Nakkapalli Bulk Drug Park: నక్కపల్లి బల్క్‌డ్రగ్ పార్క్ చుట్టూ రాజకీయం ! ప్రజల బలహీనతతో ఆడుకుంటున్న పార్టీలు!
Nakkapalli Bulk Drug Park: నక్కపల్లి బల్క్‌డ్రగ్ పార్క్ చుట్టూ రాజకీయం విస్తరించింది. ప్రజల బలహీనతను ఓట్లు మార్చుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. కానీ జరిగే నిజాన్ని పట్టించుకోవడం లేదు

Nakkapalli Bulk Drug Park: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం పార్టీలకు అలవాటుగా మారిపోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పు అనిపించింది అధికారంలోకి వచ్చిన తర్వాత కరెక్ట్ అవుతుంది. అధికారంలో ఉన్నప్పుడు రైట్ అయింది ప్రతిపక్షంలోకి వచ్చేసరికి రాంగ్ అవుతుంది. రాజకీయంగా అవకాశాలు కల్పించుకునేందుకు ప్రజల్లో ఉన్న సెంటిమెంట్‌ను వాడుకుంటున్నారు. ఇప్పుడు నక్కపల్లి బల్క్‌డ్రగ్ పార్క్ చుట్టూ ఇదే రాజకీయం నడుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస ప్రభుత్వం ఇక్కడ భూములు సేకరించింది. వైసీపీ ఆ భూముల్లో డ్రగ్ పార్క్ కోసం అనుమతులు మంజూరు చేసింది. వర్చువల్‌గా కూడా శంకుస్థాపనలు చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ పనులను పరుగులు పెట్టిస్తోంది. ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు టీడీపీ ఆ ఫ్యాక్టరీ ఏర్పాటును తప్పుపట్టింది. అదే పని ఇప్పుడు అధికారం కోల్పోయిన వైసీపీ చేస్తోంది.
దేశవ్యాప్తంగా మూడే ముడు
కరోనా తర్వాత భారత్‌లో అనేక మార్పులు వచ్చాయి. వాటిలో వైద్య రంగంలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి. అప్పటి వరకు ఫార్మారంగానికి కావాల్సిన ముడి సరకు కోసం చైనాపై ఆధార పడాల్సి ఉండేది. దీన్ని పూర్తిగా మార్చాలని భావించిన కేంద్రం మూడు అతి పెద్ద బల్క్‌డ్రగ్ పార్క్‌లను ఏర్పాటు చేయాలని చూసింది. దీని కోసం అనేక రాష్ట్రాలు పోటీ పడ్డాయి. అయితే లాబీయింగ్ చేసుకున్న రాష్ట్రాలకు వీటిని కేంద్రం అప్పగించింది. ఒకటి గుజరాత్‌కు ఇస్తే మరొకటి హిమాచల్ ప్రదేశ్‌కు, ఇంకొకటి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు.
కాకినాడలో అనుకున్నది నక్కపల్లికి మారిందిలా?
రాష్ట్రానికి వచ్చిన బల్క్ డ్రగ్ పార్కును కాకినాడలో ఏర్పాటు చేయాలనుకున్నారు కానీ నక్కపల్లి వద్ద కావాల్సినంత భూమి సిద్ధంగా ఉందని అక్కడికి సెప్టెంబర్ 2023లో మార్చారు. నక్కపల్లి వద్ద ఏర్పాటు చేసే ఈ బల్క్ డ్రగ్ పార్క్ కోసం మొత్తం 2001.85 ఎకరాల్లో స్థలాలు సేకరించారు. వంపాం, బుచ్చరాజ్‌పేట, రాజయ్యపేట, చందన, లక్ష్మీపురం గ్రామాల నుంచి ల్యాండ్‌ను సేకరించారు. నక్కపల్లిలో ఉన్న వసతులు, దాని ప్రత్యేక వ్యూహాత్మక స్థానం కారణంగా తరలించారు. నేషనల్ హైవే 16 (NH 16)కు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతం. రైల్వే కనెక్టివిటీ కూడా 5 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇలాంటి రవాణా వ్యవస్థ ఎగుమతి, దిగుమతులకు ఉపయోగపడుతుంది. గంగవరం పోర్, విశాఖపట్నం పోర్టు, కాకినాడ పోర్టు ఈ ప్రాంతానికి 50, 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అందుకే ఇక్కడ బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు కేంద్రం కూడా ఓకే చెప్పింది. ఇప్పటికే ఈ పార్క్‌కు సమీపంలో హెటెరో, దివిస్ ల్యాబ్స్, లాల్స్ ల్యాబ్స్ వంటి ఫార్మా కంపెనీలు ఉన్నాయి. దీంతో ఇక్కడి ఎకో సిస్టమ్ కూడా అనుకూలంగా ఉంటుందని ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు.
శర వేగంగా పనులు
మార్చి 2023లో మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ విడుదల నుంచి రెండు ఏళ్లలో అంటే మార్చి 2025 నాటికి మొదటి ఫేజ్ పార్క్‌ను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ప్లేస్ మార్పు, పర్యావరణ క్లియరెన్స్ , అమెండ్‌మెంట్ కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. దీనికి మార్చి 22, 2024న సింగిల్ ప్యాకేజీగా టెండర్లు ఆహ్వానిస్తే ఎవరూ ముందుకు రాలేదు. దీంతో మే 4, 2024న మూడు ప్యాకేజీలుగా ఈ పార్క్‌ను విభజించారు. ప్యాకేజీ 1కు ఆగస్టు 2024లో టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇప్పుడు మార్చి 31, 2026 నాటికి తొలి ఫేజ్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ దిశగానే పనులు సాగుతున్నాయి
బల్క్ డ్రగ్ పార్క్ తమ ఘనతగా చెప్పుకున్న వైసీపీ
అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ బల్క్‌డ్రగ్ పార్క్ రాకను చాలా ఎలివేషన్స్ ఇచ్చుకుంది. ఇది వైసీపీ పాలనకు, జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న నమ్మకంతోనే దీని ఏర్పాటు జరుగుతోందని కూడా చెప్పుకొచ్చింది. దీన్ని మొదట్లో కాకినాడకు సమీపంలో ఏర్పాటు చేసేందుకు ఓకే చెప్పారు. కానీ దీన్ని అప్పటికి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. దీని వల్ల రోగాలు వస్తాయని వాతావరణం కాలుష్యమైపోతుందని కూడా కేంద్రానికి లేఖలు రాశారు ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. దీనికి జగన్ తోపాటు ఆయన సొంత మీడియా కూడ తీవ్రంగా తప్పుపట్టింది. ఇలాంటి చర్యల వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రారని అన్నారు. ఇలాంటి వాటిని బేస్ చేసుకొని ప్రజలను రెచ్చగొట్టే విధంగా లేఖలు రాయడం ఏంటని కూడా జగన్ అసెంబ్లీలో ప్రశ్నించారు.
నాడు వ్యతిరేకించి నేడు పనులు చేస్తున్న టీడీపీ
అప్పటికి ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ బల్క్ పార్క్‌ను తీవ్రంగా వ్యతిరేకించింది. ఎన్నికల ముందు రాజయ్యపేట గ్రామాన్ని సందర్శించిన వంగలపూడి అనిత ప్రజలకు హాని లేని పరిశ్రమలకు తాము వ్యతిరేకం కాదని అన్నారు. హెటిరో పైప్‌లైన్‌తోనే పిల్లల నుంచి పెద్దల వరకు వ్యాధులబారినపడుతున్నారని అన్నారు. ఊపిరితిత్తులు, చర్మవ్యాధులు, కిడ్నీ, క్యాన్సర్ వంటి రోగాలు వస్తాయని చెప్పుకొచ్చారు. గ్రామ సభలు పెట్టకుండా, ప్రజల ఆమోదం లేకుండా మందుల కంపెనీలకు అనుమతులు ఇవ్వబోమని కూడా ప్రకటించారు. దీన్ని ప్రజలు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ బల్క్ డ్రగ్ పరిశ్రమను ఆపకపోగా పనులు వేగవంతం చేస్తుంటేప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాకుండా అప్పట్లో తమకు అండగా నిలిచిన అనిత నేడు హోంమంత్రిగా ఉన్నారు. అందుకే ఈ మధ్య కాలంలో ఆమె కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. అధికారంలోకి రాకముందు ఒక మాట చెప్పి ఇప్పుడు విరుద్ధంగా చర్యలు తీసుకోవడం ఏంటని మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు.
నేడు అనుమతులు ఇచ్చి నేడు వ్యతిరేకిస్తున్న వైసీపీ
బల్క్‌డ్రగ్ పార్ట్ వచ్చిందని, రాష్ట్ర దశదిశా మారిపోతుందని అధికారంలో ఉన్నప్పుడు ఎలివేషన్స్ ఇచ్చుకున్న వైసీపీ నేడు ఆందోళనబాటపడుతోంది. తాము అనుమతులు ఇచ్చిన బల్క్‌డ్రగ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఉద్యమం చేపడుతోంది. రాజయ్యపేట గ్రామాన్ని సందర్శించారు ఆ వైసీపీ నేతలు. వారికి అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. తమ హయంలో చాలా ప్రాంతాల్లో ప్రజలను ఒప్పించి ఫ్యాక్టరీలు పెట్టామని ఇక్కడ కూడా అలాంటి ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరం అయితే నక్కపల్లి బల్క్‌డ్రగ్‌కు వ్యతిరేకంగా జగన్ ఆ ప్రాంతాన్ని సందర్శిస్తారని కూడా మాట ఇచ్చారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం ఆగేది లేదని చెబుతున్నారు. నాడు ప్రజలకు హామీ ఇచ్చిన అనిత సూటిగా స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
LIVE: YSRCP Leaders Press Meet - Anakapalle | వైయస్ఆర్ సీపీ నాయకులు ప్రెస్ మీట్ https://t.co/Gp0Se5q75x
— YSR Congress Party (@YSRCParty) October 22, 2025
వైసీపీ, టీడీపీ రాజకీయాల్లో ఇరుక్కున్న ప్రజలు
రెండు పార్టీల రాజకీయం చూసిన ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అధికారం లేనప్పుడు ఒక మాట చెప్పడం అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకు విరుద్ధంగా చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ చేస్తున్నది తప్పు అయితే నాడు అనుమతులు ఇచ్చి వైసీపీ నేతలే నేడు ప్రజల వద్దకు వెళ్లి ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళనలు చేయడం ఏంటని కూడా మరికొందరు మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఎవరు ఎలాంటి రాజకీయం చేసినా తమ సమస్యకు పరిష్కారం కావాలని డిమాండ్ చేస్తున్నారు.





















