(Source: ECI/ABP News/ABP Majha)
Telangana Election News: ప్రధాన పార్టీలకు ఈసీ ఝలక్! ఆ పొలిటికల్ యాడ్స్‌కు అనుమతులు రద్దు
Political Advertisements: బీజేపీకి చెందిన 5, బీఆర్ఎస్ కు చెందిన 4, కాంగ్రెస్ పార్టీకి చెందిన 6 ప్రకటనలకు ఎన్నికల సంఘం అనుమతులను ఉపసంహరించుకుంది.
Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ప్రకటనలు రూపొందించి విపరీతంగా వివిధ మాధ్యమాల్లో ప్రసారం చేయిస్తున్నాయి. అయితే, తాజాగా ఎన్నికల సంఘం రెండు ప్రధాన పార్టీలకి షాక్ ఇచ్చింది. ఈ అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ 416కు పైగా ప్రకటనలకు అనుమతి ఇవ్వగా, వాటిలో కొన్ని మార్పులు చేసిన, నిబంధనలు అతిక్రమించి చిత్రీకరించి చేసిన 15 ప్రకటనలకు అనుమతులు రద్దు చేసింది. వీటిలో బీజేపీకి చెందిన 5, బీఆర్ఎస్ కు చెందిన 4, కాంగ్రెస్ పార్టీకి చెందిన 6 ప్రకటనలు అందులో ఉన్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
నిబంధనల ప్రకారం పొలిటికల్ పార్టీలు ప్రచారం కోసం ఉపయోగించుకునే ఈ యాడ్స్ కు రాష్ట్ర స్థాయి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ పర్మిషన్ ఇస్తుందని, వాటిని మార్పులు చేయకుండా ప్రసారం చేయాల్సి ఉంటుందని ప్రకటనలో తెలిపింది. అయితే, వాటినే యథాతథంగా వాడకుండా కొన్ని మార్పులు చేసి, రాజకీయ పార్టీలు ముందుగా తగిన అనుమతి తీసుకొని ఆ ప్రకటనలను యూట్యూబ్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల వేదికల్లో కూడా ప్రసారం చేస్తున్నట్టు ఈసీకి ఫిర్యాదులు అందాయని పేర్కొంది. యాడ్స్ ను అలా ప్రసారం చేయడం నిబంధనల ఉల్లంఘన కింద వస్తుందని ఈసీ స్పష్టం చేసింది.
పొలిటికల్ యాడ్స్ కు సంబంధించి నవంబర్ 8 నుంచి 3 రోజుల పాటు పార్టీలతో సమావేశాలు నిర్వహించి నిబంధనలు, మార్గదర్శకాలు వివరించారు. టీవీలు, పత్రికలు, సోషల్ మీడియా, వెబ్ సైట్లు లాంటి వాటిలో ప్రకటనలు ఇచ్చే విషయంలో వాటిని దుర్వినియోగం, ఇతర సమస్యలు రాకుండా అన్ని రూల్స్ వివరించామని సీఈవో ఆఫీసు ఓ ప్రకటనలో తెలిపింది. ఆ కోడ్ ఉల్లంఘిస్తే నిబంధనల ప్రకారం యాడ్స్ కు ఇచ్చిన పర్మిషన్ ను వెనక్కు తీసుకుంటామని ఈసీ అప్పుడే స్పష్టం చేసింది. మార్గదర్శకాలను అనుసరిస్తున్నామని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు హామీ ఇచ్చినట్టు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫీసు ఆ ప్రకటనలో తెలిపింది.
పొలిటికల్ పార్టీలు ఇచ్చే ప్రకటనలను టీవీల్లో ప్రసారం చేసే ముందు ఆ టీవీ యాజమాన్యాలు ఆ ప్రకటనలో ఉన్న వివరాలు, ధ్రువీకరణ పొందిన ప్రకటనలతో సరి చూసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం అనుమతి పొందిన ప్రకటనలను సీఈవో కార్యాలయంలోని ఐ అండ్ పీఆర్ డిప్యూటీ డైరెక్టర్ వద్ద అందుబాటులో ఉంటాయి. మీడియాకు సంబంధించి ఎన్నికల నియమావళి ప్రకారం పర్మిషన్ రాని అంశాల యాడ్స్ ప్రసారాలను నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. పర్మిషన్ వచ్చిన ప్రకటనల లిస్టును చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫీసు విడుదల చేసింది. వీటిలో బీజేపీకి చెందిన 5, బీఆర్ఎస్ కు చెందిన 4, కాంగ్రెస్ పార్టీకి చెందిన 6 ప్రకటనలు అందులో ఉన్నాయి.