(Source: Poll of Polls)
V Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసు నమోదు చేయండి - కోర్టు ఆదేశాలు
వి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి, తన అఫిడవిట్ ను ట్యాంపరింగ్ చేశారని రాఘవేందర్ రాజు ఈ పిటిషన్ లో పేర్కొన్నారు.
తెలంగాణ మంత్రి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే వి శ్రీనివాస్ గౌడ్‌పైన కేసు నమోదు చేయాలని నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు పోలీసులను ఆదేశించింది. ఆయనకు వ్యతిరేకంగా రాఘవేందర్ రాజు అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. వి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి, తన అఫిడవిట్ ను ట్యాంపరింగ్ చేశారని రాఘవేందర్ రాజు ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలోనే మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. మంత్రితోపాటు నలుగురు ఐఏఎస్ అధికారులపైన కూడా కేసులు నమోదు చేయాలని తెలిపింది. వీరిలో ఎన్నికల కమిషన్ కు సంబంధించి రాష్ట్ర, కేంద్ర అధికారులు కూడా ఉన్నారు.
అయితే, రాఘవేందర్ రాజు దాఖలు చేసిన పిటిషన్ ని కొట్టి వేయాలని కోరుతూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గతంలో హైకోర్టును, ఏకంగా సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే, నాంపల్లి కోర్టులో ఉన్న ఆ కేసు పూర్వాపరాలు తెలియకుండా, పిటిషన్ ను పరిశీలించకుండా తాము ఏ నిర్ణయమూ తీసుకోలేమని సుప్రీంకోర్టు అప్పుడు స్పష్టం చేసింది.
నిన్న మహబూబ్ నగర్‌లో సమీక్ష
నిన్న మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్ సమీకృత జిల్లా అధికారుల భవన సముదాయంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని మంత్రి నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీలపై ఎలాంటి దుర్ఘటనలు జరిగినా కాపాడటానికి ప్రభుత్వం ముందు ఉంటుందని అన్నారు. వారు ఆర్థికంగా డెవలప్ అయ్యేందుకు దళిత బంధును కచ్చితంగా అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు.
ఓసీలు, బీసీలలో కూడా వెనుకబడినవారు ఉన్నారని, వారికి కూడా సహాయం చేసేందుకు ప్రభుత్వం విధిగా పథకాలను ప్రవేశపెడుతుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన కేసులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. దానికి సంబంధించి నష్ట పరిహారాన్ని ఆలస్యం చేయకుండా మంజూరు చేయాలని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. ‘‘దళిత బహుజనులకు బహుమతిగా ప్రపంచంలోనే ఎత్తయిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సచివాలయానికి కూడా అంబేడ్కర్ పేరు పెట్టుకున్నాం’’ అని అన్నారు.
కలెక్టర్ రవి నాయక్ మాట్లాడుతూ.. జనవరి నుంచి జూన్ వరకు కేసులకు సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వడం, పరిహారం, బెనిఫిట్స్ తదితర అంశాలను వివరించారు. ఎస్పీ నర్సింహులు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కేసులను త్వరితగతిన విచారణ చేసి పరిష్కరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు.. అడిషనల్ ఎస్పీ రాములు, అదనపు కలెక్టర్ ఎస్. మోహన్ రావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ పాండు, డీఆర్‌డీవో అనిల్ కుమార్, డీటీవో ఛత్రు నాయక్, ఎస్సీ, ఎస్టీ జిల్లా విజిలెన్స్ పర్యవేక్షన సభ్యులు బాలయ్య, బాలరాజు, కావలి కృష్ణ, అధికారులు పాల్గొన్నారు.