Cm Revanth Reddy : మహిళా సంఘాలకు గుడ్ న్యూస్- రెండేసి చీరల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు
Telangana: తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు రెండు చొప్పున చేనేత చీరలు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఉగాది నాటికి వీటిని పంపిణీ చేయనున్నారు.
Revanth Reddy Government Distribution Sarees To Woman : తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కారు మహిళా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు ఉచితంగా చీరల పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు చేనేత, జౌళి శాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షల మంది లబ్ధిదారులకు ఈ చీరలు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒక్కో లబ్ధిదారుకు రెండు చీరలు చొప్పున పంపిణీ చేయనున్నారు. ఆర్థిక అంచనాలు, తయారీ విధానంతోపాటు లబ్ధిదారుల వివరాలు ఇవ్వాలని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) నుంచి సమాచారాన్ని చేనేత జౌళి శాఖ ఇప్పటికే కోరింది. గతంలో కెసిఆర్ ప్రభుత్వం బతుకమ్మ చీరలను లబ్ధిదారులకు పంపిణీ చేసింది. బతుకమ్మ చీరల పథకాన్ని రద్దుచేసి దాని స్థానంలో స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఏటా రెండు చొప్పున చీరలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల తొమ్మిదో తేదీన హైదరాబాదులో జాతీయ చేనేత సాంకేతిక సంస్థ (ఐఐహెచ్టి) ప్రారంభోత్సవ సభలో ప్రకటించారు.
సీఎం ప్రకటన నేపథ్యంలో చీరలు పంపిణీకి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుత అంచనా ప్రకారం రాష్ట్రంలో 63.86 లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. వీరికి ఏటా రెండు చొప్పున అంటే 1,27,72,000 చీరలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ చీరల పంపిణీ ప్రక్రియను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా చేనేత, జౌళి శాఖ క్షేత్రస్థాయిలో పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లను చేస్తోంది. గడిచిన ఏడాది బతుకమ్మ చీరల పంపిణీ పథకం కింద రూ.335 కోట్ల రూపాయలను కెసిఆర్ ప్రభుత్వం వెచ్చించింది.
ఈ మొత్తంతో కోటి మందికి ఒక్కో చీర చొప్పున పంపిణీ చేశారు. గత ప్రభుత్వం పంపిణీ చేసిన చీరలను సిరిసిల్లలో తయారు చేయించారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేనేత చీరలు పంపిణీ చేస్తామని ప్రకటించడంతో వీటి తయారీకి సంబంధించి సమాచారాన్ని అధికారులు తెప్పించారు. అంత పెద్ద మొత్తంలో తయారీ సామర్థ్యం రాష్ట్రంలో లేదని అధికారులు గుర్తించారు. ఒక్కో చీర తయారీకి కనీసం 6 మీటర్ల చొప్పున 7.66 కోట్ల మీటర్ల క్లాత్ అవసరం అవుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం చేనేత వస్త్రాల సామర్థ్యం 7 లక్షల మీటర్ల మేరకే ఉంది. ఈ క్రమంలో మరమగ్గాల చీరలు అందించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ పథకంలో చేనేతకు భాగస్వామ్యం కల్పిస్తూ కొంత మేరకు ఆర్డర్లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో ఉన్న బతుకమ్మ చీరలపై విమర్శలు దృష్ట్యా మహిళా సంఘాలకు ఇచ్చే వాటిని నాణ్యత, నవ్యతో తయారు చేయించాలని భావిస్తున్నారు. ఈ చీరలు తీసుకునే మహిళలు సంతృప్తితో ఉండాలని, ఆ సంకల్పంతో ప్రభుత్వం వీటి పంపిణీకి సంబంధించిన ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టిన తర్వాత మహిళల్లో సంతృప్తి లేకపోతే ప్రయోజనం ఉండదని వారికి, సంతృప్తిని కలిగించేలా నాణ్యతతో కూడిన చీరలను పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు చెబుతున్నారు అందుకు అనుగుణంగానే అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు.
తయారీకి కనీసం ఆరు నెలల సమయం..
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంపిణీ చేయాలని భావిస్తున్న చీరల తయారీకి కనీసం ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. పథకం విధివిధానాలు ఖరారై ఆర్డర్ ఇస్తే 1.27 కోట్ల చీరలు తయారీకి ఆరు నెలల వరకు సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన చూస్తే వచ్చే ఏడాది ఉగాది వరకు చీరలు తయారయ్యే అవకాశం లేదు. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చీరలు పంపిణీకి సంబంధించి ఇప్పటికిప్పుడు ఆదేశాలు ఇచ్చిన వాటిని లబ్ధిదారులకు అందించేందుకు కనీసం ఆరు నెలల సమయం పట్టనుంది. గతంలో బతుకమ్మ ఉచిత చీరల పథకానికి చేనేత, జౌళి శాఖ నిధులను కెసిఆర్ ప్రభుత్వం వెచ్చించింది. అయితే, ఈసారి ఈ శాఖకు సంబంధించిన నిధులతోపాటు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ పరిధిలోని నిధులను వెచ్చించాలని, ప్రభుత్వంతోపాటు చేనేత శాఖ కూడా యోచిస్తోంది. సెర్ప్ ను భాగస్వామిగా చేసుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు సెర్ప్ తో త్వరలో సమావేశం నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు జౌళి శాఖ ఈ మేరకు జోరుగా చర్యలను చేపడుతోంది. ప్రభుత్వం దీనిపై అధికారికంగా జౌలీ శాఖకు ఆదేశాలను అందిస్తే.. చీరలు తయారీ, కొనుగోలుకు సంబంధించిన విధివిధానాలను అధికారులు తయారు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారిక ఆదేశాలు రావడమే ఆలస్యంగా చెబుతున్నారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
Also Read: రేవంత్ రెడ్డికి ఐదేండ్లే ఎక్కువ, కాంగ్రెస్ ఎక్కడా ఎక్కువ కాలం అధికారంలో లేదు: హరీశ్‌రావు