Chevella Accident Control Room: చేవెళ్ల ఘటనపై సెక్రటేరియట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు, 19కి చేరిన మృతులు
Rangareddy Road Accident Control Room | రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై తెలంగాణ సెక్రటేరియట్‌లో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు.

Rangareddy Road Accident| చేవేళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. సీఎం ఆదేశాలతో సీఎస్ అన్ని విభాగాల అధికారులను అలర్ట్ చేయడంతో పాటు వెంటనే సెక్రటేరియట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బాధితులకు సంబంధించిన సమాచారం కోసం 9912919545, 9440854433 కంట్రోల్ రూం నెంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు. కంట్రోల్ రూమ్ ద్వారా ప్రమాద వివరాలు, అధికారుల మధ్య సమన్వయం చేయనున్నారు.
రోడ్డు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య
వెంటనే ప్రమాద స్థలికి చేరుకొని దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆర్టీసీ ఎండీ, రవాణా కమిషనర్, ఫైర్ డీజీని సీఎం రేవంత్ రెడ్డి అదేశించారు. సీఎం ఆదేశాలతో కొందరు మంత్రులు, ఉన్నతాధికారులు ప్రమాద స్థలానికి బయలుదేరారు. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో రాంగ్ రూట్ లో వేగంగా దూసుకొచ్చిన కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ తాండూరు నుంచి హైదరాబాద్ వళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో మొత్తం 19 మంది మృతిచెందారు. మరికొందరు తీవ్రగాయాలతో చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు..
టీఎస్ 34 టీఏ 6354 నంబర్ ఉన్న తాండూరు డీపోనకు చెందిన ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుంది. తాండూరులో ఉదయం 4.40 గంటలకు బస్సు బయల్దేరగా అక్కడ 30 మందికి పైగా ఉద్యోగులు, విద్యార్థులు ఎక్కారు. తరువాత మరో 40 మంది వరకు ఎక్కడంతో బస్సులో దాదాపు 70 మంది వరకు ఉన్నారు. రోడ్డు ప్రమాదంతో రోడ్డుపై బస్సు, లారీ పడిపోవడంతో హైదరాబాద్- బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చేవెళ్ల- వికారాబాద్ మార్గంలోవాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది. బస్సు మీద కంకర లారీ పడటంతో ప్రయాణికులు కంకరలో ఇరుక్కుపోయి ఊపిరాడక ఆర్తనాదాలు చేశారు.

బాధితులను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్
ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఘటన స్థలికి చేరుకున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీ రంజీత్ రెడ్డి, ఎంఎల్ఏ కాలే యాదయ్య, కాంగ్రెస్ ఇంచార్జి భీం భరత్ తదితరులు చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో భాదితులను పరామర్శించారు. తీవ్రంగా గాయపడిన వారిని హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
మెరుగైన వైద్యం కోసం కొందర్ని హైదరాబాద్ కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. చనిపోయిన వారిలో టారీ డ్రైవర్, బస్సు డ్రైవర్ దస్తగిరితో పాటు ఏడుగురు పురుషులు, మరో 12 మంది మహిళలు, ఓ చిన్నారి ఉన్నారని సమాచారం.






















