(Source: ECI/ABP News/ABP Majha)
Minister Indrakaran Reddy: అటవీ సంరక్షణ, పునరుద్దరణ పనుల్లో మనమే ముందున్నాం - ఇంద్రకరణ్ రెడ్డి
Minister Indrakaran Reddy: తెలంగాణలో అడవుల సంరక్షణ అద్భుతంగా ఉందని దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
Minister Indrakaran Reddy: తెలంగాణ రాష్ట్రం దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని... యూపీ అటవీ శాఖ మంత్రి కుడా తెలంగాణలోని పచ్చదనాన్ని చూసి అబ్బురపడ్డారని రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అడవుల సంరక్షణ అద్భుతంగా ఉందని దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని, తెలంగాణలో పర్యటించిన కేంద్ర మంత్రులు, సీఎం లు, ఇతర రాష్ట్రాల మంత్రులు, ప్రతినిధులు పచ్చదనం పెంపుకు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయంటూ కితాబునిస్తున్నారని ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిన్న తెలంగాణలో పర్యటించిన ఉత్తర ప్రదేశ్ అటవీ శాఖ మంత్రి అరుణ్ కుమార్... హరిత హారంలో నాటిన మొక్కలు, అటవీ పునరుద్ధరణ పనులు బాగున్నాయని అభినందించారని తెలిపారు.
అమరవీరులకు మంత్రి నివాళి..
అడవులను, వణ్యప్రాణులను కాపాడే క్రమంలో అటవీశాఖ సిబ్బంది కనబరిచిన త్యాగాలకు విలువ కట్టలేమని మంత్రి అన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమరులకు ఘనంగా నివాళి అర్పించారు. అటవీ అభివృద్ది సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్, ఎం. డొబ్రియల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్ జైశ్వాల్, అటవీ శాఖ సలహాదారు ఆర్.శోభ, రిటైర్డ్ పీసీసీఎఫ్ లు పీ. మల్లిఖార్జున్ రావు, మునీంద్ర, ఇతర అధికారులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్కు వద్ద స్మారక చిహ్నంపై పుష్పగుచ్చాలు ఉంచి అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. అమరులైన అటవీ అధికారుల సేవలను గుర్తు చేసుకున్నారు.
ధైర్య సాహసాలతో విధుల నిర్వహణ..
1984వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు మన రాష్ట్రంలో 21 మంది అటవీ అధికారులు ధైర్య సాహసాలతో, అంకిత భావంతో పని చేస్తూ అటవీ సంపదను కాపాడటంలో తమ ప్రాణాలు కోల్పోయారని మంత్రి అన్నారు. ప్రకృతి వనరులను రక్షించడంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది నిరంతర సేవలందిస్తున్నారని తెలిపారు. వన్య ప్రాణులు, స్మగ్లర్లు అడవుల్లో ఉన్నప్పటికీ, భూ ఆక్రమణదారులు దాడులు జరుపుతున్నప్పటికీ భయపడకుండా, అన్నింటినీ ఛాలెంజ్ గా తీసుకుని తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అటవీ అధికారులు, సిబ్బంది పనిచేస్తుండటం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రకృతి వనరులను కాపాడటం, వన్య ప్రాణుల సంరక్షణకు వారు ఎంతో శ్రమిస్తున్నారని, ఈ క్రమంలో ఎంతో మంది అటవీ శాఖ ఉద్యోగులు, సిబ్బంది తమ ప్రాణాలను సైతం కొల్పోయారని వెల్లడించారు. వారందరికీ అటవీ శాఖ తరపున నివాళులర్పిస్తున్నానని ప్రకటించారు.
అటవీ సంపద కాపాడేందుకు నిబ్ధతతో కృషి..
అటవీ సంరక్షణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఇప్పటికే అటవీ సంపదను కాపాడే విషయంలో ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేస్తున్నారని అభినందించారు. అమరులైన వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అటవీశాఖ పనితీరును మంత్రి వివరించారు. 2021- 2022వ సంవత్సరంలో అటవీ అధికారులు అటవీ రక్షణలో భాగంగా మొత్తం 11,669 కేసులను నమోదు చేసి, రూ.14.07 కోట్ల జరిమానాను విధించారు. రూ. 7.31 కోట్ల విలువ చేసే కలపను స్వాధీనం చేసుకున్నారు. 1634 వాహనాలను జప్తు చేశారు. 1133 అటవీ భూ ఆక్రమణ కేసులు నమోదు చేశారని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
అటవీ శాఖను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగులను, సిబ్బంది నియామకాలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఈ సంవత్సరం 92 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు (FSO's) 14 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు (FROs), 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల (FBO's) ఉద్యోగాల నియామకాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అంతే కాకుండా అటవీ అధికారులు, సిబ్బందికి 2173 వాహనాలను అందజేసింది. జంగిల్ బచావో - జంగిల్ బడావో నినాదం ద్వారా ఇప్పటికే ఉన్న అడవుల రక్షణతో పాటు క్షీణించిన అడవుల పునరుజ్జీవనం కొరకు ప్రజల భాగస్వామ్యంతో పెద్ధ ఎత్తున చర్యలు తీసుకొంటున్నామని మంత్రి తెలిపారు.
ఇప్పటివరకు 268.75 కోట్ల మొక్కలు..
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మార్గనిర్దేశనం మేరకు పోలీస్ శాఖ సహకారంతో అడవుల రక్షణ మరియు స్మగ్లింగ్ కార్యకలాపాలను అరికట్టడం కోసం అనేక సమగ్ర చర్యలు ప్రారంభించబడ్డాయని మంత్రి వెల్లడించారు. అడవుల రక్షణతో పాటు తాగు నీటి కోసం వన్యప్రాణులు జనారణ్యంలోకి రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం. శాఖాహార జంతువుల కోసం గడ్డి క్షేత్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అడవి సరిహద్దులు సరి చూసుకొని పెంపుడు జంతువులు, పశువులను నియంత్రించే కందకాలను 10,732 కి.మీ పొడవున త్రవ్వి దీనిపై గచ్చకాయ మొక్కలు నాటుట ద్వారా అడవి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రపంచంలోనే పచ్చదనం పెంపుదలలో మూడవ అది పెద్ద మానవ ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన “తెలంగాణకు హరితహారం పథకం” ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 268.75 కోట్లకు పైగా మొక్కలను నాటామని మంత్రి వెల్లడించారు.