Kakinada Port Ship Seized: అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
cargo ship Stella L Panama anchored at Kakinada port seized | కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం రవాణా చేస్తున్న స్టెల్లా షిప్ ను సీజ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు.
PDS Rice smuggling from Kakinada Port | కాకినాడ: ఇటీవల దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన కాకినాడ పోర్టు వ్యవహారంపై కలెక్టర్ షాన్ మోహన్ స్పందించారు. కాకినాడలోని యాంకరేజ్ పోర్టులో విదేశీ నౌక స్టెల్లాను సీజ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్టెల్లా ఓడలోకి రేషన్ బియ్యం ఎలా వచ్చిందన్న విషయాలు త్వరలో తెలుస్తాయన్నారు. దర్యాప్తు చేపట్టి త్వరలో బాధ్యులపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అన్నారు.
గోదాంల నుంచి నుంచి పోర్టులోని షిప్ వరకూ రేషన్ బియ్యం ఎలా అక్రమ రవాణా అయిందన్న దానిపై ఫోకస్ చేశారు. ఐదుగురు సభ్యుల బృందంతో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై విచారణ జరుపుతామని తెలిపారు. పోర్టులో సీజ్ చేసిన పీడీఎస్ బియ్యం రేషన్ దుకాణాల నుంచి వచ్చిందా, లేక మరెక్కడి నుంచి సరఫరా చేశారన్న దానిపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. గత నెల 27న కాకినాడ యాంకరేజి పోర్టులో తనిఖీ చేసిన స్టెల్లా ఎల్ నౌకలో పిడిఎస్ బియ్యం గుర్తించాం. షిప్ లోడ్ చేసిన మొత్తం బియ్యాన్ని సమగ్రంగా తనిఖీ చేసేందుకు ఐదు ప్రభుత్వ శాఖల అధికారులతో కూడిన మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలియజేశారు.
రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తే పీడి యాక్ట్ ప్రయోగం
అమరావతి: పేదలకు ప్రభుత్వాలు అందించే పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేసే వారిపై పీడీ యాక్ట్ (PD ACT) నమోదు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరించింది. రాష్ట్రంలోని పోర్టులు కేంద్రంగా ఇక్కడి నుంచి విదేశాలకు రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కాకినాడ యాంకరేజ్ పోర్టులో గత నెలాఖరులో రేషన్ బియ్యం ఎగుమతి చేస్తున్న విదేశీ నౌక (Stella Ship)ను కలెక్టర్ సూచనతో అధికారులు సీజ్ చేశారు. రేషన్ బియ్యం రవాణా చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏపీ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
మంత్రి నాదెండ్ల అధ్యక్షతన మంత్రులు అచ్చెన్నాయుడు, సత్య కుమార్ యాదవ్, ఉన్నతాధికారులు ఇటీవల సమావేశమయ్యారు. కాకినాడ పోర్టులోని 5 వేర్ హౌసుల్లో సార్టెక్స్ మిషన్ల అంశంపై మంత్రులు చర్చించారు. వేర్ హౌసుల్లో యంత్రాలు ఏర్పాటు చేయడంపై మారిటైమ్ బోర్డు, కాకినాడ పోర్టు అధికారులను రాష్ట్ర మంత్రులు ప్రశ్నించారు. సార్టెక్స్ యంత్రాలను ఏర్పాటుపై విచారణ చేపట్టి అందుకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని మంత్రులు నిర్ణయం తీసుకున్నారు.