Sunday Funday: ఇక చార్మినార్ వద్ద కూడా సండే ఫన్ డే.. స్టాల్ పెడితే లాభాలు! ఇలా అప్లై చేసుకోవచ్చు.. HMDA ప్రకటన
గురువారం ఉదయం చార్మినార్ ప్రాంతాన్ని అర్బన్ డెవలప్‌మెంట్ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నగర కమిషనర్ అంజనీ కుమార్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పరిశీలించారు.
ట్యాంక్ బండ్‌పై ప్రతి ఆదివారం జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న సండే ఫండేకు విపరీతమైన ఆదరణ వస్తున్న సంగతి తెలిసిందే. నగరం నలు మూలల నుంచి జనం వచ్చి హుస్సేన్ సాగర్ ఒడ్డున చల్లటిగాలులకు సేదతీరుతున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో చార్మినార్ వద్ద కూడా ఇలాంటి కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే గురువారం ఉదయం చార్మినార్ ప్రాంతాన్ని అర్బన్ డెవలప్‌మెంట్ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నగర కమిషనర్ అంజనీ కుమార్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పరిశీలించారు. సండే ఫన్ డే ఏర్పాటుపై చర్చించారు. వివిధ కార్యక్రమాల ఏర్పాటుతో పాటు పార్కింగ్ ఏర్పాట్లపై కూడా సమాలోచనలు జరిపారు.
Also Read : నరేష్ తీరుపై టాలీవుడ్ పెద్దలు గుర్రు.. మంచును ముంచుతున్నారా? ‘మా’లో నారదముని ఎవరు?
చార్మినార్ వద్ద కూడా సండే ఫన్‌డే నిర్వహించాలని పాతబస్తీ వాసుల కోరిక మేరకు మంత్రి కేటీఆర్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సూచించినట్లు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇటీవల ఓ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రజలు కూడా సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన ఆ సందర్భంగా కోరారు. నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుండడంతో చార్మినార్ వద్ద కూడా సండే ఫన్‌డే నిర్వహించాలని నిర్ణయించారు.
Also Read: తెలంగాణలో కలిసేందుకు మహారాష్ట్ర, కర్ణాటక సరిహ్దదు ప్రాంతాల ఆసక్తి ! కారణం ఏమిటంటే ?
స్టాల్స్ ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు
ఈ కార్యక్రమానికి జనం నుంచి వస్తున్న ఆదరణ నేపథ్యంలో స్టాల్స్ ఏర్పాటు చేసుకుని వ్యాపారం నిర్వహించుకొనేందుకు ఎందరో ఉత్సాహం చూపుతున్నారు. కాబట్టి స్టాళ్లు ఏర్పాటు చేసుకోవాలనుకునేవారు.. ముఖ్యంగా హస్తకళలు, చేనేత సంబంధిత, తినుబండారాలు తదితర స్టాళ్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవచ్చని హెచ్‌ఎండీఏ ఒక ప్రకటనలో తెలిపింది. స్టాళ్లలో తాము అమ్మే ఉత్పత్తులు, ధరలతోపాటు సంప్రదించాల్సిన వారి వివరాలు వంటివి ea2ps-maud @telangana.gov.in, hcip hmda@gmail.com ఈమెయిల్ చేయాల్సిందిగా సూచించింది, లేదా హెచ్‌ఎండీఏ బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్ కార్యాలయంలో ప్రతి సోమ, మంగళ వారాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.
అయితే, లాటరీ ద్వారా ఎంపిక చేసినవారికి నామమాత్రంగా ఫీజు వసూలు చేస్తామని, వారికి రెండు వారాల పాటు అవకాశం కల్పిస్తామని హెచ్ఎండీఏ ఓ ప్రకటనలో తెలిపింది. అందరికీ సమాన అవకాశం కల్పించేందుకు కేటగిరీల వారీగా లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నట్లు పేర్కొంది. దీంతోపాటు స్థానిక కళాకారులను ప్రోత్సహించేందుకు సంగీతం తదితర కళారూపాలను ప్రదర్శించాలనుకునే వ్యక్తులు, ట్రూపులు కూడా దరఖాస్తు చేసుకోవాలని హెచ్‌ఎండీఏ సూచించింది.
Also Read: రాజేంద్రనగర్ లో దారుణం... ఆటోలో తీసుకెళ్లి మహిళపై సామూహిక అత్యాచారం...!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి