Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News : కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా సిటీ ఏర్పాటు చేయడం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని రేవంత్ తెలిపారు.
Revanth Reddy has clarified that pharma city will not be established in Kodangal | కొడంగల్ లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదని తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే తన ఉద్దేశమని చెప్పారు. కొడంగల్ ఎమ్మెల్యే గా నియోజకవర్గ అభివృద్ధి తన బాధ్యత అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సొంత నియోజకవర్గ ప్రజలను నేనెందుకు ఇబ్బంది పెడతా అన్నారు. కాలుష్యరహిత పరిశ్రమలే ఏర్పాటు చేస్తామని తెలిపారు. భూసేకరణ పరిహారం పెంపు ను పరిశీలిస్తామని చెప్పారు. తనని కలిసిన వామపక్ష పార్టీల ప్రతినిధుల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు. నియోజకవర్గంలోని లగచర్ల ఘటన పైన వామపక్ష నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
కలెక్టర్, పోలీస్ అధికారులపై లగచర్లలో దాడి
ఇటీవల కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులపై రైతులు దాడి చేయడం సంచలనం రేపింది. ఫార్మా సిటీ కోసం తమ భూములు బలవంతంగా లాక్కునే ప్రయత్నం జరుగుతుందని బాధిత రైతులు ఆరోపించారు. ఆ క్రమంలో రైతులతో మాట్లాడేందుకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్, డీఎస్పీ, ఇతర పోలీస్ అధికారులు లగచర్లకు వెళ్లారు. బోగమోని సురేష్ అనే వ్యక్తి రైతులు, కొందరు గ్రామస్తులను గుంపుగా పోగుచేసి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేపించారని పోలీసులు తెలిపారు. సురేష్ పిలిచాడన్న కారణంగానే కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులు లగచర్లకు వెళ్లగా.. వెంటనే అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారి వాహనాలపై పెద్ద పెద్ద రాళ్లతో దాడి చేసి వాహనాల అద్దాలు ధ్వంసం చేయడంతో కలకలం రేగింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో వ్యతిరేకత అంటూ బీఆర్ఎస్ నేతలు దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేశారు.
కుట్రపూరిత దాడిగా ప్రభుత్వం సీరియస్
అధికారులపై కుట్రపూరితంగా దాడి జరిగిందని లగచర్ల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఏ1గా చేర్చగా, ఏ2గా బోగమోని సురేష్ ఉన్నాడు. దాదాపు నరేందర్ రెడ్డిని ఘటన జరిగిన రెండు, మూడు రోజుల్లోనే అరెస్ట్ చేయగా, ఏ2 సురేష్ మాత్రం వారం రోజులపాటు పరారీలో ఉన్నాడు. అతడిపై లుకౌట్ నోటీసులు జారీ అయిన తరువాత కొడంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సురేష్ ను కొడంగల్ కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజులపాటు రిమాండ్ విధించారు.
రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు
లగచర్లలో అధికారులపై దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారని పోలీసులు కేసు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర జరిగిందని అభియోగాలున్నాయి. పట్నం నరేందర్ రెడ్డి సూచనలతోనే సురేష్ రైతులను పురమాయించి దాడికి ప్లాన్ చేశాడని పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసులో మరో వ్యక్తి కీలకంగా మారాడు. పంచాయతీ సెక్రటరీగా చేస్తున్న అతడు రైతులను రెచ్చగొట్టి దాడికి ప్లాన్ చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకూ 26 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. సంగారెడ్డి జైలులో నిందితుల విచారణ జరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సంగారెడ్డి జైలులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఇటీవల కలిశారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, అక్రమ కేసులకు భయపడొద్దని న్యాయ పోరాటం చేద్దామన్నారు.
Also Read: KTR News: కేటీఆర్‌కు బిగ్ షాక్, నాంపల్లి కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలు - కారణం ఇదే