R Narayana Murthy: ఆర్. నారాయణమూర్తికి అస్వస్థత - ఆస్పత్రికి తరలింపు
R Narayana Murthy News: ఉదయం నారాయణమూర్తి ఓ ప్రెస్ మీట్ కు హాజరు కాగా.. అక్కడ ఏమీ మాట్లాడలేకపోయారు. చాలా నీరసంగా ఉందని.. కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు.
R Narayana Murthy Hospitalised: సినీరంగంలో పీపుల్ స్టార్ గా పేరొందిన దర్శక నటుడు, నిర్మాత ఆర్ నారాయణ మూర్తి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. డాక్టర్ బీరప్ప ఆధ్వర్యంలో ఆర్ నారాయణమూర్తికి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయగా.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు స్పష్టం చేశారు.
బుధవారం (జూలై 17) ఉదయం ప్రసాద్ ల్యాబ్స్ లో ఆర్ నారాయణమూర్తి ఓ ప్రెస్ మీట్ కు హాజరయ్యారు. ఆ ప్రెస్ మీట్‌లో నారాయణమూర్తి ఏమీ మాట్లాడలేకపోయారు. తనకు చాలా నీరసంగా ఉందని.. కళ్లు తిరుగుతున్నాయని నారాయణమూర్తి చెప్పారు. దీంతో ఆయన పక్కనే ఉన్నవారు నారాయణమూర్తిని వెంటనే నిమ్స్ ఆస్పత్రికి తీసుకొని వెళ్లారు. నారాయణమూర్తికి 2 నెలల క్రితమే గుండెకు బైపాస్ సర్జరీ జరిగింది. గుండె నాళాల్లో బ్లాకులు ఉండటంతో బైపాస్ సర్జరీ చేశారు. అప్పటి నుంచి గతంతో పోల్చితే కాస్త మెత్తగానే ఉంటున్నారు.
నేను బాగానే ఉన్నా - ఆర్ నారాయణ మూర్తి
ఆర్ నారాయణ మూర్తి ఆరోగ్యం బాగాలేదని సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరగడంతో స్వయంగా ఆయనే స్పందించారు. తన ఆరోగ్యం విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని తర్వాత ఆర్ నారాయణమూర్తి ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడు తాను సురక్షితంగా ఉన్నానని చెప్పారు. పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు తనకు చికిత్స అందిస్తున్నారని.. దేవుడి దయవల్ల తాను కోలుకుంటున్నట్టు చెప్పారు. పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయిన తర్వాత అన్ని వివరాలు చెప్తానని నారాయణ మూర్తి చెప్పారు.