Tarun Chug: ఫాంహౌజ్ వీడియోలు డ్రామా అని మేం ప్రూవ్ చేశాం, కేసీఆర్ చేయగలరా? - తరుణ్ చుగ్
మునుగోడు ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీనే గెలిచి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మునుగోడులో అధికారం దుర్వినియోగం అయిందని తరుణ్ చుగ్ అన్నారు.
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం విడుదల చేసిన ఫాంహౌజ్ వీడియోలు సంచలనం రేపుతుండగా, బీజేపీ నేతలు వరుసగా వాటికి కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ స్పందించారు. ఆ వీడియోలతో బీజేపీకి ఎలాంటి సంబంధమూ లేదని వివరణ ఇచ్చారు. ఆ విషయంపై ఇప్పటికే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తడి బట్టలతో యాదాద్రిలో ప్రమాణం చేసారని తరుణ్ చుగ్ గుర్తు చేశారు. తాము డ్రామా ఆడలేదని కేసీఆర్ ప్రమాణం చేస్తారా అని తరుణ్ చుగ్ సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ విముక్త రాష్ట్రం కోరుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ ప్రధాని కావాలని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
మునుగోడు ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీనే గెలిచి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మునుగోడులో అధికారం దుర్వినియోగం అయిందని తరుణ్ చుగ్ అన్నారు. పోలింగ్‌కు కొన్ని గంటల ముందు వరకు కూడా మంత్రులు మునుగోడులోనే ఉన్నారని అన్నారు. ఎవరివైపు న్యాయం ఉందో మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలే తేలుస్తారని తరుణ్ చుగ్ చెప్పుకొచ్చారు. కేసీఆర్‌కు తన ఎమ్మెల్యేలపై ఎందుకు విశ్వాసం లేదని ప్రశ్నించారు. తమ దగ్గర అమ్ముడుపోయే ఎమ్మెల్యేలు ఉన్నారా? అని ప్రశ్నించారు. సినిమాల్లో తరహాలో సీఎం కట్టుకథలు వినిపిస్తున్నారని చెప్పారు. దేవుడిపై కేసీఆర్ కు విశ్వాసం లేకపోతే, ఈడీ ఎంక్వైరీకి కూడా తాము సిద్ధమని సవాల్ విసిరారు. ఈ విషయంలో అవసరం అయితే న్యాయ పోరాటానికి సైతం సిద్ధం అవుతామని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ నేత ఫాంహౌజ్ కి వచ్చిన ముగ్గుు బ్రోకర్లతో ఎవరితోనూ తమకు సంబంధాలు లేవని చెప్పారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలకు ప్రజలు చరమగీతం పాడాల్సిందేనని తరుణ్ చుగ్ పిలుపునిచ్చారు. కేసీఆర్ కు ప్రజలు బైబై చెప్తారని ఎద్దేవా చేశారు. ఇలాంటి ముఖ్యమంత్రిని మొదటి సారి చూస్తున్నామని మండిపడ్డారు.
‘‘మేం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూడాలని లేదా కాంట్రాక్ట్ ఇవ్వాలని చూడలేదు. వారు సొంతగా మా పార్టీలోకి వస్తున్నారు. ఫాంహౌజ్ ఎపిసోడ్ లో మా పాత్ర అస్సలు ఏమీ లేదు. ఆ డ్రామా మొత్తం వెనుక సీఎం కేసీఆర్ మాస్టర్ మైండ్ ఉంది. ఆ వీడియోల ద్వారా సీఎం క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయింది’’ అని తరుణ్ చుగ్ అన్నారు.