్పెషల్ బస్సు సర్వీసుల్లో 585 బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించినట్లుగా ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. తెలంగాణలోని వివిధ పట్టణాలకే కాకుండా ఏపీలో డిమాండ్ ఉన్న ప్రాంతాలకు కూడా ఈ బస్సులు నడుస్తాయని చెప్పారు. హైదరాబాద్ బస్ భవన్ నుంచి శుక్రవారం (డిసెంబర్ 9) ఆయన తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ గతేడాది సంక్రాంతికి 3,736 ప్రత్యేక బస్సులు నడిపామని అన్నారు. ఈసారి వాటికి అదనంగా పది శాతం బస్సులను పెంచామని చెప్పారు.