Revanth Reddy Comments On Chandra Babu: చంద్రబాబూ! నువ్వు అనుకున్నవి జరగవు!- అఖిలపక్షం భేటీ తర్వాత రేవంత్ రెడ్డి వార్నింగ్
Revanth Reddy Comments On Chandra Babu: మోదీ వద్ద పలుకుబడి ఉందని బనకచర్లకు అనుమతులు తెచ్చుకుంటామనే కుదరదని చంద్రబాబుకు రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కచ్చితంగా అడ్డుకుంటాని స్పష్టం చేశారు.

Revanth Reddy Comments On Chandra Babu: ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై ఎందుకు వద్దంటున్నాం? ఏం జరగబోతోంది? ఆ ప్రాజెక్టు రూపకల్పనకు అవకాశం ఇచ్చింది ఎవరు ఇలాంటి విషయాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్షం సమావేశంలో వివరించారు. ఎంపీలు అడిగిన అనుమానాలు నివృత్తి చేశారు. సమగ్ర వివరాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ప్రెస్‌మీట్ పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లాలా వద్దా అన్నది కేంద్రం చేతుల్లో ఉందని ఈ విషయంలో ఎంపీలు మోదీపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్(GWDT) 1980 అవార్డు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం(APRA) 2014ని ఉల్లంఘిస్తుందని ఆరోపించారు. గోదావరిలోని తెలంగాణ వాటాను కూడా వాడుకుంటోందని విమర్శించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టబోయే ప్రాజెక్టుతో భద్రాచలంలో వరద ముప్పును పెంచుతున్నారని అన్నారు. దీనంతటికీ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమని ఆరోపించారు. గోదావరి వృథా జలాలు వాడుకోమని ఏపీకి సలహా ఇచ్చింది ఆయనేనని అన్నారు. ఇప్పుడు అనవసరంగా తప్పు తమపై వేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్లు ఎవరైనా ఉన్నారంటే మొదటి దోషి కేసీఆర్ అవుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట ఉరి తీయాల్సి వస్తే ఆయన్నే తీయాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై కూడా విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి. కేంద్రంలో తన పలుకుబడి ఉపయోగించి ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన చేయొద్దని సూచించారు. మోదీపై ఒత్తిడి తీసుకొచ్చి అనుమతులు పొందాలంటే మాత్రం అది జరిగే పని కాదని చెప్పుకొచ్చారు. కచ్చితంగా తెలంగాణ హక్కుల కోసం ఎంత వరకైనా కోట్లాడతామని అన్నారు. అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధమని పేర్కొన్నారు. ముందు తెలంగాణకు రావాల్సిన 968 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు అవకాశం ఇస్తే తర్వాత కిందికి వెళ్లే నీటిని ఎంతైనా వాడుకోవచ్చని కూడా సూచించారు.
గత పాలకులు కాసులు కక్కుర్తితో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కాళేశ్వరం మాత్రమే కట్టారని అన్నారు రేవంత్. కేవలం కాళేశ్వరం పేరు చెప్పి ఖజానా ఖాళీ చేశారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ప్రాజెక్టుల కోసం ఐదు వందల రూపాయలు ఇచ్చేందుకు కూడా నిధులు లేకుండా చేశారని ధ్వజమెత్తారు. అన్నింటినీ కూడగట్టుకొని ఆర్థికంగా ఏదైనా చేద్దామంటే తప్పుడు ఆరోపణలతో అడ్డం పడుతున్నారని అన్నారు. పేదలకు పంచక, ప్రాజెక్టులు కట్టక, అంతా తరలించేశారని అన్నారు.
2016 అపెక్స్ కౌన్సిల్‌లో కేసిఆర్ ఇచ్చిన ప్రకటన నుంచే బనకచర్ల ఆలోచన పుట్టిందని రేవంత్ అన్నారు. మూడు టీఎంసీలు అని కేసీఆర్ చెబితే వాళ్లు మూడు వందల టీఎంసీలకు స్కెచ్ వేశారని గుర్తు చేశారు. గోదావరి జలాలు వృథాగా పోతున్నాయని చెప్పడమే కాకుండా పూర్తి సహకారం ఉంటుందని కూడా మాట ఇచ్చారని అన్నారు. ఇప్పుడు సరి చేసే ఉద్దేశంతో అఖిల పక్షం ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి వివరించారు. భవిష్యత్ కార్యచరణపై వారి సూచనలు తీసుకున్నట్టు వెల్లడించారు.





















