Raja Singh About Home Minister: హోం మినిస్టర్ ఓ రబ్బర్ స్టాంప్, వెంటనే మార్చాలి! ఛాన్సిస్తే మేమేంటో చూపిస్తాం- రాజాసింగ్
Raja Singh About Home Minister: రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఓ రబ్బర్ స్టాంప్ అని ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు.
Raja Singh About Home Minister: పరిపాలనా చేతకాదంటూ తెలంగాణ ప్రభుత్వంపై గోశామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ ఓ రబ్బర్ స్టాంప్ అని ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ (Goshamahal MLA Raja SIngh) డిమాండ్ చేశారు. హత్యలకు అడ్డాగా తెలంగాణ మారిందని, రోజుకో హత్య, దోపిడీ జరుగుతోందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపాలన రాకపోతే ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలని సీఎం కేసీఆర్ కు సూచించారు. ఓసారి ఉత్తరప్రదేశ్ వెళ్లి చూడండి.. ముఖ్యమంత్రి ఎలా ఉండాలో, హోంమంత్రి ఎలా పనిచేయాలో కేసీఆర్ ప్రభుత్వానికి తెలుస్తుందంటూ చురకలంటించారు.
ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే హత్యలు చేస్తారా..? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ వెంటనే హోమ్ మంత్రి పదవి నుంచి మహమూద్ అలీని మార్చాలని డిమాండ్ చేశారు. తమ మిత్రులు హత్యలు చేస్తుంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అనుమానాలు వ్యక్తం చేశారు. ఒకవేళ లా అండ్ ఆర్డర్ ఎలా కంట్రోల్ చేయాలో తెలియకపోతే, తమకు ఛాన్స్ ఇస్తే హత్యలు చేసే వారికి పనిష్మెంట్ ఎలా ఉండాలో రౌడీలకు తాము చూపిస్తాం అన్నారు.
రాజా సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ సింగ్ అనే 23, 24 ఏళ్ల వయసు ఉన్న యువకుడ్ని దారుణంగా హత్య చేశారని రాజా సింగ్ ఆరోపించారు. అత్తాపూర్ లో జిమ్ కు వెళ్లి వస్తున్న అతడిపై నలుగురు వ్యక్తులు పెప్పర్ స్పే కొట్టి, కళ్లల్లో కారం చల్లి కత్తులతో దాడి చేసి హత్య చేశారని చెప్పారు. రాహుల్ సింగ్ హత్య జరిగి 3 రోజులు గడిచినా అరెస్టులపై ఎలాంటి సమాచారం లేదన్నారు. ఎందుకు హత్య చేశారు, నిందితులు ఎవరు అనే వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారని రాజా సింగ్ ఆరోపించారు.
ఇప్పటికే కొందర్ని అరెస్ట్ చేశారని, నిందితుల వివరాలను ప్రెస్ మీట్ పెట్టి చెబుతారని తమకు సమాచారం అందినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎవరికి భద్రత లేదని, తెలంగాణ హత్యలకు అడ్డాగా మారిందని ఆరోపించారు. తెలంగాణ హోం మినిస్టర్ రబ్బర్ స్టాంప్ హోం మినిస్టర్ గా ఉన్నారని, యూపీకి వెళ్లి సీఎం కేసీఆర్ పరిపాలన గురించి తెలుసుకోవాలని సూచించారు. యూపీలో యోగి పాలన గమనిస్తే.. తెలంగాణలో శాంతి భద్రతలను ఎలా కాపాడాలి, ప్రజల్ని ఎలా రక్షించాలో తెలుస్తుందన్నారు. తక్షణమే హోం మినిస్టర్ ను మార్చాలని, యాక్టివ్ వ్యక్తిని హోం మినిస్టర్ గా చేయాలని సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. ఇలా చేయలేని పక్షంలో తమకు బాధ్యతలు అప్పగిస్తే హత్యలు చేసే రౌడీలకు ఎలాంటి శిక్షలు వేయాలో చేసి చూపిస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
కేసు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి నిజాలు బహిర్గతం చేయాలని పోలీసులను రిక్వెస్ట్ చేశారు. సుపారీ హత్య జరిగిందా, లేక ఏ కారణంతో ఘటన జరిగింది, ఇందులో ఎంతమంది ఇన్వాల్స్ అయ్యారో పోలీసులు అందర్నీ అరెస్ట్ చేసి శిక్షించాలని కోరారు.