T Congress Leaders: తెలంగాణ సీఎస్ శాంతికుమారితో కాంగ్రెస్ నేతల భేటీ, ఎందుకంటే?
T Congress Leaders: తెలంగాణ సీఎస్ శాంతి కుమారితో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. పంజాగుట్ట సర్కిల్లో అంబేడ్కర్ విగ్రహం పెట్టేందుకు అనుమతి కావాలని ఆమెను కోరారు.
T Congress Leaders: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, పీసీసీ మాజీ అధ్యక్షులు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు డా. మల్లు రవిలు ఈ భేటీలో పాల్గొన్నారు. పంజాగుట్ట సర్కిల్లో అంబేద్కర్ విగ్రహం పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని సీఎస్ ని కోరుతూ వినతి పత్రం అందజేశారు.
పంజాగుట్టలో పెట్టిన అంబేడ్కర్ విగ్రహాన్ని మున్సిపల్ సిబ్బంది తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. విగ్రహాన్ని వీ హనుమంతరావుకు అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. అయినప్పటికీ వీ హనుమంత రావుకు ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ లో ఉన్న విగ్రహాన్ని అప్పగించలేదన్నారు. అంబేడ్కర్ విగ్రహాన్ని పంజాగుట్టలో పెట్టడానికి పర్మిషన్ ఇవ్వాలని సీఎస్ ని కోరినట్లు వెల్లడించారు. అంబేద్కర్ ని అవమానించడం దేశంలోని ప్రతీ పౌరుడిని అవమానించినట్లేనని తెలిపారు. అంబేడ్కర్ కి అవమానం చేస్తే కాంగ్రెస్ పార్టీ నేతలుగా చూస్తూ.. ఊరుకోమన్నారు. పంజాగుట్ట చౌరస్తాలో ఎక్కడ తొలగించారో అక్కడనే అంబేద్కర్ విగ్రహం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం బాధాకరమని మాజీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అంబేడ్కర్ విగ్రహం తీసివేసిన వారిని ప్రభుత్వం సస్పెండ్ చేసిందన్నారు. అంటే ప్రభుత్వం తప్పు ఒప్పుకున్నట్లేనని వివరించారు. అంబేడ్కర్ స్ఫూర్తి ప్రభుత్వానికి ఉంటే ఆయన విగ్రహాన్ని పంజాగుట్టలో పెట్టాలని డిమాండ్ చేస్తున్నట్లు వివరించారు. పంజాగుట్ట వద్ద అంబెడ్కర్ విగ్రహం పెట్టాలని దళితులు అందరూ కోరుతున్నారని సీఎస్ కి వివరించినట్లు వీ హనుమంతరావు చెప్పుకొచ్చారు. పంజాగుట్టలో ఎక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించారో అక్కడే ఏర్పాటు చేసే వరకు తన పోరాటం కొనసాగిస్తూనే ఉంటానన్నారు.
హాత్ సే హాత్ జోడో కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నామని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి వివరించారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ అరాచకాలపై ఛార్జ్ షీట్ రిలీజ్ చేయబోతున్నాట్లు తెలిపారు. మొన్న కేంద్రంలో బీజేపీపై ఛార్జ్ షీట్ తెలుగులో కూడా అనువాదం చేశామని అన్నారు. బందిపోటుల రాక్షస సమితి మీద త్వరలో ఛార్జ్ షీట్ విడుదల చేస్తామన్నారు. ఏ ఒక్క ఎన్నికల హామీని సీఎం కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. మోసపూరిత పాలనను ప్రజల ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం అని ఆయన వివరించారు. ఉద్యోగాలు, డబుల్ బెడ్రూమ్, కేజీ టు పీజీ విద్య ఇలా అన్ని మాటలను కేసీఆర్ తప్పాడన్నారు. నిధులు, నీళ్లు, నియామకాల ఊసును బీఆర్ఎస్ ప్రభుత్వం మరచిపోయిందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
రైతులకు ఉచిత ఎరువులు, గొల్ల కూర్మలకు గొర్రెలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగు నీరు ఏమైందన్నారు. కాళేశ్వరంలో దోచుకున్నది ప్రజల ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ప్రభుత్వం మెడలు వంచే రోజులు దగ్గరపడ్డాయని, ప్రతి వారానికి ఒక సబ్జెక్టు, విభాగం మీద ఛార్జ్ షీట్ విడుదల చేయబోతున్నామని వెల్లడించారు. కేవలం వారి స్వార్ధం కోసమే.. ప్రచారం తప్ప మరో ఆర్భాటం లేదు బీజేపీకి అంటూ ఫైర్ అయ్యారు. కేవలం 10 శాతం మంది చేతుల్లోనే దేశం సంపద 64 శాతం ఉందన్నారు. కేవలం ధనికులు కోసమే కేంద్రం పని చేస్తోందని, సామాన్యుడి బతుకు భారంగా మారిందని గుర్తు చేశారు. రైతులు, పేదల గురించి మోడీ పట్టించుకోలేదు కేవలం తన సన్నిహితులకు దోచి పెట్టడంలోనే ఉన్నారన్నారు. అమిత్ షా కుమారుడు ఈరోజు బీసీసీఐ కీలక పదవిలో ఉన్నాడని ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పారు. నోట్ల రద్దు వల్ల పేదలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, నల్ల చట్టాల వల్ల 700 మంది రైతులను పొట్టన బెట్టుకోవడంతో పాటు 60 వేల కోట్ల రూపాయలు దుబారా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్మితా సబర్వాల్ ఇంటిలో ఆగంతుకుడి ప్రవేశంపై ఇప్పటికి కేసీఆర్ స్పందించలేదని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ తెలిపారు. అలాగే సికింద్రాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో చనిపోయిన ఇద్దరి ఆచూకీ లభించకపోవడం కేసీఆర్ డొల్ల పాలనకు అద్దం పడుతోందన్నారు. అలాగే ఈ రెండు నెలలు పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తామని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ వెల్లడించారు. బీజేపీ, బీఆర్ఎస్ అరాచకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లేందుకు మంచి అవకాశం లభించిందని చెప్పారు.