Preventing Stroke in Diabetics : మధుమేహంతో స్ట్రోక్ వస్తుందా? మెదడుపై బ్లడ్ షుగర్ ప్రభావం ఎలా ఉంటుందంటే
Diabetes and Stroke : మధుమేహం పక్షవాతం ప్రమాదాన్ని పెంచుతుందట. సరైన అవగాహన లేకున్నా.. ఆరోగ్యకర జీవనశైలితో మార్పులతో తినడానికి మీరు కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి. అవేంటంటే..

Types of Stroke Caused by Diabetes : మధుమేహం లేదా డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక జీవక్రియ రుగ్మత. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడానికి కారణమవుతుంది. మనం తినే ఆహారం గ్లూకోజ్‌గా విచ్ఛిన్నమై.. మనకు శక్తిని అందిస్తుంది. ఆహారం జీర్ణమైన తర్వాత గ్లూకోజ్ రక్తప్రవాహంలోకి ప్రవేశించి.. శరీరం అంతటా కణాలకు చేరుకుంటుందని నరాల వైద్య నిపుణులు డాక్టర్ అమ్లాన్ తపన్ తెలిపారు. దీనిలో ఏమైనా తేడా జరిగితే డయాబెటిక్ స్ట్రోక్ వచ్చే ప్రమాదముందని చెప్తున్నారు.
మధుమేహంతో స్ట్రోక్ వస్తుందా?
గ్లూకోజ్ కణాలలోకి ప్రవేశించి శక్తిని అందించేందుకు ఇన్సులిన్ అనే హార్మోన్ అవసరం. మన శరీరంలోని ఒక అవయవం అయిన ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయనప్పుడు లేదా ఇన్సులిన్ చర్య సరిగ్గా లేనప్పుడు మధుమేహం వస్తుంది. ఇది మూత్రపిండాలు, కళ్లు, గుండెపై ప్రభావం చూపిస్తుంది. ఇది చాలామందికి తెలుసు. అయితే డయాబెటిస్ మెదడుపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుందట. మెదడు రక్త ప్రవాహానికి అంతరాయం కలిగించి.. తీవ్రమైన నరాల పరిస్థితిని కలిగించి.. స్ట్రోక్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందట.
స్ట్రోక్ ప్రమాదం మహిళలకేే ఎక్కువ
మధుమేహం లేని వారితో పోలిస్తే.. మధుమేహం ఉన్నవారికే ఈ తరహా స్ట్రోక్ వచ్చే అవకాశం రెట్టింపు ఉంటుందని అంటున్నారు. మధుమేహంతో కూడిన స్ట్రోక్ ప్రమాదం పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఎక్కువగా ఉంటుందట. ప్రధాన కారణం ఏమిటంటే.. ధమనులలో కొవ్వు పేరుకుపోతుంది. అలాగే మధుమేహం తరచుగా అధిక రక్తపోటు, ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ వంటి ఇతర ప్రమాద కారకాలతో నిండి ఉంటుంది.
మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయి.. మెదడుకు ఆక్సిజన్, పోషకాలు అందకపోవడం వల్ల నిమిషాల్లో మెదడు కణాలు (న్యూరాన్‌లు) చనిపోతాయి. దీంతో బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఇది రక్తనాళంలో గడ్డ ఏర్పడటం (ఇస్కీమిక్ స్ట్రోక్) లేదా రక్తనాళాలు చిరగడం (హెమరేజిక్ స్ట్రోక్) వల్ల వస్తుంది. ప్రతి నిమిషం దీనిలో ఓ లెక్కగా చెప్తారు. స్ట్రోక్ అనేది ఒక అత్యవసరమైన వైద్య పరిస్థితి, సకాలంలో జోక్యం చేసుకోవడం, చికిత్స మరణాలను, వైకల్యాన్ని తగ్గిస్తుంది.
నివారణ చర్యలు
రక్తంలో చక్కెరను కచ్చితంగా నియంత్రించాల్సి ఉంది. ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం (వారానికి కనీసం 150 నిమిషాల వ్యాయామం), సంతృప్త కొవ్వులు, శుద్ధి చేసిన చక్కెరలు తక్కువగా ఉండే సమతుల్య ఆహారం, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ధూమపానం మానేయడం, ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడం వంటివి స్ట్రోక్ రాకుండా చేస్తాయి.
ఇప్పటికే స్ట్రోక్ వచ్చిన వారికి.. మళ్లీ రాకుండా ఉండాలన్నా.. మధుమేహాన్ని కంట్రోల్ చేయడం చాలా అవసరం. కాబట్టి వైద్యులతో మాట్లాడి ఫాలో-అప్ చేసి.. మందులు ఉపయోగించడం మంచిది. రక్తంలో గ్లూకోజ్‌ను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవడం వల్ల స్ట్రోక్ అవకాశాలను తగ్గుతాయని చెప్తున్నారు నిపుణులు.






















