Telangana Schools: జూన్ 12 లోగా అమ్మ ఆదర్శ పాఠశాల పనులు పూర్తి చేయాలి: కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి
Telangana CS Shanti Kumari: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం అమ్మ ఆదర్శ పాఠశాల పనులు వేగవంతం చేయాలని, జూన్ 12లోగా పనులు పూర్తి చేయాలని సీఎస్ శాంతికుమార్ కలెక్టర్లను ఆదేశించారు.
Amma Adarsh School program in Telagnana | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం నాడు (మే 17న) జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కింద చేపట్టిన పనుల పురోగతి, వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన అంశాలపై సీఎస్ శాంతి కుమారి (Telangana CS Shanti Kumari) సమీక్షించారు. దాంతో పాటు రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు (Paddy Procurement) త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం పనులు వేగవంతం చేసి పూర్తి చేస్తున్నందుకు జిల్లా కలెక్టర్లను సీఎస్ శాంతి కుమారి అభినందించారు. వేసవి సెలవుల తరువాత పాఠశాలలు పునఃప్రారంభమయ్యే తేదీ జూన్ 12 లోగా వాటిని పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం వ్యాప్తంగా తెరిచే రోజున ప్రతి విద్యార్ధికి నోట్‌బుక్‌లు, పాఠ్యపుస్తకాలు, ఒక జత స్కూల్ యూనిఫాం అందేలా తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్లను ఆదేశించారు. చిన్నపాటి మరమ్మతు పనులు, విద్యుద్దీకరణ, మరుగుదొడ్లు, తాగునీరు, ఫర్నీచర్ పనులు నాణ్యతగా జరిగేలా పర్యవేక్షించాలని అధికారులను ఆమె ఆదేశించారు.
ధాన్యాన్ని త్వరగా సేకరించేలా చర్యలు
రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు, సేకరణ గురించి సీఎస్ శాంతికుమారి ప్రస్తావిస్తూ బ్యాలెన్స్ ధాన్యాన్ని త్వరగా సేకరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి మిల్లులకు వేగంగా తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షంలో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి కొంత మంది జిల్లాల కలెక్టర్లు తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా ఆమె అభినందించారు. ఇదే విధానాన్ని అనుకరించి తెలంగాణ వ్యాప్తంగా రైతులు నష్టపోకుండా ఉండేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతి కుమారి సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశం, పంచాయత్ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.