(Source: Poll of Polls)
DAV School Rape Case: డీఏవీ స్కూల్ రేప్ ఘటనలో తీర్పు వెల్లడి - దోషికి 20 ఏళ్ల జైలు శిక్ష, ఆమె నిర్దోషి
గతేడాది అక్టోబర్ 17న బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ ప్రిన్సిపాల్, డ్రైవర్‌పై చిన్నారి తల్లిదండ్రులు కేసు పెట్టారు. దీంతో అక్టోబర్ 19న రజనీ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్ లో గతేడాది ఓ డ్రైవర్ అదే స్కూలులో చదువుతున్న బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో కోర్టు తీర్పు ఇచ్చింది. నిందితుడిని దోషిగా గుర్తించిన నాంపల్లి కోర్టు, అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆరు నెలల దర్యాప్తు, కోర్టు విచారణ తర్వాత డ్రైవర్ రజనీ కుమార్‌కు ఈ శిక్ష పడింది. ఇతను ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి చేసిన సంగతి తెలిసిందే. గతేడాది అక్టోబర్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలికపై రజనీ కుమార్ పలుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలి తల్లిదండ్రులు వాపోయారు. పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు ఈ విషయంపై ప్రశ్నించగా, డీఏవీ స్కూల్ ప్రిన్సిపాల్ మాధవి తన డ్రైవర్ కాపాడేందుకు అనేక సార్లు ప్రయత్నించింది.
ఈ క్రమంలో గతేడాది అక్టోబర్ 17న బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ ప్రిన్సిపాల్, డ్రైవర్‌పై చిన్నారి తల్లిదండ్రులు కేసు పెట్టారు. దీంతో అక్టోబర్ 19న రజనీ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడికి సంబంధించి సాక్ష్యాధారాలను బంజారాహిల్స్ పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఈ రోజు తీర్పు వచ్చింది. డ్రైవర్ రజనీకుమార్‌కు దాదాపు 20 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడింది. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ మాధవిని మాత్రం నాంపల్లి కోర్టు నిర్దోషిగా తేల్చింది.