Koppula Eshwar: బీజేపీకి దళితులపై ప్రేమ ఉంటే మేనిఫెస్టోలో ఆ ఒక్కటి చేర్చండి - కొప్పుల ఈశ్వర్
Koppula Eshwar: దళితులపై బీజేపీకి నిజంగా ప్రేమ ఉంటే.. మేనిఫెస్టోలో దళితబంధు పెట్టాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ అయ్యారు. దేశ వ్యాప్తంగా దళితులందరికీ దళితబంధు ఇవ్వాలని సూచించారు.
Koppula Eshwar: దళితులపై బీజేపీ పార్టీలకు, కేంద్ర ప్రభుత్వానికి నిజంగా ప్రేమ ఉంటే.. దేశ వ్యాప్తంగా ఉన్న దళితులందరికీ దళితబంధు ఇవ్వాలని తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రకటించబోయే మేనిఫెస్టోలో దళితబంధు పెట్టాలని సూచించారు. ఈ రెండు చేస్తే బీజేపీకి నిజంగానే దళితులపై ప్రేమ ఉందని నమ్ముతానని చెప్పారు. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ ఎల్.రమణతో కలిసి ఆయన మాట్లాడుతూ బీజేపీపై ఫైర్ అయ్యారు. దేశంలో దుర్మార్గ పాలన నడుస్తోందని కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.
బీజేపీకి దళితులపై ప్రేమ ఉంటే దేశవ్యాప్తంగా దళిత బంధును అమలు చేయాలి : మంత్రి శ్రీ @Koppulaeshwar1 pic.twitter.com/hkFFCGx68q
— TRS Party (@trspartyonline) September 4, 2022
మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు..
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు, అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయని అలాగే సామాజిక బహిష్కరణలు కూడా జరుగుతున్నాయని మంత్రి ఈశ్వర్ తెలిపారు. ఉత్తర ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో దళితులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. బీజేపీకి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై ప్రేమ ఉండదని మంత్రి కొప్పుల తెలిపారు. దళిత బంధు నిర్ణయం తీసుకొని సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో దళితబంధుపై సమీక్షలు జరుపుతామని అన్నారు. బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు తెలగాణ విలీన దినోత్సవాన్ని వాడుకోవాలని చూసిందని కొప్పుల విమర్శించారు.
దిల్లీ నుంచి గల్లీకొచ్చి మోదీ ఫొటో అడుగుతున్నారు..
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రానికి వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆరోపించారు. దిల్లీ నుంచి గల్లీకి వచ్చి ప్రధాని మోదీ ఫొటో పెట్టమని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు గుజరాత్ లో ఆయన ఫొటో పెట్టారా అని ప్రశ్నించారు. కేంద్రం నిధులు ఉపయోగిస్తే మోదీ ఫొటో పెట్టాల్సిందేనని కేంద్ర మంత్రి మాట్లాడటంలో ఔచిత్యం లేదన్నారు. తెలంగాణకు వచ్చి మూడు విమర్శలు, ఆరు అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేస్తామంటే ఇక్కడి తెలంగాణ సమాజం ఊరుకోదని అన్నారు. కష్టపడి పని చేసే ఐఏఎస్ అధికారిపై పైర్ అవ్వడం సరైన పద్దతి కాదని మెతుకు ఆనంద్ అన్నారు.
మంత్రి కేటీఆర్ ఫైర్..
తెలంగాణ అప్పులపై కేంద్ర ఆర్థికశాఖ నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కేంద్రం చేసిన అప్పులపై ఘాటుగా స్పందించిన కేటీఆర్ ట్వీట్ చేశారు. 2014 ముందు 67ఏళ్ల స్వతంత్ర దేశంలో 14 మంది ప్రధానులు మారినా దేశం అప్పు రూ.56 లక్షల కోట్లు మాత్రమే అన్నారు. కానీ బీజేపీ అధికారం చేపట్టిన గత ఎనిమిదేళ్లలో రూ.100 లక్షల కోట్లకు అప్పు పెరిగిందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం వల్ల ప్రతి భారతీయుడిపై రూ.1.25 లక్షల అప్పు ఉందన్నారు. ఆర్థిక విషయాలపై అనర్గళంగా మాట్లాడుతున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్రం అప్పులపై మాట్లాడాలన్నారు. 2022లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.78 లక్షలు అయితే జాతీయ తలసరి ఆదాయం కేవలం రూ.1.49 లక్షలుగా ఉందన్నారు. తెలంగాణ జీఎస్‌డీపీ కేవలం 23.5 శాతంగా ఉందన్నారు. దేశ జనాభాలో 2.5 శాతంగా ఉన్న తెలంగాణ దేశ జీడీపీలో ఐదు శాతం వాటా కలిగి ఉందన్నారు.
బీజేపీ పాలిత ప్రాంతాలు తెలంగాణ కన్న మెరుగ్గా పనిచేస్తే భారత్ 4.6 ట్రిలియన్ డాలర్ల ఎకానమికి ఎదిగేదని కేటీఆర్ చురకలు అంటించారు. తెలంగాణ పన్నుల ద్వారా కేంద్రానికి ఇస్తున్న ప్రతీ రూపాయిలో కేవలం రూ.0.46 పైసలు మాత్రమే తిరిగి ఇస్తున్నారని ఆరోపించారు. మిగిలిన డబ్బులు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నారని, ఆ రాష్ట్రాల్లోని పీడీఎస్ షాపుల వద్ద థ్యాంక్స్ టు తెలంగాణ అనే బోర్డులు పెడతారా? అని నిర్మలా సీతారామన్ ను ప్రశ్నించారు.