అగ్ని ప్రమాదాలపై ప్రభుత్వం పోస్ట్‌మార్టం- ఇతర దేశాల్లో సాంకేతికతపై అధ్యయనానికి చర్యలు!
హైదరాబాద్‌లో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలకు ఫైర్ సేఫ్టీ విషయంలో డ్రోన్లు, రోబోటిక్ సాంకేతికత వినియోగించుకునే అంశాలను పరిశీలించాలని మంత్రులు అధికారులకు సూచించారు.
సికింద్రాబాద్‌లో ఇటీవల జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై ప్రభుత్వం పోస్ట్‌మార్టం మొదలు పెట్టింది. జీహెచ్ ఎంసీ పరిధిలో ఫైర్ సేఫ్టీ విభాగం అనుమతులు లేని భారీ భవనాలపై ఫోకస్ పెట్టింది. చేపట్టాల్సిన చర్యలపై బిఆర్ కె ఆర్ భవన్ లోని సి.ఎస్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది.
ఈ భేటీలో పాల్గొన్న మంత్రులు కీలక సూచనలు చేశారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర అన్ని ప్రధాన నగరాల్లో అన్ని భారీ, ఎత్తైన భవనాలకు ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలన్నారు. వ్యాపార, వాణిజ్య భవనాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, ఎత్తైన అపార్టుమెంట్లలో సేఫ్టీ ఆడిట్ నిర్వహణకు సూచించారు. ఫైర్ సెఫ్టి పేరుతొ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైతే ప్రస్తుత ఫైర్ సేఫ్టీ చట్టాలను మార్చాలని కూడా మంత్రులు అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్‌లో వస్తున్న బహుళ అంతస్తుల భవన నిర్మాణాలకు ఫైర్ సేఫ్టీ విషయంలో డ్రోన్లు, రోబోటిక్ సాంకేతికతలను వినియోగించుకునే అంశాలను పరిశీలించాలని మంత్రులు అధికారులకు సూచించారు. పాశ్చాత్య దేశాలతోపాటు దేశంలోని ఇతర నగరాల్లో ఉన్న ఆదర్శవంతమైన పద్ధతులపైన అధ్యయనాన్ని వేగంగా చేపట్టి సూచనలు ఇవ్వాలని మంత్రులు ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ఫైర్ సేఫ్టీ శాఖ సిబ్బందికి మరిన్ని శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని ప్రతిపాదించారు.
ఫైర్ సేఫ్టీ శాఖకు అవసరమైన ఆధునిక సామాగ్రిని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రులు. ప్రస్తుతం శాఖకు అవసరమైన అత్యవసర సామాగ్రి విషయానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అగ్ని ప్రమాద నివారణలో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో భవనాల యజమానులను కూడా భాగస్వాములను చేసుకునే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఇటీవల సికిందరాబాద్‌లో జరిగిన అగ్నీ ప్రమాదంలో మరణించిన ముగ్గురికి ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఎక్స్-గ్రేషియా అందించాలని ఆదేశించారు.
నగరంలో అగ్ని ప్రమాదాల పై మంత్రి కేటీఆర్ గారి నేతృత్వంలో నిర్వహించిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశం పై బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయం లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది.
— Talasani Srinivas Yadav (@YadavTalasani) January 25, 2023
ఈ సమావేశంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ బండ ప్రకాష్ పాల్గొన్నారు. pic.twitter.com/ljAP2rRftW
ఈ సమీక్ష సమావేశంలో తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ. హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, సి.ఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, ఇంధన, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, జీహెచ్ ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జలమండలి ఎండి దాన కిషోర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వీ ఆనంద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర , రాచకొండ కమిషనర్ డీ.ఎస్. చౌహాన్, హైదరాబాద్ కలెక్టర్ అమేయ్ కుమార్ పాల్గొన్నారు.
సికింద్రాబాద్ రాంగోపాల్‌పేటలోని డెక్కన్ మాల్ కూల్చివేతపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్ని ప్రమాదం బారిన పడిన ఆ భవనాన్ని కూల్చివేసేందుకు నిర్ణయించింది. దీని కోసం టెండర్లు పిలిచింది. ఈ టెండర్లను 41లక్షలకు హైదరాబాద్ బేస్డ్ కంపెనీ దక్కించుకుంది. రేపటి నుంచే కూల్చి వేత పనులు ప్రారంభం కానున్నాయి.