(Source: ECI/ABP News/ABP Majha)
TS High Court: తెలంగాణలో ఒమిక్రాన్ దడ.. పిల్లలకూ ప్రత్యేక హాస్పిటళ్లు ఉండాల్సిందే.. TS హైకోర్టు ఆదేశాలు
ఒమిక్రాన్ వైరస్ పిల్లలలో కూడా తీవ్రంగా వ్యాప్తి చెందుతుందని.. కాబట్టి నీలోఫర్ ఆస్పత్రి కాకుండా పిల్లల కోసం అదనంగా మరికొన్ని ఆస్పత్రులను పెంచాలని హైకోర్టు సూచించింది.
తెలంగాణలో కరోనా వైరస్, ఒమిక్రాన్ వేరియంట్ కేసుల పరిస్థితిపై శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఒమిక్రాన్ ప్రస్తుతం తీవ్ర స్థాయిలో ప్రతాపం చూపుతున్నందున వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని సూచించింది. కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ వైరస్ చిన్న పిల్లలలో కూడా చాలా తీవ్రంగా వ్యాప్తి చెందుతుందని.. కాబట్టి ఇప్పుడున్న నీలోఫర్ ఆస్పత్రి కాకుండా పిల్లల కోసం అదనంగా మరికొన్ని ఆస్పత్రులను పెంచాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని నిర్దేశించింది. సినిమా హాల్స్, మాల్స్, ఇతర కమర్షియల్ సంస్థల కోసం నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది.
వారాంతం జరిగే సంతలలో కూడా కోవిడ్ నియమ నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తర్వాతి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. జనం గుమిగూడకుండా నియంత్రించాలని.. మాల్స్, థియేటర్లలో కొవిడ్ నిబంధనలు అమలు చేయాలని ఆదేశించింది. వాణిజ్య సముదాయాలు, వారాంతపు సంతల్లోనూ కొవిడ్ నిబంధనలు అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు
రాష్ట్రంలో కొవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మెున్నటి వరకు వందల్లో నమోదైన కేసులు ఇప్పుడు వేలకు చేరుకుంటున్నాయి. కొత్తగా తెలంగాణలో 1,913 కొత్త కేసులు నమోదయ్యాయని రాష్ట్ర, వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఒక్కరోజులో 54,534 టెస్టులు నిర్వహించారు. వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందారు. 24 గంటల వ్యవధిలో 232 మంది బాధితులు కోలుకున్నారని చెప్పింది. ప్రస్తుతం తెలంగాణలో 7,847 యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది. ఇప్పటివరకూ.. మెుత్తం రాష్ట్రంలో 6,87,456కు చేరుకున్నాయి. ఇందులో 6,75,573 మంది కోలుకున్నారు. వైరస్ కారణంగా తెలంగాణలో 4,036 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల రేటు 0.58శాతంగా ఉండగా.. రికవరీ రేటు 98.27శాతంగా ఉంది.
దేశంలోనూ ఎగబాకుతున్న కరోనా కేసులు
దేశంలో కూడా కరోనా టాప్ గేర్‌లో వ్యాప్తి చెందుతోంది. కొత్తగా లక్షకు దగ్గరగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 90,928 మందికి కరోనా సోకింది. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య 56% పెరిగింది. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2,630కి చేరింది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య మహారాష్ట్రలో 797కు చేరింది. 19,206 మంది తాజాగా కరోనా నుంచి కోలుకున్నారు. 325 మంది వైరస్‌తో మృతి చెందారు.
Also Read: Corona Cases: ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. తగ్గినట్టే కనిపించి ఎక్కువవుతున్న కేసులు
Also Read: Numaish Exhibition: కరోనా ఎఫెక్ట్.. నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ రద్దు