Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Telangana News: తెలంగాణలో తొలి రోజు గ్రూప్ 3 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. యువతతో పాటు చిన్నారుల తల్లులు, గర్భిణీలు పరీక్షలకు హాజరయ్యారు. ఈ క్రమంలో పరీక్షా కేంద్రాల వద్ద కొన్ని దృశ్యాలు వైరల్‌గా మారాయి.
Husband Take Care Of His Child In Group 3 Exam Center In Karimnagar: తెలంగాణలో గ్రూప్ 3 పరీక్ష తొలి రోజు ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకూ పేపర్ - 2 పరీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో గంట ముందు నుంచే పరీక్షా కేంద్రాల వద్ద సందడి నెలకొంది. కొన్ని చోట్ల ఆలస్యంగా వచ్చిన వారిని పరీక్షా కేంద్రాల్లోకి అధికారులు అనుమతించలేదు. కొన్ని పరీక్షా కేంద్రాల్లో కొందరు వివాహితలు వారి పిల్లలతో సహా పరీక్షలకు హాజరయ్యారు. ఈ సమయంలో వారితో పాటు వచ్చిన బంధువులు వారిని చూసుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.
'కన్నా.. నిద్రపో'
ఓ పరీక్షా కేంద్రం వద్ద తన భార్య పరీక్ష రాస్తుండగా.. 10 నెలల చిన్నారిని భర్త లాలించి నిద్రపుచ్చడం వైరల్‌గా మారింది. కరీంనగర్‌లోని స్థానిక సిద్దార్థ పాఠశాలలో స్వప్న అనే వివాహిత పరీక్ష రాసేందుకు వెళ్లింది. ఆ సమయంలో తమ 10 నెలల చిన్నారిని భర్త శంకర్ చేతికి అప్పగించింది. ఈ క్రమంలో దగ్గర్లో ఉన్న షాపు వద్ద చిన్న గద్దెపై కూర్చుని తమ బాబుకి జోకొట్టి నిద్రపుచ్చుతూ శంకర్ కనిపించారు. దాదాపు 3 గంటలు బాబును ఆడిస్తూ కనిపించారు. పరీక్ష పూర్తయ్యే వరకూ చిన్నారిని తిప్పుతూ ఆడించాడు. ఈ దృశ్యాలు వైరల్ కాగా.. మహిళల కెరీర్‌లో ఎదుగుదల కోసం భర్త పాత్ర ఎంతో ముఖ్యమని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
అటు, కోరుట్లలోని అరుణోదయ డిగ్రీ కాలేజీలో రీనా అనే 9 నెలల గర్భిణీ తన భర్త కొమురోజు సాయంతో గ్రూప్ 3 పరీక్షకు హాజరయ్యారు. ప్రస్తుతం ఆమె కథలాపూర్ మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఆమె భర్త దగ్గరుండీ అన్ని సపర్యలు చేశారు.
నిమిషం ఆలస్యమైనా..
మరోవైపు, కొన్ని పరీక్షా కేంద్రాల వద్ద నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అధికారులు అనుమతించలేదు. ములుగులోని బ్రిలియంట్ స్కూల్లో ఇద్దరు అభ్యర్థులు నిమిషం ఆలస్యంగా రావడంతో పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. దీంతో వారు కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాగే, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఓ అభ్యర్థి ఆలస్యంగా రావడంతో అధికారులు పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. ఈ క్రమంలో సదరు అభ్యర్థి కోపంతో హాల్‌టికెట్‌ను చించేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
పోలీసుల సాయం
కొన్ని చోట్ల కొందరు అభ్యర్థులు పరీక్షా కేంద్రాల విషయంలో గందరగోళానికి గురయ్యారు. మేడ్చల్ జిల్లాలోని జీడిమెట్లలో గౌతమి కాలేజీకి ఓ అభ్యర్థిని పొరపాటున వచ్చారు. ఆమె ఎగ్జామ్ సెంటర్ బాలానగర్‌లోని గీతాంజలి కాలేజీ అని తెలుసుకుని ఆందోళనకు గురి కాగా జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ తమ వాహనంలో తీసుకెళ్లి సకాలంలో పరీక్ష కేంద్రానికి చేర్చారు. దీంతో ఆమె పోలీస్ అధికారికి కృతజ్ఞతలు తెలిపారు. మరో చోట రహదారిపై ఉన్న దివ్యాంగుడిని పోలీసులు తమ వాహనంలో పరీక్షా కేంద్రానికి చేర్చారు.