Minister Talasani: పాతబస్తీలో బోనాలకు భారీగా ఏర్పాట్లు - ఓల్డ్ సిటీలోని ఆలయాలకు జులై 10న ఆర్ధిక సాయం
Minister Talasani: హైదరాబాద్ పాతబస్తీలో జులై 16న జరగబోయే బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి. ఓల్డ్ సిటీలోని ఆలయాలకు జులై 10న ఆర్ధిక సాయం అందించబోతున్నట్లు మంత్రి తలసాని తెలిపారు.
Minister Talasani: జులై 16వ తేదీన హైదరాబాద్ పాతబస్తీలో జరగనున్న బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈక్రమంలో బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సాలర్జంగ్ మ్యూజియంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ.. ప్రజలు గొప్పగా పండుగలు జరుపుకోవాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను సీఎం కేసీఆర్ రాష్ట్ర పండుగగా ప్రకటించారని గుర్తు చేశారు.
బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. వివిధ దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ప్రైవేటు దేవాలయాలకు కూడా ఆర్ధిక సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని చెప్పుకొచ్చారు. ఓల్డ్ సిటీ లోని ఆలయాలకు జులై 10వ తేదీన ఆర్ధిక సహాయం పంపిణీ చేస్తామని అన్నారు.
హైదరాబాద్ లో జూన్ 22వ తేదీ నుంచి ఆషాఢ మాసం బోనాల పండుగ మొదలైంది. గోల్కొండ కోటలోని ఎల్లమ్మకు తొలి బోనం తీయడంతో నెల రోజుల పాటు బోనాల జాతర సాగుతోంది. జూన్ 22వ తేదీ గోల్కొండలో ఆషాఢ బోనాలు ప్రారంభం కాగా.. జూలై 9వ తేదీన సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, ఆ తర్వాతి రోజు అంటే జూలై 10వ తేదీన రంగం ఉంటుంది. ఇక 16వ తేదీన ఓల్డ్ సిటీ బోనాలు, 17వ తేదీన ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
బోనాల విశిష్టత చాటేలా...
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బోనాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ సంస్కృతిలో బోనానికి ప్రత్యేక స్థానం ఉంది. దేవతలను పూజించేందుకు బోనం ఎత్తే సాంప్రదాయం యావత్ తెలంగాణ అంతటా ఉంది. బోనాలను మహంకాళి బోనాలు, ఎల్లమ్మ బోనాలు, పోచమ్మ బోనాలు ఇలా రకరకాల దేవతల పేరిట నిర్వహిస్తుంటారు. అదే తరహాలో హైదరాబాద్‌లో లష్కర్ బోనాలు ఏటా జరుగుతుంటాయి. ఈ బోనాల సమయంలో అంగరంగ వైభవంగా బోనాల జాతర జరుగుతుంది.
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి మొదలు అవుతుంది. బోనమెత్తే మహిళలు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల నృత్యాలతో బోనాల జాతర కన్నుల పండుగగా సాగుతుంది. గత ఏడాది ఉజ్జయిని మహాంకాళి బోనాలు జూలై 17వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబం మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంది. ఈ సందర్భంగా తలసాని కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. రాజకీయాలకు అతీతంగా బోనాల పండగ వైభవంగా జరగనుందని అన్నారు. ప్రజలంతా బోనాల పండుగలో పాలు పంచుకోవాలని, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని అన్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial