TS High Court: తెలంగాణ హైకోర్టుకు కొత్త సీజే నియామకం, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి బదిలీ
Supreme Court Collegium: సుప్రీంకోర్టు కొలీజియం వివిధ హైకోర్టులో సీజేలకు స్థాన చలనం కలిగించింది. ప్రస్తుతం ఉన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని బదిలీ చేసింది.
Telangana High Court New Chief Justice: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నియమితులు అయ్యారు. ప్రస్తుతం ఈయన అదే కోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. అయితే, ఇప్పుడు సీజేగా పదోన్నతి లభించింది. ప్రస్తుతం ఉన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. దీంతో జస్టిస్ సతీష్ చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయనున్నారు.
దీంతో పాటు సుప్రీంకోర్టు కొలీజియం వివిధ హైకోర్టులో సీజేలకు స్థాన చలనం కలిగించింది. తాజాగా ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా విపిన్ సంగి, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అంజాద్ సయీద్, రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎస్.ఎస్.షిండే, గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా రష్మిన్ ఛాయ నియమితులు అయ్యారు.
గతంలో సతీష్ చంద్రశర్మ కర్ణాటక హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. మధ్యప్రదేశ్ హైకోర్టుకు 2008 జనవరి 18న అదనపు న్యాయమూర్తిగా అపాయింట్ అయిన ఆయన జనవరి 15, 2010న పర్మిమెంట్ జడ్జి అయ్యారు. 2021 అక్టోబర్‌లో తెలంగాణ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.
చీఫ్ జస్టిస్‌గా పదోన్నతి పొందిన ఉజ్జల్ భూయాన్ తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. 2011 అక్టోబర్ 17న భూయాన్ గువహటి హైకోర్టుకు అడిషనల్ జడ్జిగా అపాయింట్ అయ్యారు. 2019 అక్టోబరులో బాంబే హైకోర్టుకు ఆయన బదిలీ అయ్యారు. 2021 అక్టోబరులో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. తాజాగా సీజే అయ్యారు. అంతేకాదు, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కూడా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ వ్యవహరిస్తున్నారు.