KTR News: కేటీఆర్‌కు బిగ్ షాక్, నాంపల్లి కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలు - కారణం ఇదే
Telangana News | బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌కు భారీ షాక్ తగిలింది. వ్యాపారవేత్త సృజన్ రెడ్డి బీఆర్ఎస్ నేత కేటీఆర్‌పై నాంపల్లి కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు.
Criminal Petition Filed against KTR in Nampally Court | హైదరాబాద్: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై క్రిమినల్ పిటిషన్ దాఖలైంది. వ్యాపారవేత్త సూదిని సృజన్‌రెడ్డి నాంపల్లి స్పెషల్ కోర్ట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌పై క్రిమినల్ పిటిషన్ ఫైల్ చేశారు. అమృత్-2 కాంట్రాక్ట్ టెండర్లపై కేటీఆర్ నిరాధార ఆరోపణలు చేశారంటూ సృజన్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు. శోధ కన్‌స్ట్రక్షన్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా, ఆ సంస్థతో లింక్ చేస్తూ పదే పదే కామెంట్లు చేసి అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అమృత్-2కు పారదర్శకంగానే టెండర్ల కేటాయింపు జరిగినప్పటికీ కేటీఆర్ మాత్రం నిరాధార ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఈ విషయంపై లీగల్ నోటీసులు ఇచ్చినా కేటీఆర్ తీరు మార్చుకోని కారణంగా తాజాగా క్రిమినల్ పిటిషన్ దాఖలు చేసినట్లు వ్యాపారవేత్త సృజన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రికి కేటీఆర్ ఫిర్యాదు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అమృత్ 2 పథకం టెండర్లలో అవకతవకలు జరిగాయని నవంబర్ రెండో వారంలో ఢిల్లీకి వెళ్లి మరీ కేటీఆర్ ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయిన కేటీఆర్, బీఆర్ఎస్ నేతల బృందం సీఎం రేవంత్ రెడ్డి అమృత్ పథకం టెండర్ల వ్యవహారంలో తన కుటుంబ సభ్యులకు లాభం చేకూర్చేలా వ్యవహరించారని ఫిర్యాదు చేశారు. ఎంపీలు కేఆర్ సురేష్ రెడ్డి, దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీలు బాల్క సుమన్, బడుగుల లింగయ్య యాదవ్, మాలోత్ కవిత, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు తదితరులతో కలిసి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. ఆ సందర్భంగా సీఎం రేవంత్ అధికార దుర్వినియోగాన్ని కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు.
రేవంత్ రెడ్డి అధికారం దుర్వినియోగం చేశారని ఆరోపణలు
ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేస్తానని చెబుతూ వచ్చిన కేటీఆర్ అన్నట్లుగానే నవంబర్ 11న ఢిల్లీకి వెళ్లి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిపై పోరాటం చేస్తానన్నారు. గతంలో అమృత్ పథకం టెండర్లలో అవకతవకలు జరిగాయని కేటీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. ఇటీవల నేరుగా ఢిల్లీకి వెళ్లి సాక్ష్యాలు అందజేసి సీఎం రేవంత్ పై కంప్లైంట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన బావమరిది సృజన్ రెడ్డికి లాభం చేకూర్చేలా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కేంద్ర మంత్రి ఖట్టర్ ను నేరుగా కలిసి కేటీఆర్ పలు విషయాలపై ఫిర్యాదు చేశారు.
2 కోట్ల లాభం ఉన్న కంపెనీకి ప్రాజెక్టు పనులా?
అమృత్ 2.0 స్కీం లో భాగంగా కేంద్రం తెలంగాణలో పలు పనులకు దాదాపు రూ. 8,888 కోట్లు ఖర్చు చేస్తోంది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ నేతృత్వంలో ఈ స్కీమ్ పనులు జరగనున్నాయి. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను ఉల్లంఘించి సుజన్ రెడ్డికి చెందిన శోధా కంపెనీకి రూ. 1,137 కోట్ల విలువ చేసే పనులను సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారని కేటీఆర్ తెలిపారు. ఏమాత్రం అనుభవం, అర్హత లేని సంస్థకు ఇంత పెద్ద ఎత్తున పనులను కట్టబెట్టారని ఆరోపించారు. శోధా ఇన్ ఫ్రాక్చర్ లిమిటెడ్ 2021-2022 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.2 కోట్ల 20 లక్షలు లాభాలు చూపింది. అంత చిన్న కంపెనీకి, అనుభం లేని కంపెనీకి రూ. 1,137 కోట్ల ప్రాజెక్టు పనులు ఎలా అప్పగిస్తారని కేంద్రానికి అన్ని వివరాలు కేటీఆర్ సమర్పించారు. మొత్తం పనుల్లో ఇండియన్ హ్యూమ్ పైప్స్ కో. లిమిటెడ్ కంపెనీకి 20 శాతం వర్క్స్, 80 శాతం పనులను శోధా సంస్థకు అగ్రిమెంట్ చేసుకున్నారని కేటీఆర్ అన్నారు.