Supreme Court: తెలంగాణ సర్కార్‌కు బిగ్ రిలీఫ్, 9 ఏళ్ల తర్వాత సుప్రీం కోర్టు.. కేసీఆర్ హ్యాపీ
ప్రభుత్వం - వక్ఫ్ బోర్డు మధ్య ఎన్నో ఏళ్లుగా ఈ భూముల వివాదం కొనసాగుతోంది. రూ.వేల కోట్లు విలువ చేసే భూములు ఇప్పుడు ప్రభుత్వానికి దక్కాయి.
హైదరాబాద్ మణికొండ జాగీర్ పరిధిలోని 1654.32 ఎకరాల భూమి విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 1654 ఎకరాలు తెలంగాణ ప్రభుత్వానిదే అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీంతో 9 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి తెరపడినట్లయింది. దీంతో రూ.వేల కోట్లు విలువ చేసే భూములు ప్రభుత్వానికి దక్కాయి.
ప్రభుత్వం - వక్ఫ్ బోర్డు మధ్య ఎన్నో ఏళ్లుగా ఈ భూముల వివాదం కొనసాగుతోంది. హజరత్ హుస్సేన్ షా వలి అని పిలిచే దర్గాకు చెందిన 1,654 ఎకరాల 32 గుంటలు తమదేనని వక్ఫ్ బోర్డు కోర్టును ఆశ్రయించింది. ఇందుకు సంబంధించి ఏపీ హైకోర్టులో వక్ఫ్ బోర్డుకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గతంలో ఎన్నోసార్లు వాదనలు జరిగాయి. అయితే, 2012 ఏప్రిల్ 3న వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తర్వాత ఈ భూముల విషయంలో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పక్కన పెట్టేసింది.
హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ.. మొత్తం భూములపై సర్వ హక్కులు తెలంగాణ ప్రభుత్వానికే ఉన్నాయని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ హేమంత్ గుప్తా, రామ సుబ్రమణిన్ ధర్మాసనం 156 పేజీల తీర్పును వెలువరించారు. ఈ తీర్పుతో ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వానికి, వక్ఫ్ బోర్డు మధ్య నలుగుతున్న వివాదానికి పరిష్కారం లభించినట్లు అయింది. ఈ తీర్పు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చూపిన చొరవను సుప్రీం ధర్మాసనం ప్రశంసించింది. తొమ్మిదేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం వెలువడిన తీర్పుతో తెలంగాణ ప్రభుత్వంతోపాటు ఉమ్మడి రాష్ట్ర హయాంలో అప్పటి ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా భూములు కేటాయించిన ల్యాంకో హిల్స్, జనచైతన్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీ, ఐఎస్‌బీ సహా పలు సంస్థలు, వ్యక్తులకు ఊరట లభించింది.
తీర్పుపై సీఎం కేసీఆర్ హర్షం
మణికొండ జాగీర్ భూముల విషయంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. అందుకు కృషిచేసిన న్యాయవాదులు, ప్రభుత్వ అధికారులను అభినందించారు. తీర్పుపై ఉన్నతాధికారులు, న్యాయవాదులతో సీఎం సమీక్షించారు. ఇదే స్ఫూర్తితో ప్రభుత్వ భూములను కాపాడేందుకు కృషి చేయాలని వారికి సూచించారు. హైదరాబాద్‌లోని కీలక ప్రాంతంలో ఉన్న ఈ భూముల్లో మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, ఎమ్మార్ వంటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పారిశ్రామిక సంస్థలతోపాటు ఐఎస్‌బీ, ఉర్దూ విశ్వవిద్యాలయం వంటివి ఇప్పటికే నెలకొని ఉన్నాయి. అందువల్ల ఈ భూములని కాపాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించి.. చివరి వరకూ పోరాడింది. తీర్పు ప్రతికూలంగా తీర్పువస్తే ఆయా పెద్ద సంస్థలకు భూములు మరోచోట ఇవ్వాల్సి వస్తుంది.. కాబట్టి అది సమస్యాత్మకమవుతుంది. అంతేకాక, పారిశ్రామికరంగంలో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. అందుకే ప్రభుత్వం ఈ కేసులో ప్రత్యేక చొరవ చూపింది.