Srikakulam Latest News: తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
Amadalavalasa News Today: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ రోజు రోజుకు డీలా పడుతోంది. ఓటమితో కొందర నేతలు ఇంటి నుంచి బయటకి రావడం లేదు. మరోవైపు పార్టీలో జరుగుతున్న మార్పులు మరికొందర్ని ఇబ్బంది పెడుతోంది.
Tammineni Sitaram Latest News: ఆమదాలవలసలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి సీనియర్ నాయకుడు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన తనయుడు నానితో పాటు కిల్లి సత్యనారాయణ హాజరుకాలేదు. వారితోపాటు వారి మద్దతుదారులు కొందరు సమావేశానికి ముఖం చాటేశారు. వారు హాజరుకాని వైనం ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్తగా చింతాడ రవికుమార్‌ను నియమించారు. మొన్నటి వరకూ ఇన్‌చార్జిగా ఉన్న మాజీ శాససభాపతి తమ్మినేని సీతారాంను మార్చి యువకుడైన రవికుమార్‌కి అవకాశాన్ని "జగన్ ఇచ్చారు. ఊహించని ఈ పరిణామంతో తమ్మినేని సీతారాం తీవ్ర నిరాశకి లోనయ్యారు. ఆయనతోపాటు మొదట నుంచి తమ్మినేని కుటుంబం వెంట నడిచిన వారి మద్దతుదారులు షాక్‌కి గురయ్యారు. ఆ ప్రకటన వెలువడిన తర్వాత పలువురు నేతలు తమ్మినేని సీతారాంని కలుసుకుని ఆయనతో తాజా పరిణామాలపై చర్చించారు. వాస్తవానికి తమ్మినేని సీతారాం ఎన్నికల ముందే తనకు బదులుగా తనయుడు తమ్మినేని చిరంజీవి నాగ్‌కి ఆమదాలవలస నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని అధినేతను కోరారు. దీన్ని జగన్ తిరస్కరించారు.
తమ్మినేని సీతారాంనే పోటీ చేయాలని సూచిస్తూ ఆయననే 2024 ఎన్నికల్లో అభ్యర్ధిగా ప్రకటించారు. వైసీపీ ఓటమి పాలైన తర్వాత కూడా ఆయన నియోజకవర్గ ఇన్ చార్జీగా కొనసాగుతూ పార్టీ కార్యక్రమాలకు తమ్మినేని చిరంజీవి నాగ్ హాజరవుతూ వస్తున్నారు. ఉన్నట్లుండి చింతాడ రవికుమార్‌ను ఆమదాలవలస సమన్వయకర్తగా ప్రకటించడంతో వారు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అందుకే చింతాడరవికుమార్ తొలిసారి నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశానికి హాజరుకాలేదని తెలుస్తోంది.
ఇటీవల రాష్ట్రకార్యదర్శిగా నియమితులైన మరో సీనియర్ నాయకుడు కిల్లి సత్యనారాయణ కూడా ఈ సమావేశానికి హాజరుకాలేదు. తమ్మినేని, కిల్లి ఇద్దరు గైర్హాజరవడం చర్చనీయాంశమైంది. కిల్లి సత్యన్నారాయణ స్థానికంగా అందుబాటులోలేకపోవడం వల్లనే హాజరుకాలేదని అంటున్నారు. తమ్మినేని సీతారాం, చిరంజీవి నాగ్, వారి మద్దతుదారులు సమావేశానికి రాకపోవడానికి కారణాలు ఏంటో తెలియదని నాయకులు అంటున్నారు.
నూతన సమన్వయకర్త చింతాడ రవికుమార్ మాత్రం ఆమదాలవలస నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చింతాడ రవికుమార్ అన్నారు. నాయకులు, కార్యకర్తలందరిని కలుపుకుని పని చేస్తానన్నారు. ఆమదాలవలసలో వైసీపీ జెండా ఎగురవేసే లక్ష్యంగా ముందుకు వెళ్తానన్నారు.
ఆమదాలవలసలో శుక్రవారం నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. నియోజకవర్గ సమన్వయకర్తగా చింతాడ రవికుమార్‌ను నియమించిన తర్వాత తొలిసారి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆమదాలవలస మున్సిపాల్టీతోపాటు మండలం, బూర్జ, సరుబుజ్జిలి, పొందూరు మండలాలకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశానికి వచ్చిన నాయకులందరిని పలుకరించి వారితో మాట్లాడారు.
ఈ సమావేశంలో సీనియర్ నాయకులతోపాటు కార్యకర్తలు అంతా వచ్చారు. ఎంపిపి, జడ్పీటీసి, ఎంపిటిసిలు, కౌన్సిలర్లు ఇలా ప్రస్తుతం పదవిల్లో ఉన్న వారితోపాటు మాజీలు కూడా హాజరయ్యారు. పలువురు సీనియర్ నాయకులు మాట్లాడుతూ భవిష్యత్ కార్యాచరణపై తమ మనస్సులలోని మాటలను తెలియజేశారు. ఈ సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ మాట్లాడుతూ తనపై ఉన్న నమ్మకంతో ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించిన జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలను తెలియజేశారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో వైకాపా జెండాను ఆమదాలవలసలో ఎగురవేసేందుకు కలసి పని చేస్తామన్నారు.
చిన్నచిన్న సమస్యలు పార్టీలోఉన్నాయని అవన్నీ సద్దుమణిగిపోతాయని రవికుమార్ అన్నారు. సమన్వయకర్తగా తన పేరును జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన తర్వాత నాయకులు అందరిని కలుసుకుని సహకరించాలని కోరడం జరిగిందన్నారు. అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పిందే తనకు వేదమని అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్దితో నిర్వహించేందుకు కృషి చేస్తానన్నారు. వివిద కారణాల వల్ల కొందరు నాయకులు ఈ సమావేశానికి రాలేనప్పటికీ భవిష్యత్‌లో వారంతా కూడా ఆమదాలవలసలో వైసీపీ కోసం పని చేస్తారన్నారు.
ఎన్‌డిఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉందో అందరూ చూస్తున్నారన్నారు రవి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దాట వేత ధోరణిని అవలంభిస్తున్నారన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకి ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చరాని గుర్తు చేసారు. ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలో ఇసుక దోపిడి యథేచ్చగా సాగుతుందన్నారు. ఈ విషయం అధికారులకి తెలిసినా వారు పట్టించుకోవడం లేదన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఎటువంటి పరిణామలు జరుగుతున్నాయో ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. రానున్న రోజులలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు నాయకులు, కార్యకర్తలు అంతా కలసి పనిచేయాలని చింతాడ రవికుమార్ పిలుపునిచ్చారు. సమన్వయకర్తగా ఎంపికైన వ్యక్తి నిర్వహించే తొలి సమావేశానికి కీలక నేతలు హాజరుకాకపోవడం సంచలనంగా మారింది. ఈ పరిణామాలు ఎటుదారి తీస్తాయోననేది కార్యకర్తలు, జిల్లా నేతలు చర్చించుకుంటున్నారు.