Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Andhra News: విద్యార్థులకు రూ.6,500 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లిపోయిన జగన్ ఇప్పుడు సుద్ధపూసలా కబుర్లు చెబుతున్నారని మంత్రి లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. గత ఐదేళ్లలో విద్యా వ్యవస్థను నాశనం చేశారని మండిపడ్డారు.
Minister Lokesh Strong Counter To Jagan On Fee Dues: ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంపై జగన్, లోకేష్ మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడిచింది. కూటమి ప్రభుత్వ వచ్చినప్పటి నుంచి ఫీజు రీయింబర్స్ చేయలేదని జగన్ విమర్శలు చేస్తే .. చిన్న పిల్లలకు అందించే చిక్కీల్లో సైతం డబ్బులు ఎగ్గొట్టిన వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉందని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) కౌంటర్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందన్న జగన్ విమర్శలపై ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ ఏమన్నారంటే
ఆంధ్రప్రదేశ్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌జగన్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. జగన్ ఏం పోస్టు చేశారంటే"కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. మూడు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు చెల్లించకపోవడంతో చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. వారిపై చంద్రబాబు కక్షకట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఒంగోలు జిల్లా జె.పంగులూరులో ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక, ఫీజులు కట్టలేక పనులకు వెళ్తున్న విద్యార్థి కథనం ఆవేదన కలిగించింది." అని దానికి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్ కూడా పోస్టు చేశారు.
అన్ని రంగాల్లో తిరోగమనం: జగన్
చంద్రబాబు రాగానే అన్ని రంగాల్లోనూ తిరోగమనమే కనిపిస్తోందని విమర్శించారు జగన్. ముఖ్యంగా విద్యారంగాన్ని దారుణంగా దెబ్బతీశారన్నారు. అమ్మ ఒడిని, ఇంగ్లీష్ మీడియంను, 3వ తరగతి నుంచి టోఫెల్, 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లు, సీబీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు, బైజూస్ కంటెంట్, నాడు-నేడు ఇలా అన్నింటినీ రద్దుచేసిందన్నారు. 1-12వ తరగతి విద్యార్థులను, వారి తల్లులను కూడా దెబ్బతీశారని ధ్వజమెత్తారు. వసతిదీవెన, విద్యాదీవెన నిలిపేసి, డిగ్రీ, ఇంజినీరింగ్, డాక్టర్ చదువుతున్నవారినీ ఇబ్బందిపెడుతున్నారని మండిపడ్డారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రతి త్రైమాసికం పూర్తికాగానే తల్లుల ఖాతాలో జమచేసే వాళ్లమని అన్నారు. ఇలా గత విద్యాసంవత్సరం డిసెంబర్ త్రైమాసికం వరకూ రూ. 12,609 కోట్లు ఒక్క విద్యాదీవెనకే ఖర్చు చేశామని తెలిపారు. తలరాతలను మార్చేది చదువులు మాత్రమేనని గట్టిగా నమ్ముతూ వైయస్సార్‌సీపీ హయాంలో మొత్తం ఈ రెండు పథకాలకే రూ.18వేల కోట్లు వరకూ ఖర్చు చేశామని గుర్తు చేశారు.
ఎన్నికల కోడ్ కారణంగా ఇవ్వలేకపోయాం: జగన్
ఎన్నికల కోడ్ కారణంగా జనవరి-మార్చి త్రైమాసికానికి, ఏప్రిల్‌లో వెరిఫికేషన్ చేసి మే నెలలో ఇవ్వాల్సిన ఫీజు డబ్బులు వేయనీయకుండా కూటమి పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయన్నారు. పోనీ ఎన్నికలైన తర్వాత జూన్‌లో అయినా ఇచ్చారా అంటే అదీలేదన్నారు. ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన వసతి దీవెన, ఏప్రిల్-జూన్, తర్వాత జులై-సెప్టెంబరు త్రైమాసికాలకు సంబంధించి ఫీజులు చెల్లింపులో అడుగూ ముందుకు పడ్డంలేదన్నారు. ఇప్పుడు అక్టోబరు-డిసెంబరు త్రైమాసికం కూడా సగం గడిచిపోయిందన్నారు. సుమారు రూ.2,800 కోట్లకుపైగా ఫీజులు రీయింబర్స్ చేయాల్సి ఉందని వివరించారు. మరో రూ.1,100 కోట్లు వసతిదీవెన బకాయిలు ఉన్నాయన్నారు. మొత్తంగా డిసెంబర్ నాటికి రూ.3,900 కోట్లకు చేరుకుంటాయని తెలిపారు. కానీ, ఈ ప్రభుత్వం తీరు చూస్తే మాటలేమో కోటలు దాటుతున్నాయి, కాళ్లేమో గడపకూడా దాటడం లేదు అన్నట్టు ఉందని విమర్శించారు.
11 లక్షల మంది విద్యార్థులకు ఇబ్బంది: జగన్
ఫీజులు కట్టక 11 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారన్నారు. తల్లిదండ్రులు అప్పులు చేయడమో, వాటిని తీర్చలేక ఆస్తులు అమ్ముకోవడమో చేయాల్సి వస్తోందన్నారు. ఏ దారీలేనివారు తమ పిల్లలను పనులకు తీసుకెళ్తున్నారు. చదువులకు నిలయమైన ఏపీలో దౌర్భాగ్యకర పరిస్థితులు ఇవి అంటూ విమర్శలు చేశారు.
డిసెంబర్ నాటికి 3500 కోట్ల బకాయిలు: జగన్
కూటమి అధికారంలోకి వచ్చాక రూ.6,500 కోట్ల రీయింబర్స్‌మెంట్ బకాయిలను తీర్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని మార్చి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడింది వైసీపీ ప్రభుత్వమేనని మండిపడ్డారు. 'అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతారాహిత్యంగా ఉండి ప్రతిపక్షంలోకి రాగానే విలువలు వల్లించడం మీకే చెల్లింది. విద్యా దీవెన, వసతి దీవెన పేరుతో రూ.3500 కోట్లు బకాయిలు పెట్టి మోసం చేసిన కారణంగానే సర్టిఫికెట్లు రాక లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.
సీరియస్‌గా రియాక్ట్ అయిన లోకేష్
అసలు విద్యార్థులకు డబ్బులు ఎగ్గొట్టిన వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు సుద్దపూసలా కబుర్లు చెప్పడం విడ్డూరుంగా ఉందన్నారు మంత్రి నారా లోకేష్. మీ నిర్వాకాన్ని నా యువగళం పాదయాత్రలోనే విద్యార్థులు నా దృష్టికి తెచ్చారు. వారికి ఇచ్చిన హామీ మేరకు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని సమస్య పరిష్కరించాం. గత ప్రభుత్వ బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని, విద్యార్థుల సర్టిఫికెట్లను తక్షణమే అందజేయాల్సిందిగా కళాశాలలను ఆదేశించాం. ఇకపై ఫీజు రీఎంబర్స్ మెంట్ సొమ్మును నేరుగా కళాశాలలకు చెల్లించేలా ఇటీవలే నిర్ణయం కూడా తీసుకున్నాం.' అని మంత్రి పేర్కొన్నారు.
1. చిన్న పిల్లల చిక్కీ డబ్బులు సైతం ఎగ్గొట్టిన సుప్పుని తాను సుద్దపూసని అనడం విచిత్రంగా ఉంది @ysjagan గారు! గుడ్లు, చిక్కీలు మొదలుకొని ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల వరకూ మీరు నా నెత్తిన పెట్టి పోయిన బకాయిలు అక్షరాలా రూ. 6,500 కోట్లు. ఫీజు మొత్తం కడతానని చేతులెత్తేసిన చెత్త పాలన… https://t.co/Lz39pk407C pic.twitter.com/CtHDk3rsrR
— Lokesh Nara (@naralokesh) November 24, 2024
'విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు'
'గత ఐదేళ్లలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. మీ అనాలోచిత, అవినీతి విధానాల కారణంగా రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లల్లో 4 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయిన విషయం వాస్తవం కాదా?. ఉపాధ్యాయులు, విద్యార్థులను సిద్ధం చెయ్యకుండానే సీబీఎస్ఈ పరీక్షా విధానం తీసుకొచ్చారు. నీ నిర్ణయాలు బ్లైండ్‌గా ఫాలో అయితే ఆ పిల్లలంతా బోర్డు పరీక్షల్లో తప్పి డిప్రెషన్‌లోకి వెళ్లేవారు. ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యం పెంచకుండా, టోఫెల్, ఐబీ శిక్షణ ఇచ్చేవారు లేకపోయినా అమలు చేశామని డబ్బా కొట్టుకోవడం. ఇలా ఒక్కటేంటి విద్యా వ్యవస్థను నాశనం చేసిన పాపం మీదే.' అంటూ లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పబ్లిసిటీ పీక్ - విషయం వీక్
నాడు - నేడు అంటూ పబ్లిసిటీ పీక్‌కు తీసుకెళ్లారు కానీ విషయం వీక్ అని తేలిందని లోకేశ్ మండిపడ్డారు. వైసీపీ హయాంలో పాఠశాలల్లో బల్లలు, తాగునీరు, టాయిలెట్లు వంటి కనీస సౌకర్యాలు కల్పించలేదని ధ్వజమెత్తారు. తన క్షేత్రస్థాయి పర్యటనల్లో ఈ విషయం స్పష్టమైందని చెప్పారు. ఇక ట్యాబులు ఇంటికి ఇవ్వడం వల్ల జరుగుతున్న అనర్థాలను మీరు నేరుగా తల్లిదండ్రులనే అడిగి తెలుసుకోవచ్చని అన్నారు. 'మీరు చేసిన విధ్వంసాన్ని ఒక్కొక్కటిగా సరి చేస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టులను మెగా డీఎస్సీతో భర్తీ చేసే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించాం. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో పాత ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేసి తీరుతాం. రాబోయే ఐదేళ్లలో ఏపీ విద్యా రంగాన్ని దేశానికే తలమానికంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు గారి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం సంకల్పించింది. మీలాంటి మారీచులు ఎంత తప్పుడు ప్రచారం చేసినా విద్యా రంగ సంస్కరణల విషయంలో మా అడుగు ముందుకే!' అని లోకేశ్ ట్విట్‌లో పేర్కొన్నారు.