Jupally Krishna Rao: బతుకమ్మ సంబరాలు- బైక్ ర్యాలీలో బుల్లెట్ బైక్స్‌పై ప్రత్యేక ఆకర్షణగా మహిళలు
Bathukamma celebrations | బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఎల్బీ స్టేడియం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు బైక్, సైకిల్ ర్యాలీని మంత్రి జూపల్లి కృష్ణారావు జెండా ఊపి ప్రారంభించారు.

Jupally Krishna Rao | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తోంది. బతుకమ్మ పండుగ సంబరాలను పురస్కరించుకుని, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ప్రత్యేక ర్యాలీ కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ ర్యాలీలో సైకిల్, బైక్, స్కేటింగ్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సైక్లిస్ట్‌లతో కలిసి స్వయంగా ర్యాలీలో పాల్గొన్న మంత్రి జూపల్లి, యువతలో ఉత్సాహాన్ని మరింత పెంచారు. ర్యాలీ ఎల్బీ స్టేడియం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు సాగింది. హైదరాబాద్‌కు చెందిన విమెన్ బైకర్స్ సంప్రదాయ వస్త్రధారణతో బుల్లెట్ బైక్స్‌పై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, రాష్ట్ర టూరిజం అభివృద్ధిలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ స్టేడియంలో ముగిసిన ర్యాలీలో పాల్గొన్న రైడర్లకు మంత్రి జూపల్లి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ క్రాంతి వల్లూరు, ఇతర అధికారులు, విద్యార్థులు, పర్యాటక ప్రేమికులు పాల్గొన్నారు.

ఈ బైక్, సైకిల్ ర్యాలీ ద్వారా పర్యాటకం, సాంస్కృతిక వారసత్వంలపై అవగాహన పెంపొందించడం, బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను యువతతో పంచుకోవడం ముఖ్య లక్ష్యంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. పర్యాటక ప్రాంతాలను సందర్శించి రాష్ట్ర టూరిజాన్ని ప్రమోట్ చేయాలని మహిళా బైకర్లకు మంత్రి జూపల్లి పిలుపునిచ్చారు. మిస్ వరల్డ్ పోటీల సమయంలోనూ తెలంగాణ ప్రభుత్వం ప్రపంచం నలుమూల నుంచి వచ్చిన అందెగత్తెలను రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లింది. వారికి తెలంగాణ ప్రాముఖ్యత, పర్యాటక ప్రాంతాల విశిష్టతను వివరించి టూరిజాన్ని ప్రమోట్ చేయడం తెలిసిందే.






















