(Source: ECI/ABP News/ABP Majha)
TS Minister KTR: కాంగ్రెస్ పార్టీని పాకిస్తాన్ క్రికెట్ టీమ్ తో పోల్చిన మంత్రి కేటీఆర్, అసెంబ్లీలో సెటైర్లు!
TS Minister KTR at Telangana Assembly Sessions: కాంగ్రెస్ పార్టీ నేతల్ని చూస్తే తనకు పాకిస్తాన్ క్రికెట్ టీమ్ గుర్తొస్తుందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు.
TS Minister KTR says congress party is like Pakistan Cricket Team:
కాంగ్రెస్ పార్టీలో పోటీని చూస్తే తనకు పాకిస్తాన్ క్రికెట్ టీమ్ గుర్తొస్తుందని అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష పార్టీపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. క్రికెట్ టీమ్ లో 11 మంది ఆడతారు, అయితే వెనుకటికి పాకిస్తాన్ టీమ్ ఉండేది. అందులో కెప్టెన్ ఒకరు ఉంటారు, మిగతా వాళ్లంతా మాజీ కెప్టెన్లు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో ఉండేది నలుగురు ఎమ్మెల్యేలు ఉంటారు. వీళ్లు నలుగురు కలిసి ఒకేచోట కూర్చుని పనిచేయలేరు. కానీ వీళ్లు నాలుగు కోట్ల మందిని పాలిస్తామని గొప్పలు చెబుతారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నది నలుగురు కానీ పాక్ క్రికెట్ టీమ్ తరహాలోనే కాంగ్రెస్ నేతలు మొత్తం 10 మంది సీఎం అభ్యర్థులం అంటూ ఒకరిపై ఒకరు నెగ్గే ప్రయత్నం చేస్తుంటారని.. ఈ క్రమంలో తమ పరపతి పెంచుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు, విమర్శలు చేస్తుంటారని కాంగ్రెస్ నేతలను అసెంబ్లీ సాక్షిగా ఏకిపారేశారు. వాళ్లంతా కలిసికట్టుగా ఉండి ప్రజల కోసం ఆలోచించడం మొదలుపెట్టాలని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని, అభివృద్ధిని గుర్తించాలని సూచించారు.
పాకిస్తాన్ క్రికెట్ టీంలో 11 మంది ఆడితే ఒక కెప్టెన్ 10 మంది ఎక్స్ కెప్టెన్లు ఉన్నట్లు.. కాంగ్రెస్ పార్టీలో కూడా 10 సీఎం కాండిడేట్లు ఉన్నారు - మంత్రి కేటీఆర్ pic.twitter.com/o6BWFXCK1g
— Telugu Scribe (@TeluguScribe) August 5, 2023
కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిన పాము - మంత్రి కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయిందని, Expiry Date దాటిపోయిన మెడిసిన్ అని చచ్చిపోయిన పాములాంటిదన్నారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు కాంగ్రెస్ కోరలు తీసేశారని, కానీ వాళ్లు ఏదో ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పక్కింట్లో పెళ్లిఅయితే ఇంట్లో హడావుడిలాగ.. కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలను చూసి తెలంగాణలో ఆ పార్టీ నేతలు హంగామా చేస్తున్నారని చెప్పారు. కర్ణాటకలో ఏదో జరిగిందని చూసి, భట్టి, శ్రీధర్ రెడ్డి మరికొందరు నేతలు తమకు పదవులు అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. సీతక్క సీఎం అని ఒకాయన చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అయితే సీతక్క సీఎం ఏంది, ఇది పెద్ద జోక్ అన్నారని గుర్తుచేశారు. మూడు, నాలుగు నెలల్లో అధికారంలోకి వస్తారు కదా, ఆరోజు పదవులు తేల్చుకోవాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయత 2004లోనే పోయిందన్నారు. రాష్ట్రం ఇస్తామని చెప్పి మోసం చేశారు కనుక ఆరోజే వీళ్ల అడ్రస్ గల్లంతయింది. అందుకే ప్రజలు వీళ్లను తోమి తోమి పక్కన కూర్చోబెట్టారు. ఎందుకంటే ఎన్నో వందల ప్రాణాలు పోయాయి అందుకు ఆ పార్టీనే కారణమని ఆరోపించారు. వీళ్లు మరోసారి ప్రజల విశ్వసనీయత పొందే అవకాశమే లేదంటూ కాంగ్రెస్ నేతలపై అసెంబ్లీలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరికొన్ని నెలల్లో అధికారంలోకి వచ్చే వాళ్లైతే ఇప్పుడు మమ్మల్ని అనడం ఎందుకు, మీకు విషయం లేట్ గా తెలుస్తుందన్నారు. ఆ పార్టీలోనే ఐక్యత ఉండదని, వాళ్లు 4 కోట్ల మందిని పాలించడం అసాధ్యమన్నారు.