(Source: ECI/ABP News/ABP Majha)
KTR Hyderabad Tour: హైదరాబాద్‌లో పుట్ పాత్‌లు, జంక్షన్ల అభివృద్ధిపై ఫోకస్ చేయండి: అధికారులకు కేటీఆర్ ఆదేశాలు
KTR Hyderabad Tour: ఈరోజు రాష్ట్ర మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. నగరంలో జరగనున్న ఫార్ములా-ఈ నిర్వహణను సైతం మంత్రి కేటీఆర్ సమీక్షించారు.
KTR Hyderabad Tour: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు (కేటీఆర్) హైదారాబాద్ లో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పురపాలక శాఖ ఉన్నత అధికారులతో చేపట్టిన ఈ సమీక్ష అమీర్ పేటలోని హెచ్ఎండీఏ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా వివిధ పురపాలక విభాగాల ఆధ్వర్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న రోడ్డు నిర్వహణ మరియు నిర్మాణాల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం మరియు సీఆర్ఎంపీ కార్యక్రమాల్లో భాగంగా కొనసాగుతున్న కార్యక్రమాల పైన అధికారులు మంత్రికి వివరాలు అందించారు.
హైదరాబాద్ నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులపై జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, పురపాలక శాఖ అధికారులతో మంత్రి @KTRTRS సమీక్ష నిర్వహించారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం మరియు సమగ్ర రహదారుల నిర్వహణ కార్యక్రమం కింద నగరంలో కొనసాగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. pic.twitter.com/GJNIUtFE4j
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 6, 2022
ఫుట్ పాత్ లు, జంక్షన్ల అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టాలి..
సీఆర్ఎంపీ కార్యక్రమం ద్వారా నిరంతరం నగరంలోని ప్రధాన రహదారుల నిర్వహణ కొనసాగిస్తున్నందున, వాటి ఫలితాలు ప్రజలకు అందుతున్నాయని అన్నారు. రోడ్డు నిర్వహణతో పాటు రోడ్డుకు అనుబంధంగా ఉన్న పుట్ పాత్, జంక్షన్ల అభివృద్ధి, నిర్వహణ వంటి అంశాల పైన మరింత దృష్టి సారించాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే దేశంలో వివిధ నగరాల్లో మాడల్(అదర్శ) రోడ్డు నిర్వహణ కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని జనాగ్రహ వంటి సంస్థల ఆధ్వర్యంలో జంక్షన్ల సుందరీకరణ, అభివృద్ధి వంటి కార్యక్రమాలను చేపట్టామని, ఆయా కార్యక్రమాలు త్వరలోనే పూర్తవుతాయని అధికారులు మంత్రి కేటీఆర్ కి తెలియజేశారు. నగరంలో చేపట్టిన లింకు రోడ్ల నిర్మాణం సత్ఫలితాలను ఇస్తుందన్నారు. మరిన్ని లింక్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి అవసరమైన కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఈ సమీక్ష సమావేశంలో కేటిఆర్, జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు.
ప్రజల్లోకి తీసుకెళ్లాలి..
వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన పనులు దాదాపుగా పూర్తి అయ్యాయని అధికారులు తెలిపారు. ఈసారి భారీగా వర్షాలు కురిసినా, పలు ప్రాంతాలు గతంలో మాదిరి నీట మునిగిపోకుండా వ్యూహాత్మక అభివృద్ధి కార్యక్రమం ఎంతగానో సహాయ పడిన విషయాన్ని మంత్రి కేటీఆర్ కి అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో పనుల పురోగతిని, పూర్తయిన నాలాల నిర్మాణానికి సంబంధించి వివరాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని కేటీఆర్ అధికారులను కోరారు.
ఫార్ములా ఈ రేసుని విజయవంతంగా పూర్తి చేస్తాం..
హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఫార్ములా ఈ రేసుకి సంబంధించిన దానిపై కూడా మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫార్ములా ఈ కోసం అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ఫార్ములా నిర్వాహకులతో పాటు, పురపాలకశాఖ హెచ్ఎండీఏ అధికారులు సమన్వయంతో ముందుకుపోతున్నారని, ఫార్ములా ఈ రేసుని, విజయవంతంగా పూర్తి చేస్తామన్న విశ్వాసాన్ని అధికారులు వ్యక్తం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ మరియు ఇతర పురపాలక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.