CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన, ఫార్చ్యూన్ 500 కంపెనీలు రప్పిస్తామని ధీమా
Bharat Future City For Development | రాబోయే పదేళ్లలో ప్రపంచంలో ఉండే ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో ఉండాలన్నదే తమ లక్ష్యమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్: భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని, రాష్ట్రాభివృద్ధికి తీసుకున్న ఈ విప్లవాత్మక చర్యలపై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్ పేటలో ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ(FCDA) ఆఫీసుకు రేవంత్ శంకుస్థాపన చేసి మాట్లాడారు మంచి సంకల్పంతో ప్రారంభించిన ఈ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుకు స్వయంగా వరుణదేవుడు కూడా సహకరించాడు అని వ్యాఖ్యానించారు. కార్యక్రమానికి మంచి వాతావరణం, సహకరించిన సహజ పరిస్థితులను ఆయన అభినందించారు.
ఆరోపణలకు కౌంటర్
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కొందరు వ్యక్తులు చేస్తున్న అవాస్తవ ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. ఇక్కడ నాకేదో భూములు ఉన్నాయని, అందుకే ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామని చెబుతున్నారు. కానీ ఇది నా కోసమో, నా కుటుంబం కోసమో కాదు. ఇది భవిష్యత్ తరాల భవిష్యత్తు కోసం అని స్పష్టం చేశారు.
గతంలో సైబరాబాద్, సిలికాన్ వ్యాలీ.. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ
"ఆనాడు కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరానికి అంకురార్పణ చేశాడు. నిజాం కాలంలో సికింద్రాబాద్ అభివృద్ధి జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్, సిలికాన్ వ్యాలీ ఎదిగాయి. ఇప్పుడు మన వంతు వచ్చింది అని గుర్తుచేశారు. గతం నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉందని, భవిష్యత్ తరాల కోసం భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం అత్యవసరమని అన్నారు.

దక్షిణాదిన పోర్ట్ లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ
ప్రపంచ నగరాల్లో చర్చకు వచ్చే స్థాయిలో భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఒక గొప్ప నగరంగా రూపుదిద్దుకోవాల్సిన అన్ని అర్హతలూ ఈ నగరానికి ఉన్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ దక్షిణ భారతదేశంలో పోర్ట్ లేని ఏకైక రాష్ట్రం అని చెబుతూ, మచిలీపట్నం వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అమరావతి వరకు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకూ కేంద్రం అంగీకరించిందని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో అండర్‌గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలిపారు.

ఫార్చ్యూన్ 500 కంపెనీలే లక్ష్యం
రాబోయే పదేళ్లలో ప్రపంచంలో టాప్‌లో ఉన్న ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఫ్యూచర్ సిటీలో స్థానం కలిగి ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. ప్రభుత్వం ఈ నగర అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తోందని వివరించారు.
ప్రజల భాగస్వామ్యం, సమస్యల పరిష్కారం
"ఇందుకు మీ అందరి సహకారం అవసరం," అని ప్రజలకు పిలుపునిచ్చిన సీఎం, చిన్నచిన్న సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ప్రజలు రాజకీయాల ఉచ్చుల్లో పడకుండా, నేరుగా ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు. నేను స్వయంగా కూర్చొని మీ సమస్యలు పరిష్కరిస్తాను. న్యాయం అందించడమే మా లక్ష్యం అని హామీ ఇచ్చారు. అధికారులను తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నట్టు తెలిపారు.

ఫ్యూచర్ సిటీ కేంద్రంగా ప్రభుత్వ కార్యకలాపాలు
2025 డిసెంబర్ నాటికి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ భవనం, స్కిల్ యూనివర్సిటీ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. "అప్పుడు నెలకు మూడుసార్లు ఇక్కడికే వచ్చి, ఇక్కడి నుంచి అధికార కార్యకలాపాలు నడిపిస్తాను," అని వెల్లడించారు. ప్రపంచంలోని ఎవరైనా ఇక్కడ పెట్టుబడి పెట్టాలనుకున్నా, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలోనే కూర్చొని మాట్లాడతా అని స్పష్టం చేశారు. ప్రపంచాన్ని ఇక్కడికే రప్పిస్తా అన్న ఆయన ధైర్యంగా ప్రజలకు భరోసా ఇచ్చారు.
సింగరేణికి స్థలం కేటాయింపు
సింగరేణి కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణానికి పది ఎకరాలు కేటాయించాలన్న సూచనను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబుకు ఇచ్చినట్లు తెలిపారు. 2026 డిసెంబర్ లోగా ఆ కార్యాలయ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు.






















