Priyanka Gandhi: నిజాయతీగా మాట్లాడుతున్నా, మేం తప్పు చేస్తే మమ్మల్నీ తొలగించండి - ప్రియాంక
హైదరాబాద్ సరూర్ నగర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ యువ సంఘర్షణ సభలో పాల్గొని ప్రియాంక గాంధీ ప్రసంగించారు.
తెలంగాణలో ప్రతి వ్యక్తిపై వేల కోట్ల రూపాయల అప్పు ఉందని, రాష్ట్ర డబ్బు, సంపద అంతా ఎక్కడికి పోయిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. తెలంగాణలో కొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయని, ప్రభుత్వాన్ని ఎన్నుకునేటప్పుడు అప్రమత్తతో ఉండాలని సూచించారు. లేదంటే ప్రజలే నష్టపోతారని చెప్పారు. గడిచిన రెండు వారాలుగా తాను కర్ణాటకలో ప్రచారంలో పాల్గొన్నానని అన్నారు. హైదరాబాద్ సరూర్ నగర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ యువ సంఘర్షణ సభలో పాల్గొని ప్రసంగించారు.
‘‘ఈ రాష్ట్రం వాళ్ల జాగీరు అనుకుంటున్నారు. జాగీర్దార్లు అనుకుంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఏ ప్రభుత్వం వచ్చినా మంచి జరుగుతుందని అందరూ నమ్మారు. ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగం ఇస్తానని అప్పట్లో కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? టీఎస్పీఎస్సీ పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయి. వారిపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? గత 9 ఏళ్లలో 12 రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఒక్క ఖాళీని కూడా భర్తీ చేయలేదు. ఒక్క ప్రభుత్వ వర్సిటీలో కూడా ఉద్యోగ నియామకాలు జరగలేదు.’’ అని ప్రియాంక అన్నారు.
జై బోలో తెలంగాణ అంటూ ప్రసంగం ప్రారంభం
జై బోలో తెలంగాణ అంటూ ప్రియాంక గాంధీ ప్రసంగం ప్రారంభించారు. తెలంగాణ అంటే ఒక భూమి ముక్క కాదు. మీరు తెలంగాణను తల్లితో సమానంగా చూస్తారు. ఇది అత్యంత పవిత్రమైన అంశం. తెలంగాణ అమరవీరులు తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. యువత ఆశలను నెరవేర్చడానికి తెలంగాణ ఏర్పాటు అయింది. నీరు, నిధులు, నియామకాల కోసం ఉద్యమించారు. రాష్ట్రంలో యువత త్యాగాలు చేసి తెలంగాణ సాధించుకున్నారు.
నిరుద్యోగ భృతి ఇస్తున్నారా?
బీఆర్ఎస్ ప్రభుత్వం యువకులకు 3 వేల భృతి ఇస్తాం అన్నారు. ఇచ్చారా? 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగాల భర్తీ లేదు.. భృతి లేదు. చాలా హామీలు ఇచ్చారు. ఒక్కటి నెరవేరలేదు. తక్కువ మంది పాఠశాలలో చేరుతున్నారు. పాఠశాలలో సౌకర్యాలు లేవు. తెలంగాణ మీది. మీ త్యాగాల వల్ల వచ్చింది.. తెలంగాణను బాగు చేస్కోవడం మీమీద ఎక్కువ బాధ్యత ఉంది. మీరు చైతన్యంతో ఉండి పని చేయాలి.. లేకపోతే నష్టపోయేది యువతనే.