KTR: 21 రోజుల్లో పర్మిషన్ ఇచ్చేయాల్సిందే, తేడా వస్తే కఠిన చర్యలు - కేటీఆర్
KTR: పట్టణ ప్రగతి పురస్కారాలు అందుకున్న పురపాలికల్లోని ప్రజాప్రతినిధులకు, పురపాలక సిబ్బందికి మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.
Minister KTR: ప్రభుత్వంలో ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్న విభాగాల్లో పురపాలక శాఖ ఒకటి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. సంవత్సరం పొడవునా ప్రతి రోజూ పని చేసినా, ప్రజల నుంచి ప్రత్యేకంగా ప్రశంసలు రావని, ఏదో ఒక కారణం వల్ల పురపాలక శాఖలో పని ఆగిపోతే ప్రజల నుంచి విమర్శలు ఎదురవుతాయని అన్నారు. అందుకే ఈ శాఖలో ప్రజల కోసం పనిచేస్తున్న సమర్థవంతమైన అధికారులను, పురపాలక శాఖ తరఫున అభినందించేందుకు పట్టణ ప్రగతి పురస్కారాలను ఏర్పాటు చేశామని వివరించారు. పట్టణ ప్రగతి పురస్కారాలు అందుకున్న పురపాలికల్లోని ప్రజాప్రతినిధులకు, పురపాలక సిబ్బందికి మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చెందుతున్న అర్బన్ రాష్ట్రంగా చెప్పవచ్చు. ఇప్పటికే సుమారు 46 శాతం ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 5 నుంచి 6 సంవత్సరాలో సగానికి పైగా జనాభా తెలంగాణలో పట్టణాల్లో నివసించనుంది. గత ఐదు వేల సంవత్సరాలుగా జరిగిన పట్టణీకరణ కన్నా ఎక్కువగా, రానున్న 50 సంవత్సరాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఉత్తమ అవకాశాలు, వసతుల కోసం ప్రజలు పట్టణాలకు భారీగా తరలి వస్తున్న నేపథ్యంలో పట్టణాల్లోని మౌలిక వసతుల కల్పన అత్యంత సవాలుగా మారింది.
ఒకప్పుడు గాంధీ మహాత్ముడు అన్నట్టు భారతదేశం గ్రామాల్లో నివసిస్తే భారతదేశాన్ని నడిపిస్తున్నది మాత్రం పట్టణాలే. తెలంగాణలో గత ఏడు సంవత్సరాల్లో రెట్టింపు అయిన GSDP లో సింహభాగం పట్టణాల నుంచి వస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఆలోచన మేరకు 68 గా ఉన్న వాటిని 142కు పెంచా. నూతన పురపాలక చట్టం తీసుకువచ్చి ప్రజల కేంద్రంగా అనేక సంస్కరణలను చేపట్టాం. మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలను స్థానిక పురపాలికల పైన భారం వేయకుండా తాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వమే చేపడుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి కింద పేర్కొన్న ప్రధానమైన లక్ష్యాలను అన్ని పురపాలికలు సాధించాలని మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
‘‘ప్రతి పట్టణంలో మోడల్ మార్కెట్లు, డిజిటల్ డోర్ నెంబరింగ్, ఆధునిక దోబీ ఘాట్ లు, మానవ వ్యర్థాల శుద్ధి, నిర్వహణ ప్లాంట్, మోడల్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ లు, వైకుంఠ గ్రామాలు ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్, బయో మైనింగ్ వంటి లక్ష్యాలను సాధించాలని కేటీఆర్ సూచించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్దేశించిన హరిత హారానికి సంబంధించిన లక్ష్యాలను పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలి. ప్రభుత్వం చట్ట ప్రకారం నిర్దేశించిన టీఎస్ బి పాస్ ప్రకారం అనుమతులను ఎట్టి పరిస్థితుల్లో 21 రోజుల్లో ఇచ్చేలా తీసుకోవాలి. ఈ విషయంలో ఏ అధికారి గానీ ప్రజా ప్రతినిధి కానీ అవకతవకలకు పాల్పడితే, చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. ఇప్పటికే పట్టణాలకు సంబంధించిన అభివృద్ధి విషయంలో అద్భుతమైన ప్రగతి కార్యక్రమాల నేపథ్యంలో ప్రతి పురపాలిక తన ప్రగతి ప్రస్థానంపై ఒక నివేదికను సిద్ధం చేయాలి. జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి ప్రతి పురపాలికల్లో చేపట్టిన అభివృద్ధిని నగర పౌరుల ముందు ఉంచేలా చర్యలు తీసుకోవాలి.’’ అని కేటీఆర్ అన్నారు.