Revanth Reddy Speech: 2024లో అధికారంలోకి కాంగ్రెస్, మేం చేసే మొదటిపని అదే - రేవంత్ రెడ్డి
హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ యువ సంఘర్షణ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి నిరుద్యోగ డిక్లరేషన్ ను ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ 2024 ఏడాదిలో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. మొదటి ఏడాదిలోనే ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ బ్యాక్ లాగ్ పోస్టులను కూడా భర్తీ చేసేలా కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ యువ సంఘర్షణ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి నిరుద్యోగ డిక్లరేషన్ ను ప్రకటించారు.
ప్రియాంక గాంధీని నయా ఇందిరమ్మ అంటూ రేవంత్ రెడ్డి పోల్చారు. ఆనాడు ఇందిరమ్మ మెదక్ నుంచి ఎంపీ అయ్యారని, అప్పుడే బీహెచ్ఈఎల్, ఐడీపీఎల్ లాంటివి ఆమె ఆధ్వర్యంలోనే వచ్చాయని గుర్తు చేశారు. వేల కోట్ల ఆదాయం వాటి ద్వారా వస్తోందని అన్నారు. 1980 లో ఇందిరమ్మ ఇచ్చిన దయతో ఇప్పుడు తెలంగాణ ధనిక రాష్ట్రం అయిందని అన్నారు. ఆ ఇందిరమ్మ మనుమరాలు ప్రియాంక తెలంగాణకు అండగా నిలబడతానని మాట ఇచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు.
ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు కేవలం విశ్వవిద్యాలయాలు మాత్రమే కాదని, అవి ఆత్మ గౌరవ ప్రతీకలు అని అన్నారు. తెలంగాణ పౌరుషానికి అవి వేదికలు, సామాజిక చైతన్యానికి వేదికలు అని అన్నారు. మన రాష్ట్రం - మన కొలువులు అనే నినాదంతో విద్యార్థులు లాఠీలు, తూటాలకు ఎదురొడ్డి, ఆత్మబలిదానాలకు భయపడలేదని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి 5.35 లక్షల ఉద్యోగాలు కేటాయించారని, అందులో లక్షకు పైగా ఖాళీలు ఉన్నాయని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు. కానీ, పేడివిజన్ కమిటీ ఛైర్మన్ గా ఐఏఎస్ అధికారి బిశ్వాల్ నివేదిక ప్రకారం.. 1.9 లక్షల ఖాళీలు ఉన్నట్లు తేల్చారని అన్నారు. అయినా ఇప్పటి వరకూ ఖాళీలు భర్తీ చేయాలేదని విమర్శించారు.
ఆత్మహత్యలు చేసుకుంటున్న యువతకు అండగా నిలబడడానికి ప్రియాంక గాంధీ మనకు అండగా నిలబడడానికి హైదరాబాద్‌కు మొదటిసారి వచ్చారని అన్నారు. వారి నాయకత్వంలో సోనియా అండదండలు, మల్లిఖార్జున్ ఖర్గే ఆదేశాలతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నిరుద్యోగులను ఆదుకునేందుకు హైదరాబాద్ యూత్ డిక్టరేషన్ ను ఇక్కడ ప్రవేశపెడుతున్నామని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ లోని అంశాలు ఇవీ
తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలను ఉద్యమ వీరులుగా గుర్తించి, వారి తల్లి లేదా తండ్రి, లేదా భార్యకు రూ.25 వేల రూపాయల గౌరవ పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారిని స్వాతంత్ర సమరయోధులుగా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందని అన్నారు. ఉద్యమకారులపై పెట్టిన కేసును ఎత్తేయడమే కాకుండా, జూన్ 2న ఉద్యమ కారులకు గుర్తింపు కార్డు ఇస్తామని హామీ ఇచ్చారు.
మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
• మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ.
• ప్రతీ ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి, సెప్టెంబర్ 17 లోపు నియామకాల పూర్తి.
• నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతీ నెలా రూ. 4,000 నిరుద్యోగ భృతి చెల్లింపు.
• ప్రత్యేక చట్టంతో టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో పునరుద్ధరణ.
• కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ను ఏర్పాటు చేసి, 7 జోన్లలో ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ లను, ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను నెలకొల్పడం.
• ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేట్ కంపెనీల్లో తెలంగాణ యువతకు 75% రిజర్వేషన్ కల్పన.
• విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు యూత్ కమిషన్ను ఏర్పాటు చేసి, రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణ సదుపాయ కల్పన.
• ప్రత్యేక గల్ఫ్ విభాగం ఏర్పాటుతో గల్ఫ్ ఏజెంట్ల నియంత్రణ, గల్ఫ్ దేశాల్లో మెరుగైన ఉపాధి కల్పనతో పాటు, గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తగిన చర్యలు.
• ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్ మెంట్‌తో పాటు, పాత బకాయిలు పూర్తిగా చెల్లింపు.
• పాలమూరు, తెలంగాణ, మహాత్మా గాంధీ, శాతవాహన యూనివర్సిటీలను ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలుగా మార్చడంతో పాటు, ఆదిలాబాద్, ఖమ్మం, మరియు మెదక్ లో నూతన ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీల ఏర్పాటు.
• బాసరలోని రాజీవ్ గాంధీ IIIT తరహాలో 4 నూతన IIIT లను ఏర్పాటు చేసి, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం.
• అమెరికాలోని IMG అకాడమీ తరహాలో అన్ని వసతులతో కూడిన ప్రపంచస్థాయి క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి, గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడం.
• పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం వరంగల్, హైదరాబాద్ లో 2 విద్యాలయాలను ఏర్పాటు చేసి, 6వ తరగతి నుండి పట్టభద్రులయ్యేవరకు నాణ్యమైన విద్యను అందించడం.
• 18 సంలు పైబడి, చదువుకొనే ప్రతీ యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ల అందజేత.