సికింద్రాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం- ఆరుగురు మృతి
Secunderabad Fire Accident : సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. పాట్నీ వద్ద ఉన్న స్వప్నలోక్ కాంప్లెక్స్ లో ఈ మంటలు చెలరేగాయి.
Secunderabad Fire Accident : సికింద్రాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదంలో ఆరుగు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ 7, 8 అంతస్థులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో చాలా మంది చిక్కుకున్నారు. వారిలో ఆరుగురు ఊపిరి ఆడక మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి కొందర్ని రక్షించారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఐదు ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ లో బట్టల షాపులు, గోడౌన్లు ఉన్నాయి. సెల్ ఫోన్ టార్చ్‌లు చూపిస్తూ రక్షించాలని పలువురు వేడుకున్నారు.
ఎగిసిపడినన మంటలు
సికింద్రాబాద్ ప్యాట్నీ వద్ద గల స్వప్న లోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్వప్నలోక్ కాంప్లెక్స్ లోని 7,8 అంతస్థులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టంగా పొగ వ్యాపించడంతో పలువురు ఆఫీసుల్లోంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఈ కాంప్లెక్స్ లో పలు కార్యాలయాలతో పాటు వాణిజ్య సముదాయాలు ఉండడంతో పదుల సంఖ్యలో ఉద్యోగులు చిక్కుకున్నారు. సహాయం కోసం ఫోన్ టార్చ్ చూపిస్తూ ఆర్తనాదాలు చేశారు. మంటల్లో చిక్కుకున్న వారు పొగతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు.
ప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నించారు. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయచర్యలు చేపట్టారు ఫైర్ సిబ్బంది. అయితే అప్పటికే ఆరుగురు చనిపోయినట్టు గుర్తించారు. మంటలు వ్యాపించిన పొగ కారణంగా వాళ్లు ఇబ్బంది పడి మరణించారు.
మరణించినవారిలో నలుగురు మహిళలు ఉన్నారు. శివ, ప్రశాంత్, శ్రావణి, ప్రమీల, వెన్నెల, త్రివేణి, వీళ్లంతా పాతికేళ్లలోపు ఉన్నవాళ్లే. వీళ్ల మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతులంతా ఐదో ఫ్లోర్‌లో ఉన్న ఓ కంపెనీలో పని చేస్తున్నట్టు గుర్తించారు. వాళ్లను అతి కష్టమ్మీద అగ్నిమాపక సిబ్బంది బయటకు తీశారు.
ప్రమాదంపై కలెక్టర్ స్పందించారు. ఆరుగురు చనిపోయినట్టు ధ్రువీకరించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు వెళ్లడించారు. ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించలేదని విచారణలో తేలితే చర్యలు తీసుకుంటామన్నారు.
అగ్నిప్రమాదంతో ఆ బిల్డింగ్‌తోపాటు ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో అసలు ఏం జరుగుతుందో తెలియక ఆ భవనంలో ఉన్న వాళ్లు భయుపడ్డారు. మెట్ల మార్గంలో రాలేకపోయారు. ఆర్తనాదాలు చేశారు. చిమ్మ చీకట్లలో ఎటు వెళ్తున్నారో తెలియక ఇబ్బంది పడ్డారు. ఈ గందరగోళంలోనే ఏడుగురిని అధికారులు కాపాడారు. పది మంది వరకు లోపలే ఉండిపోయారు. అందులో ఆరుగురు మృతి చెందారు. మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఘటనాస్థలాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఆపరేషన్ పూర్తయ్యే వరకు సహాయచర్యలు పర్యవేక్షించారు.