Telangana Municipal Elections 2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు! త్వరలో కీలక ప్రకటన
తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. ఈ మేరకు పురపాలక శాఖ రిజర్వేషన్ల ఖరారుపై కీలకమైన కసరత్తును పూర్తి చేసింది.

Telangana Municipal Elections | హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ దిశగా పురపాలక శాఖ కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 121 మున్సిపాలిటీలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా కేటగిరీలకు చైర్‌పర్సన్ స్థానాల సంఖ్యను పురపాలకశాఖ ఖరారు చేసినట్లు సమాచారం. జనాభా ప్రాతిపదికన ఏ ఏ కేటగిరీలకు ఎన్ని స్థానాలు కేటాయించాలనే అంశంపై స్పష్టతనిస్తూ ప్రాథమిక జాబితాను సిద్ధం చేశారు. మునిసిపాలిటీ చైర్మన్ల సంఖ్య విభాగాల వారీగా.. జనరల్ 30, జనరల్ మహిళలు 31 స్థానాలు, ఎస్టీ జనరల్ 3, ఎస్టీ మహిళ 2, ఎస్సీ జనరల్ 9, ఎస్సీ మహిళ 8, బీసీ జనరల్ 19, బీసీ మహిళ 19 స్థానాలను కేటాయించాలని పురపాలకశాఖ ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మూడు రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది.
రిజర్వేషన్ల వివరాలు - మొత్తం 121 మున్సిపాలిటీల్లో స్థానాల కేటాయింపు
జనరల్: 61 స్థానాలు (వీటిలో జనరల్ 30, జనరల్ మహిళ 31)
బీసీ (వెనుకబడిన తరగతులు): 38 స్థానాలు (బీసీ జనరల్ 19, బీసీ మహిళ 19)
ఎస్సీ (షెడ్యూల్డ్ కులాలు): 17 స్థానాలు (ఎస్సీ జనరల్ 9, ఎస్సీ మహిళ 8)
ఎస్టీ (షెడ్యూల్డ్ తెగలు): 5 స్థానాలు (ఎస్టీ జనరల్ 3, ఎస్టీ మహిళ 2)
మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ దాదాపు 50 శాతం స్థానాలను మహిళలకు కేటాయించడం విశేషం.
తుది ప్రకటన ఈ నెల 17న
మునిసిపాలిటీ చైర్మన్ల రిజర్వేషన్ల స్థానాల సంఖ్యను ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం, ఏయే మున్సిపాలిటీ ఏ వర్గానికి కేటాయించాలనే (లక్కీ డిప్ లేదా రోస్టర్ విధానం) తుది రిజర్వేషన్లను ఈ నెల 17న అధికారికంగా ప్రకటించనుంది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం అప్పుడే వేడెక్కింది. అభ్యర్థులు తమ తమ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులదే హవా..
హైదరాబాద్: తెలంగాణలో మూడు విడతల్లో ఉత్కంఠభరితంగా సాగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ మద్దతుదారులు స్పష్టమైన ఆధిపత్యం చెలాయించారు. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అధికార పార్టీ అభ్యర్థులు దాదాపుగా క్లీన్ స్వీప్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ముఖ్యంగా రైతు భరోసా, రుణమాఫీ అంశాలు ఓటర్లపై సానుకూల ప్రభావం చూపినట్లు కనిపిస్తున్నాయి. అయితే స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ మద్దతుదారులే గెలుస్తారని తెలిసిందే.
ప్రతిపక్షాల పోరాటం
ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ (BRS) కూడా గట్టి పోటీని ఇచ్చింది. ఉత్తర తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో, సిద్దిపేట, గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు మెరుగైన ఫలితాలు సాధించారు. బీజేపీ కూడా ఈసారి గ్రామీణ స్థాయిలో తన పట్టును నిరూపించుకుంది, ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఆ పార్టీ మద్దతుదారులు గణనీయమైన స్థానాల్లో విజయం సాధించారు.






















