టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కోర్టు కీలక వ్యాఖ్యలు- విచారణ జూన్ 5కు వాయిదా
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తుపై కొంతవరకే సంతృప్తి వ్యక్తం చేసింది. ఇంకా వేగంగా దర్యాప్తు జరగాలని అభిప్రాయపడింది.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తుపై కొంతవరకే సంతృప్తి వ్యక్తం చేసింది. ఇంకా వేగంగా దర్యాప్తు జరగాలని అభిప్రాయపడింది. ఇప్పుడున్న పరిస్థితిలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. జూన్ ఐదు నాటికి తదుపరి దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇవ్వాలని సిట్‌ను ఆదేశించింది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కేస్ దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వేసిన పిటిషన్‌లపై హైకోర్టు విచారించింది. ఇప్పటికే ఈ కేసులో సిట్‌కు నోటీసులు జారీ చేసింది. కేసు పురోగతి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సిట్ సమర్పించిన నివేదికపై కోర్టు మిక్స్‌డ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది. పూర్తి స్థాయి రిపోర్టును జూన్ ఐదు లోపు కోర్టుకు సమర్పించాలని సిట్‌ను ఆదేశించింది. కేసును జూన్ ఐదుకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.
ఈ కేసులో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఎంతమందిని ప్రశ్నించారని సిట్ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. వారిలో ఎంతమంది పరీక్ష రాశాలు.. అందులో అనుమతి తీసుకొని రాసిన వారి వివరాలేంటని ఆరా తీసింది. కేసులో ఏ 16గా ఉన్న ప్రశాంత్ పాత్రపై ప్రశ్నలు లేవనెత్తింది. కోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన సిట్ అధికారులు... ఏ1 నిందితుడు మాత్రం ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకొనే పరీక్ష రాసినట్టు తెలిపింది.
అన్నింటినీ విన్న హైకోర్టు విచారణలో కొంత జాప్యం జరుగుతోందని అభిప్రాయపడింది. ఇలాంటి సమయంలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది. జూన్ 5నే అన్నింటిపై విచారణ చేస్తామని తెలిపింది.