Telangana Assembly Session: లగ్నపత్రిక నాడే దరఖాస్తు చేస్తే తాళి కట్టే సమయానికి చేతికి చెక్కులు: మంత్రి గంగుల
Telangana Assembly Session:: లగ్న పత్రిక పెట్టుకున్న రోజే దరఖాస్తు చేసుకుంటే పెళ్లిరోజు వరకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చేస్తున్నామని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
Telangana Assembly Session: దేశంలో ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ అమలు చేస్తున్నామని అసెంబ్లీలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆడ పిల్లల పెళ్లిళ్లకు షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ పథకాల ద్వారా రూ. లక్షా నూట పదహార్లు(రూ. 1,00,116) ఆర్థిక సాయం రాష్ట్ర సర్కారు అందజేస్తోందని తెలిపారు. శాసనసభ బడ్జెట్ సమావేశంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన మంత్రి గంగుల, సీఎం కేసీఆర్ సర్కారు అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను కొనియాడారు. లగ్న పత్రిక పెట్టుకున్న రోజు కల్యాణ లక్ష్మీకి దరఖాస్తు చేసుకుంటే పెళ్లి రోజు కల్యాణ మండపంలో ఆర్థిక సహాయం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు
చాలా మంది పెళ్లి అయిన తర్వాత కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలకు దరఖాస్తులు చేసుకుంటున్నారని, వాటిని 15 రోజుల్లో పరిశీలించిన అనంతరం అర్హులకు చెక్కుల అందజేస్తున్నామని మంత్రి గంగుల శాసనసభలో వెల్లడించారు. ఆర్థిక సహాయం అందించడంలో ఎక్కడా ఆలస్యం జరగడం లేదని సమయానికి అర్హులకు అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న వారికి సంవత్సర ఆదాయం లక్షా 50 వేల రూపాయలు, పట్టణాల్లో నివాసం ఉంటున్న వారికి సంవత్సరానికి 2 లక్షల ఆదాయం ఉన్న వారికి మాత్రమే కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ కింద చెక్కులు ఇస్తున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారని వెల్లడించారు.
కళ్యాణలక్ష్మి పథకం..
తెలంగాణ రాష్ట్రం లోని నిరుపేద (దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ కులాలకు చెందిన) యువతుల వివాహాల కోసం కళ్యాణలక్ష్మి పథకం పథకం కింద రూ.1,00,116 చొప్పున ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో ప్రభుత్వం 2014, అక్టోబర్ 2న ప్రవేశపెట్టింది. మార్చి 13, 2017న ప్రవేశపెట్టిన 2017-18 తెలంగాణ బడ్జెట్ లో ఈ పథకానికి ఆర్థిక సాయాన్ని రూ.51వేల నుంచి రూ.75,116 లకు పెంచారు. మార్చి 19, 2018న ఆ మొత్తాన్ని రూ.1,00,116 పెంచారు. 18 ఏళ్లు వయోపరిమితి ఉన్న బీసీ, ఓబీసీ యువతులకు ఈ పథకం వర్తిస్తుంది. గ్రామాల్లో ఆదాయం రూ.లక్షన్నర, పట్టణాల్లో రూ.2 లక్షల ఆదాయం ఉన్న వారు ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది.
ఎనిమిదేళ్ల నుంచి కొనసాగుతున్న పథకం..
ఎనిమిదేళ్ల కిందట ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటి వరకూ 10 లక్షల కుటుంబాలు లబ్ధిపొందాయి. పేదింటి ఆడబిడ్డల పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు అప్పు చేయకూడదని, వారి ఇళ్లల్లో సంతోషం నింపేందుకు సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ పథకాన్ని తీసుకొచ్చారు. తొలుత ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతుల వివాహానికి రూ.51,000 వేల ఆర్థిక సాయాన్ని అందించేవారు. తర్వాతిరోజుల్లో పథకాన్ని బీసీలకు సైతం వర్తింపజేశారు. 2017లో ఈ మొత్తాన్ని 75,116కు పెంచిన తెలంగాణ ప్రభుత్వం.. మార్చి 19, 2018 నుంచి కల్యాణలక్ష్మి ఆర్థిక సాయాన్ని రూ.1,00116 లకు పెంచడం తెలిసిందే.