MLA Sayanna Passed Away: కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన బీఆర్ఎస్ నేత
Cantonment MLA Sayanna No More: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న కన్నుమూశారు. యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Cantonment MLA Sayanna Death News: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న కన్నుమూశారు. యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఆయన ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ నెల 16న గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కానీ పరిస్థితి విషమించడం, వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా నిధుల కొరతతో పాటు పార్టీ అంతర్గత విషయాల పట్ల ఎమ్మెల్యే సాయన్న కలత చెందుతున్నారని సమాచారం.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న 1951 మార్చి 5న సాయన్న, భూదేవి దంపతులకు హైదరాబాదులోని చిక్కడపల్లిలో జన్మించాడు. 1981లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ (బిఎస్సీ), 1984లో ఎల్.ఎల్.బి. పూర్తిచేశారు. సాయన్నకు గీతతో వివాహం జరిగింది. వీరికి సంతానం ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 16న షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పడిపోవడం, కార్డియాక్ అరెస్ట్ కావడంతో కుటుంబసభ్యులు సాయన్నను యశోదా ఆసుపత్రిలో చేర్పించారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఆదివారం మధ్యాహ్నం సీనియర్ నేత సాయన్న కన్నుమూశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల పార్టీ నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఎమ్మెల్యే సాయన్న పొలిటికల్ కెరీర్..
కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1994 నుండి 2009 వరకు వరుసగా మూడుసార్లు తెలుగుదేశం పార్టీ తరఫున సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నగరంలో టీడీపీకి పట్టున్న నియోజకవర్గంగా మారిందంటే ఎమ్మెల్యే సాయన్న పరిపాలన, మంచితనమే కారణమని చెబుతుంటారు. కానీ అనూహ్యంగా 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమిచెందారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి సమీప అభ్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (ప్రస్తుత బీఆర్ఎస్) గజ్జెల నగేష్ పై 3275 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా అది ఆయనకు నాలుగో విజయం. మరుసటి ఏడాది 2015లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యుడిగా నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో కేసీఆర్ పాలన వైపు మొగ్గు చూపుతూ అధికార టిఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి సమీప అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నేత సర్వే సత్యనారాయణపై 37,568 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నాలుగు పర్యాయాలు టీడీపీ నుంచి, ఒకసారి టీఆర్ఎస్ నుంచి విజయాలు అందుకున్న ఎమ్మెల్యే సాయన్న కేవలం ఒక ఎన్నికల్లో ఓటమి చెందారు.
రాజకీయాల్లో విజయవంతమైన నేతలు పేరు గాంచిన ఎమ్మెల్యే సాయన్న ఆరుసార్లు హుడా (హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) డైరెక్టర్ గా సేవలు అందించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వీధి బాలల పునరావాసంపై హౌస్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు.