జులై 12న తెలంగాణకు రానున్న మోదీ- హైదరాబాద్‌లో రోడ్ షోతోపాటు బహిరంగ సభ
మహా జన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటిస్తారు. ఆయన మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించే రోడ్‌షో నిర్వహించబోతున్నారని సమాచారం.
తెలంగాణలో నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ విజయం కోసం ఎప్పుడో ప్లాన్స్ అమలు చేస్తున్నాయి. వాటిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ అధినాయకత్వం తెలంగాణపై మరింత ఫోకస్ పెట్టింది. ఇప్పటికే రాష్ట్రనాయకులను ఢిల్లీ పిలిచి మాట్లాడింది. ఇప్పుడు అగ్రనేతలు ఒక్కొక్కరుగా తెలంగాణలో పర్యటించబోతున్నారు. అందులో భాగంగా జులై 12 ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాబోతున్నారు.
మల్కాజ్‌గిరిలో రోడ్‌షో!
మహా జన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటిస్తారు. ఆయన మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించే రోడ్‌షో నిర్వహించబోతున్నారని సమాచారం. కర్ణాటక తరహాలోనే హైదరాబాద్ లో కూడా ప్రధాని మోదీ రోడ్ షో ఏర్పాట్లు చేస్తున్నట్లుగా బీజేపీ వర్గాలు తెలిపాయి. మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలో మోదీ రోడ్ షోతో పాటు సికింద్రాబాద్ లేదా హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో భారీ బహిరంగ సభ ఉంటుందని చెబుతున్నారు.
శ్రేణుల్లో ఉత్సాహం కోసం
కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ శ్రేణులు కాస్త మెత్తబడ్డారు. వారిలో జోష్ నింపడంతోపాటు కొన్నిరోజులు వస్తున్న విమర్శలకు పుల్‌స్టాప్ పెట్టేందుకు ఈ టూర్ ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తోంది. అదే టైంలో నేతల మధ్య ఉన్న విభేదాలు తొలగించేందుకు కూడా స్కోప్ ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజల్లోకి వెళ్లారు. మొన్నటికి మొన్న ఇంటింటికీ బీజేపీ పేరుతో నేతలంతా ప్రతి ఇంటినీ టచ్ చేస్తూ 9 ఏళ్లలో దేశానికి, రాష్ట్రానికి బీజేపీ చేసిన అభివృద్ధి వివరిస్తున్నారు. పనిలోపనిగా తాము అధికారంలోకి వస్తే ఎలాంటి పాలన అందిస్తామో కూడా వివరిస్తున్నారు.
అగ్రనేతల వరుస పర్యటనలు
బీజేపీ కార్యక్రమాలను మరింత చురుగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇప్పుడు అగ్రనేతలు తరచూ తెలంగాణలో పర్యటించాలని భావిస్తున్నారు. ఈ నెలలోనే అమిత్‌షా పర్యటించాల్సి ఉంది. కానీ గుజరాత్‌లో వచ్చిన బిపర్‌జాయ్ తుపాను కారణంగా ఆ టూర్ రద్దైంది. మొన్నటికి మొన్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించారు. ఇప్పుడు మోదీ వచ్చే నెల 12న రాబోతున్నారు. త్వరలోనే అమిత్‌షా కూడా పర్యటిస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఉంటుందని కూడా అంటున్నారు.
కేసీఆర్ ఫ్యామిలీపై మోదీ విమర్శలు
మంగళవారం మధ్యప్రదేశ్‌లో పర్యటించిన ప్రధానమంత్రి మోదీ.. అక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజలకు మంచి జరగాలంటే బీజేపీకి ఓటు వేయాలని... కవితకు మంచి జరగాలంటే బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని విమర్శించారు. ఇప్పుడు నేరుగా తెలంగాణ గడ్డపై ఎలాంటి విమర్శలు చేస్తారనే ఆసక్తి నెలకొంది.
నడ్డా విమర్శలు
మొన్నీ మధ్య తెలంగాణ పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ అభివృద్ధి కోసం నిధులు ఇచ్చి సహకరించామని తెలిపారు. తెలంగాణ సాధన కోసం ఎంతో మంది బలిదానాలు చేశారు కానీ ఒక్క కేసీఆర్ కుటుంబమే లబ్ది పొందిందని ఆరోపించారు. కేసీఆర్ పాలనతో తెలంగాణ సామర్థ్యం నాశనం అయిందంటూ మండిపడ్డారు. తెలంగాణ సాధన కోసం బలిదానం చేసిన వారిని స్మరించుకున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. బీఆర్ఎస్ నేతల జేబులు నింపుతున్న ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని సంచలన ప్రకటన చేశారు.