Revanth Reddy: తెలంగాణలో స్కూళ్లకి ‘చంద్ర’గహణం, ఇప్పటిదాకా పుస్తకాల్లేవు - రేవంత్ రెడ్డి ట్వీట్
Revanth Reddy on Mana Ooru Mana Badi: బుధవారం పలువురు కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్‌లో కొన్ని స్కూళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా పరిస్థితులపై రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
తెలంగాణలో పేద పిల్లల చదువుకు చంద్ర గ్రహణం పట్టిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో టెక్ట్స్ బుక్స్, ఉపాధ్యాయులు లేక స్కూళ్లన్నీ వెలవెలబోతున్నాయని ఆరోపించారు. బుధవారం పలువురు కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్‌లో కొన్ని స్కూళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లలకు పాఠ్య పుస్తకాలు ఇవ్వలేదని, కనీసం ఉపాధ్యాయులు కూడా స్కూ్ళ్లలో లేని పరిస్థితి నెలకొని ఉందని వారు మీడియాతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల జూన్ 13న స్కూళ్లు మొదలైతే, నెల రోజులు గడుస్తున్నా పిల్లలకు టెక్ట్స్ బుక్స్ ఇవ్వలేదని విమర్శించారు. ఈ వీడియోను రేవంత్ రెడ్డి ట్వీట్ చేస్తూ ప్రభుత్వ తీరును నిలదీశారు.
‘‘తెలంగాణలో పేద పిల్లల చదువులకు ‘చంద్ర’గ్రహణం పట్టింది. ఉపాధ్యాయులు లేక, పాఠ్యపుస్తకాలు లేక పాఠశాలలు వెలవెలబోతున్నాయి. ‘మన ఊరు - మన బడి’ ఓ ప్రచార ఆర్భాటం. ప్రశ్నించకపోతే తెలంగాణ అజ్ఞానాంధకారంలోకి వెళ్లడం ఖాయం.’’ అంటూ ట్వీట్ చేశారు. ఇందుకు కేసీఆర్ ఫెయిల్డ్ తెలంగాణ, బై బై కేసీఆర్ అనే హ్యాష్ ట్యాగ్స్ ను వాడారు.
తెలంగాణలో పేద పిల్లల చదువులకు ‘చంద్ర’గ్రహణం పట్టింది.
— Revanth Reddy (@revanth_anumula) July 13, 2022
ఉపాధ్యాయులు లేక, పాఠ్యపుస్తకాలు లేక పాఠశాలలు వెలవెలబోతున్నాయి.
‘మన ఊరు - మన బడి’ ఓ ప్రచారార్భాటం.
ప్రశ్నించకపోతే తెలంగాణ అజ్ఞానాంధకారంలోకి వెళ్లడం ఖాయం.#KCRFailedTelangana #ByeByeKCR pic.twitter.com/T4JDT9gMbp
కాంగ్రెస్ నేతలు ఆ వీడియోలో మాట్లాడుతూ.. డీఎస్సీ సంగతి ఏమైందని నిలదీశారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే లక్ష్యాలతో తెలంగాణ తెచ్చుకుంటే ముఖ్యమంత్రి డీఎస్సీ వేయడం మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఛలో ప్రగతి భవన్‌కు గానీ, ఛలో ఫాం హౌస్‌కు పిలుపునివ్వడం లేదని, కేసీఆర్ ఆస్తి రాసిమ్మని అడగడం లేదని అన్నారు. కేవలం పిల్లలకు ఈ విద్యా సంవత్సరం ఇవ్వాల్సిన పాఠ్య పుస్తకాలు, బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నామని డిమాండ్ చేశారు.